
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. హిందీ భాష విషయంలో కేంద్రంపై స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే హిందీ కారణంగా 25 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ పౌరుడు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా వీడియోలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి త్రిభాష విధానం అమలు ఒకటి అయితే, మరొకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. నియోజకవర్గాల విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తోంది. కేంద్రం తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో.. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం దీనికి సంఘీభావం తెలిపాయి. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
అంతకుముందు కూడా కేంద్రంపై స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. హిందీ కారణంగా దేశంలో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ஒரே இலக்கு!
தமிழ்நாடு போராடும்!
தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025