
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో ఎంపీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడికే సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా అనే అనుమానం కలుగుతోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని, అదే సమయంలో అధికార పార్టీ దుబ్బాక బంద్‌కు పిలుపునివ్వడాన్ని కూడా తాము ఖండిస్తున్నామని తెలిపారు. ‘దర్యాప్తు సంస్థలను, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ చేస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బంద్ దేని కోసం.. ఎవరిపై బంద్ చేస్తున్నారు? మీ పాలనపై మీరే బంద్ చేసుకుంటున్నారా.. బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారా’అని ప్రశ్నించారు.
నిందితుడిని పట్టుకున్న తర్వాత ఇందుకు సంబంధించిన నిజానిజాలను విచారించి ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం, ఆ బాధ్యతను విస్మరించి ప్రతిపక్షాలపై దు్రష్పచారం చేయ డం తగదని ఆ ప్రకటనలో భట్టి హితవు పలికారు. దాడి ఘటనపై విచారణ జరిపి నిజానిజా లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.