
టార్గెట్.. ట్యాక్స్
బల్దియాల్లో ఎర్లీబర్డ్ ఆఫర్
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూళ్లే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లలో రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీలు పురోగతి సాధించాయి. అలాగే, ఈనెల 30 వరకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందుస్తుగా చెల్లించేవారికి, రాష్ట్ర పురపాలక శాఖ ఎర్లీబర్డ్ ఆఫర్ పేరుతో 5 శాతం రాయితీ కల్పించింది. ఈ ఆఫర్‌లో ముందస్తు ఆస్తి పన్ను కూడా భారీగా వసూళ్లు చెయ్యాలని మున్సిపల్ కమిషనర్లకు టార్గెట్లు విధించినట్లు తెలిసింది. పన్ను వసూళ్లు చేయడంలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించాలని రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో శుక్రవారం అధికారులు, ఉద్యోగులను అభినందించి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి ఎర్లీబర్డ్ ద్వారా భారీగా పన్ను వసూళ్లు చెయ్యాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది.
15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు..
15వ ఆర్థిక సంఘం గ్రాంట్ పొందడానికి రామగుండం బల్దియాతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు అర్హత సాధించాయి. మూడు బల్దియాల్లో ఆశించినస్థాయిలో ఆస్తి పన్ను వసూళ్ల కాగా, మంథని మున్సిపాలిటీ కాస్త వెనకబడింది. మంథనిలో డిమాండ్ తక్కువగా ఉండడమే కారణంగా భావిస్తున్నారు.
ఎర్లీబర్డ్‌కు రూ.4కోట్ల టార్గెట్
రామగుండం బల్దియా అధికారులు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.4కోట్ల వరకు ఆస్తి పన్ను వసూళ్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎర్లీబర్డ్ ఆఫర్‌పై విస్తృతంగా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
ఎర్లీబర్డ్ ఆఫర్‌లో రామగుండం బల్దియా వసూళ్ల తీరు..
ఆర్థిక సంవత్సరం ముందుస్తు వసూళ్లు 2019-20 రూ.82.92 లక్షలు
2020-21 రూ.1.13 కోట్లు
2021-22 రూ.1.14 కోట్లు
2022-23 రూ.1.55 కోట్లు
2023-24 రూ.1.54 కోట్లు
2024-25 రూ.1.60 కోట్లు
ఆస్తిపన్ను వసూళ్లలో బల్దియాల పురోగతి
బల్దియాలు డిమాండ్ వసూళ్లు
రామగుండం రూ.14.76 కోట్లు రూ.10.70 కోట్లు
పెద్దపల్లి రూ.5.45 కోట్లు రూ.4.48 కోట్లు
సుల్తానాబాద్ రూ.2.54 కోట్లు రూ.1.85 కోట్లు
మంథని రూ.1.74 కోట్లు రూ.1.40 కోట్లు
ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవారికి చాన్స్
30లోపు చెల్లిస్తే 5శాతం రాయితీ
వసూళ్లపై దృష్టి పెట్టిన మున్సిపల్ కమిషనర్లు
పరిశ్రమల నుంచి రాబట్టేందుకు..
రామగుండం బల్దియాలోని ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లు చెయ్యాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది ఎన్టీపీసీ రూ.2.21కోట్లు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రూ.1.27 కోట్ల వరకు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించాయి. ఈసారి కూడా ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు సింగరేణి నుంచి ముందుస్తు ఆస్తి పన్ను చెల్లించేలా ఆయా సంస్థలకు లేఖలు పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని బల్దియాల పరిధిలోని రైస్‌మిల్లులు, బడా వ్యాపారస్తులకు అవగాహన కల్పించి ముందస్తు పన్ను వసూలు చెయ్యాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిసింది.
విస్తృత ప్రచారం చేస్తాం
ఎర్లీబర్డ్ ఆఫర్‌పై జిల్లాలోని నాలుగు బల్దియాల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నాం. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఆస్తిపన్నుతోపాటు టౌన్‌ప్లానింగ్ నుంచి ఆదాయం సమకూరుతోంది. కానీ రామగుండం బల్దియాలో ఆశించినస్థాయిలో ఆదాయం రావడం లేదు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టతరంగా మారింది. అందుకే ఆస్తి పన్ను వసూళ్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాం. మంథనిలో కూడా ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటాం.
– జె.అరుణశ్రీ, అదనపు కలెక్టర్

టార్గెట్.. ట్యాక్స్

టార్గెట్.. ట్యాక్స్