LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్‌ సెటైర్లు | Political Words Exchange Between Amit Shah And CM Stalin Over Hindi | Sakshi
Sakshi News home page

LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్‌ సెటైర్లు

Published Fri, Mar 7 2025 12:07 PM | Last Updated on Fri, Mar 7 2025 12:23 PM

Political Words Exchange Between Amit Shah And CM Stalin Over Hindi

సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్‌ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్‌ రాజకీయం సరికాదన్నారు.  

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమానికి అమిత్‌ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్‌ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్‌, మెడికల్‌ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్‌ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్‌(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్‌ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్‌ మానుకోవాలి’ అని కామెంట్స్‌ చేశారు.

అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్‌ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్‌ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.

త్రిభాష విషయంలో.. ఎల్‌కేజీ విద్యార్థి పీహెచ్‌డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్‌ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement