
బస్సు వచ్చే.. బాధలు తీరే
● సొంత నిధులతో కలెక్టర్
మనుచౌదరి బస్సు ఏర్పాటు
● గురువన్నపేట ప్రభుత్వ
పాఠశాలకు అందజేత
● మూడు గ్రామాల విద్యార్థులకు
తీరిన కష్టాలు
కొమురవెల్లి(సిద్దిపేట): తమ గ్రామాలకు పాఠశాల దూరంగా ఉందని, కాలినడకన రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని గురువన్నపేట పాఠశాల విద్యార్థులు కలెక్టర్ మను చౌదరికి తమ కష్టాలను చెప్పుకున్నారు. వెంటనే స్పందించి ఆయన సొంత నిధుల నుంచి పాఠశాలకు బస్సు వేయించారు.
సుమారు 212 మంది విద్యార్థులు
మండలంలోని గురువన్నపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సుమారు 212 మంది విద్యార్థులు గురువన్నపేట, పోసాన్‌పల్లి, కొండపోచమ్మ గ్రామాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల మూడు గ్రామాలకు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిల్లలు నడిచి వెళ్లలేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేశారు. దీనికి నెలకు ఒక విద్యార్థికి రూ.700 చొప్పున చెల్లిస్తున్నారు.
రూ.17 లక్షలు వెచ్చించి
విద్యార్థుల సామర్థ్యలు పెంపొందించేందుకు గురువన్నపేట ఉన్నత పాఠశాలలో మార్చి 15న కలెక్టర్ మనుచౌదరి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కలెక్టర్‌తో మాట్లాడారు. తమ గ్రామాలకు పాఠశాల దూరంగా ఉందని, రావడానికి వెళ్లడానికి చిన్న పిల్లలు, ఆడ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని బస్సును వేయించాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సొంత నిధుల నుంచి సూమారు రూ.17 లక్షలు ఖర్చు పెట్టి బస్సును కొనుగోలు చేసి పాఠశాలకు అందజేసి వారి కష్టాలను తీర్చారు. మూడు గ్రామాలకు కలిపి గ్రామానికి ఒక ట్రిప్పు చొప్పు బస్సు వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుంది.
చాలా సంతోషంగా ఉంది
కోరిన వెంటనే కలెక్టర్ మా పాఠశాలకు బస్సు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులం అందరం కలెక్టర్‌కు రుణపడి ఉంటాం. ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనానికి నెలకు రూ.700 చెల్లించడంతో తల్లిండ్రులపై అధిక భారం పడేది. పాఠశాలకు కలెక్టర్ బస్సు ఇవ్వడంతో ఆ భారం తగ్గింది.
– పుట్ట పవిత్ర 9 తరగతి విద్యార్ధిని
12 మందితో కమిటీ
పాఠశాలకు కలెక్టర్ బస్సు అందజేయడం శుభపరిణామం. బస్సు మెయింటెనెన్స్ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థులకు మంచి బోధనను అందించేందుకు పాఠశాల ఉపాధ్యాయులం అందరం కృషి చేస్తాం. విద్యార్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– రాజు, ఉన్నత పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు

బస్సు వచ్చే.. బాధలు తీరే

బస్సు వచ్చే.. బాధలు తీరే