
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలం రంగంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోసన్న గారి యాదగిరి, రామమ్మ దంపతుల చిన్న కుమారుడు రంజిత్ కుమార్(22) 6న రాత్రి కోనాపూర్‌లో స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కోనాపూర్ శివారు మార్గమధ్యలో బైక్ పూర్తిగా దెబ్బతిని, తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న రంజిత్ కుమార్‌ను అటు వైపు వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడిపై ఎవరో దాడి చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మంచంపై నుంచి కిందపడ్డ వ్యక్తి..
పాపన్నపేట(మెదక్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చీకోడ్‌లో శనివారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పెంటారెడ్డి (72) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 3న ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ప్రమాద వశాత్తు కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో మొదట స్థానికంగా వైద్యం చేయించారు. 11న మెరుగైన వైద్యం కోసం మెదక్‌కు అక్కడి నుంచి హైద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి