
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ నేతల బృందం ఇవాళ(గురువారం) ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.
సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) జరగడం దురదృష్టకరం. కానీ, ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని.. అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారాయన.
ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొంతన లేదు. హెలికాప్టర్‌లో వెళ్తున్న మంత్రులు పోటాపోటీగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించడం లేదు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది.
రేవంత్‌కు కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎనిమిది మంది ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. అబద్ధాలు మాట్లాడుతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి. ఎక్కడా SLBC సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. మొత్తం పది ఏజెన్సీలకు డైరెక్షన్ కరువైంది. సహాయక చర్యల్లో విఫలమై.. బీఆర్‌ఎస్‌పై బుదరల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను చూడటానికి, మా అనుభవంతో సూచనలు చేయడానికి వెళ్తున్నాం. మూర్ఖులు మమ్మల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం
బీఆర్‌ఎస్ హయాంలోనే పనులు
కరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో SLBC పనులు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే BRS ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం. కాంగ్రెస్ హయంలో పనులు మూలకు పడితే.. రూ.100 కోట్ల రూపాయల మొబలైజేషవ్ నిధులిచ్చాం. మా హయాంలో 13 కిలోమీటర్లు పని జరిగింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి BRS పై బుదర జల్లుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది SLBC సహాయక చర్యలపై. తన పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీష్ రావు అన్నారు.

సోయిలేకుండా మాట్లాడుతున్నారు
ఎస్సెల్బీసీలో జరిగిన ప్రమాదం.. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకపోవడం దురదృష్టకరం. బీఆర్‌ఎస్ తరఫున ఈ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. ఇవాళ హరీశ్ రావు నేతృత్వంలో ఎస్సెల్బీసీ వెళ్తున్నాం. ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేస్తాం. తెలంగాణ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వాటర్, నీళ్లు కలిశాయి అని మాట్లాడటం బాధాకరం. మంత్రుల తీరు జాతీయ స్థాయిలో పరువు తీసేలా ఉంది. అందుకే ఆ పదవుల్లో ఉండాలో లేదో వాళ్లే తేల్చుకోవాలి.
::నల్లగొండలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి