
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే లాభాలు
శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ
వట్‌పల్లి(అందోల్): అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే దిగుబడి పెరిగి లాభసాటిగా ఉంటుందని సంగుపేట ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అన్నారు. శుక్రవారం అందోలు మండల పరిధిలోని అల్మాయిపేట గ్రామంలో అధిక సాంద్రత పత్తి పంట సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ పత్తి సాగు కంటే ఈ అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే మేలైన దిగుబడి, మొక్కల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎకరాకు 22 వేల నుంచి 25 వేల వరకు మొక్కలు వస్తాయన్నారు. ఒకేసారి పూత కాత వచ్చి పంట తొందరగా చేతికి వస్తుందన్నారు. తద్వారా గులాబీ రంగు, కాయ తొలుచు పురుగు బారి నుంచి తప్పించుకొని నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి కుమార్, ప్రతాప్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీహరి, ఏఈఓ లక్ష్మీకాంత్, రేఖా మనోజ్, శ్రీకాంత్, ఓ.ఆకాశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి రవాణా కేసులో
ఇద్దరికి పదేళ్ల జైలు
రామచంద్రాపురం(పటాన్ చెరు): గంజాయి రవాణా కేసులో ఇద్దరికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. కొల్లూరు పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన కార్తీక్ రవికిరణ్ దేశ్ముఖ్, కమల్ సంజయ్ ఇద్దరూ కలిసి 2023 సెప్టెంబర్‌లో కారులో గంజాయిని విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు అప్పట్లో పోలీసులు ఓఆర్‌ఆర్ కొల్లూరు వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నిందితులను మొదటి అదనపు న్యాయమూర్తి జయంతి ఎదుట హాజరుపర్చగా ఇద్దరికీ 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరరావు వాదించారు. నిందితులకు శిక్ష పడటంలో ముఖ్య పాత్ర వహించిన అప్పటి సీఐ సంజయ్ కుమార్, ప్రస్తుత సీఐ రవీందర్, కోర్ట్ కానిస్టేబుల్ నర్సింహులు, ఏఎస్‌ఐ రవీందర్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
జేసీబీ గుంతలో పడి
యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): ప్రమాదవశాత్తు చెరువు జేసీబీ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతగోని ఆగమయ్య గౌడ్ పెద్ద కుమారుడు రాము గౌడ్(27)కు చెవులు వినిపించవు. పాడి గేదెలను మేపుతూ వస్తున్నాడు. గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం గేదెలు ఇంటికి వచ్చినప్పటికీ రాము గౌడ్ మాత్రం రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామంలోని పెద్ద చెరువు వద్ద వెతుకుతుండగా జేసీబీ గుంత వద్ద చెప్పులు కనిపించాయి. మత్స్యకారులతో కలిసి రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా నీటిపై రాము గౌడ్ మృతదేహం కనిపించింది. కాలుజారి ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చెక్‌డ్యాంలో మునిగి
మరో యువకుడు
పాపన్నపేట(మెదక్): చెక్ డ్యాంలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. ఏఎస్‌ఐ సంగన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి అనిల్ (22) కూలీ పనులతోపాటు, స్టార్ కలెక్షన్ బిల్లులు వసూలు చేస్తుంటాడు. గురువారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు గ్రామశివారులో వెతికినప్పటికీ జాడ దొరక లేదు. శుక్రవారం ఉదయం మంజీరా నదిలో నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద అనిల్ బైక్ కనిపించింది. అనుమానంతో నదిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతిపై తండ్రి పోచయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఆలయంలో చోరీ
మునిపల్లి(అందోల్): పెద్దచల్మెడ దుర్గా భవానీ అమ్మవారి దేవాలయంలో వెండి కిరీటం, బంగారు జింకలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాజేశ్ నాయక్ తెలిపారు.

అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే లాభాలు