జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. | - | Sakshi
Sakshi News home page

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

Published Sun, Apr 13 2025 7:55 AM | Last Updated on Sun, Apr 13 2025 7:55 AM

జానపద

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

● గతంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు గొంతెత్తిన గళాలు ● ప్రస్తుతం సోషల్‌ మీడియా ఫోక్‌ స్టార్స్‌గా జిల్లా యువతీ, యువకులు ● వందల సంఖ్యలో పాటలు, లక్షల్లో వ్యూస్‌ ● పల్లె పదాల పాటల్లో నటిస్తూ.. ఆడుతూ పాడుతూ

దివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ..

సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి దివ్యాంగుడైనా కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ.. పల్లె సవ్వడి ఛానెల్‌ ద్వారా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. 6 పాటలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాడు.

దుబ్బాకటౌన్‌: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గజ్జె కట్టి, మైక్‌ పట్టి ధూంధాం వంటి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన ఎంతో మంది కళాకారులు యూట్యూబ్‌ను వేదికగా చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. యూట్యూబ్‌ల్లో లక్ష్యల్లో వ్యూస్‌ పొందుతున్నారు.

రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాలతో

మనం నేర్చుకున్న విద్య, చేస్తున్న వృత్తి, జీవితంలో ఎంచుకున్న మార్గం పెద్దల బాటల్ని బట్టే ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి సాహిత్యంలో మంచి గౌరవం ఉన్నట్లే భార్గవి తల్లి భూదవ్వకు మంచి గుర్తింపు ఉంది. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాల్లో జానపద పాటలతో అలరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల్లో తన ఆట, పాటలతో జనాన్ని కట్టి పడేసింది. ప్రస్తుతం జాన పదాలను పాడుతూ.. తానే స్వయంగా నటిస్తూ యూట్యూబ్‌లో ఫోక్‌ స్టార్‌గా పేరు గాంచింది. ప్రముఖ జానపద గాయకుడు కళాకారుడు శ్రీనివాస్‌ భార్గవిని చాలా ప్రోత్సహించేవాడు. ఆయన అప్పటికే జానపదాలు పాడుతుండేవాడు. డప్పు కొట్టుకుంటూ పాడడం, డ్యాన్స్‌ చేస్తూ పాడడం నేర్పించి కొత్త భార్గవిగా తయారు చేశాడు. ఆయన వల్లె రేలారే రేలాలో భార్గవికి అవకాశం వచ్చింది.

కళను నేర్పిన కళాకారుడితోనే వివాహం

పాటతో ప్రారంభమైన భార్గవి జీవితంలో మరో పాటగాడు ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు.. ఆట, పాట నేర్పిన కళాకారుడు ముక్కపల్లి శ్రీనివాస్‌ను భార్గవి వివాహం చేసుకుంది. భార్గవి, శ్రీనివాస్‌ కలిసి పాడి నటించిన.. కుటుంబ నేపథ్యానికి చెందిన జానపదాలైన బంతి పూల వాసన నీ బానిన్ల, చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు, పోంగ పోంగా పొట్లా చెరువు, కొత్త కుండాల రెండిత్తునాలత్తో .. వంటి పాటలు అధ్యశ్రీ మ్యూజిక్‌ ద్వారా యూట్యూబ్‌లో విడుదలై ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి.

మరికొందరు కళాకారులు

దుబ్బాక మండలం పెద్ద చీకోడ్‌ గ్రామానికి చెందిన కమ్మరి నర్సింలు, పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన బిట్ల ఎల్లం, దుబ్బాకకు చెందిన తుమ్మల ఎల్లంఆస రామారావు, తదితర కళాకారులు, కవి గాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి నేడు సోషల్‌ మీడియా ద్వారా తమ కళను నిరూపించుకుంటున్నారు.

హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి

మూడు తరాల నుంచి మా ఇంట్లో జానపదాలు జాలువారుతూ వస్తున్నాయి. జాన పదాలంటే నాకు ప్రాణం. ధూంధాంలో వివిధ సభల్లో జాన పదాలు పాడుతుంటే ఆడ పిల్లవైన నీకు ఈ సభలలో పాడడం అవసరమా అని చాలా మంది హేళన చేసేవారు. కానీ వారే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అమ్మ నేర్పిన పాటను జీవన పాఠంగా నేర్చుకొని గురువు నేర్పిన బాటలో ముందుకు సాగుతున్నాను. ఇప్పటి వరకు 10 పాట్లల్లో నటించగా, ఆధ్యశ్రీ మ్యూజిక్‌ ఛానల్‌కు 2.90 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాను.

–ముక్కపల్లి భార్గవి

సోపతి మ్యూజిక్‌ సత్తా చాటుతూ..

సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పిల్లి కార్తీక్‌ ముదిరాజ్‌ 2019 సంవత్సరంలో వస్తావ పిల్ల ఓ మధుబాల పాట ద్వారా పరిచమమై సోపతి యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా సత్తా చాటుతున్నాడు. 30కి పైగా పాటల్లో నటించి జిల్లాలో ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల ప్రారంభించిన సోపతి యూట్యూబ్‌ ఛానల్‌కు 7 వేల మందికి పైగా సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. అత్తని చూడది అన్నమెయ్యది పాట 1.5 మిలియన్‌ వ్యూస్‌తో మంచి ఆదరణ పొందింది.

పీఎం క్రియేషన్స్‌: 8 లక్షల సబ్‌స్క్రైబర్లు

సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల గ్రామానికి చెందిన పార్వతీ మహేశ్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగంలో కళాకారుడిగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో పలు వేదికల్లో ఆట, పాటతో అలరించాడు. పీఎం క్రియేషన్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పల్లె పదాలను అందిస్తున్నాడు. మంచి పాటల రచయితగా గుర్తింపు పొందిన మహేశ్‌ 50 పాటలు పైగా రచించి, 30 పాటలకు ప్రొడ్యూస్‌ చేశాడు. 40 పాటల్లో నటనతో అలరించాడు. 8 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. భార్య సంజన సైతం సింగర్‌ కావడం విశేషం. నాయి దొరో.. నా రాజమని పాట 100 మిలియన్‌ వ్యూస్‌తో జనాధారణ పొందింది.

200 పైగా పాటల్లో మౌనిక డింపుల్‌

మౌనిక డింపుల్‌ డ్యాన్స్‌లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దాదాపు 200కు పైగా పల్లె పదాల పాటల్లో నటించింది. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మౌనిక మొదట సైడ్‌ డ్యాన్సర్‌గా వచ్చి డ్యాన్స్‌లో మెళుకువలు నేర్చుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎంతో మంది ఆదరాభిమానాలు పొందింది. పల్లెదనం ఉట్టిపడేలా పల్లెటూరి యువతీల పాటల్లో నటిస్తూ హోరెత్తిస్తుంది. ఇన్‌స్ర్ట్రాగమ్‌లో రీల్స్‌ చేస్తూ..ముందుకు సాగుతుంది. డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నేను 200 పల్లె పదాల్లో నటించడానికి నా గురువులే కారణం. నన్ను ప్రోత్సహించిన కార్తీక్‌ ముదిరాజ్‌, హరీశ్‌ పటేల్‌కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది.

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 1
1/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 2
2/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 3
3/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 4
4/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 5
5/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ.. 6
6/6

జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement