Sangareddy District Latest News
-
సిరూర్, దౌల్తాబాద్ గ్రామస్తుల ఆందోళన
రాయికోడ్(అందోల్): అసంపూర్తిగా ఉన్న అల్లాదుర్గం–మెటల్‌కుంట ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలని మండలంలోని సిరూర్, దౌల్తాబాద్ గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా కంపచెట్లు, ద్విచక్ర వాహనాలను అడ్డంగా ఉంచి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకర వేసి వదిలేయడంతో దుమ్ము ధూళి వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, నివాస గృహాల్లోకి దుమ్ము చేరి ఆహార పదార్థాలు పడవుతున్నాయన్నారు. పక్కనున్న పంటలపైనా పేరుకుపోయి దెబ్బతింటున్నాయన్నారు. పనులు నిలిపోవడం వల్ల వాహనదారులు తరుచూ ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారన్నారు. దుమ్ము లేస్తున్న రోడ్డుపై కనీసం ట్యాంకర్ నీటితోనైనా తడపాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు సిబ్బందితో అక్కడికి చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అడ్డుగా ఉంచిన వాహనాలు, ముళ్లకంపను తొలగించారు. వాహన రాకపోలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రహదారి నిర్మాణం పూర్తి చేయాలని వినతి పనులు అర్ధంతరంగా నిలిపేయడంపై ఆగ్రహం ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు -
కలవని చేతులు!
● సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం ● పటాన్చెరు ముఖ్యనేతల్లోను కుదరని సయోధ్య ● నారాయణఖేడ్‌లోను అదే సీన్ ● జహీరాబాద్‌లో మూడు వర్గాలుగా విడిపోయిన కేడర్ ● నేడు కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గతేడాది అధికారంలోకి వచ్చాక కూడా వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ క్యాడర్ ఎటువైపు వెళ్లాలనే దానిపై అయోమయం నెలకొంది. ఒక్క అందోల్ నియోజకవర్గం మినహా జిల్లాలో మిగిలిన నాలుగు చోట్ల అంతర్గత పోరు ఉంది. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరుకానున్నారు. మంత్రులతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల రాష్ట్ర చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. జహీరాబాద్‌లో మూడు వర్గాలు జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డిలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా తన కార్యాలయాన్ని ఇక్కడే ప్రారంభించడంతో ఈ నియోజకవర్గంలో క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయింది. సంగారెడ్డిలో ఇలా.. సంగారెడ్డి నియోజకవర్గంలో పాత, కొత్త నేతల దూరం కొనసాగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని పోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులిమామిడి రాజుతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు, పాత నేతలకు మధ్య సమన్వయం లేకుండా పోయింది. పార్టీ కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని పులిమామిడి రాజు వంటి నేతలు వాపోతున్నారు. పటాన్చెరులో ఎవరికి వారే.. పటాన్చెరు నియోజకవర్గంలో నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదరడం లేదు. మరోవైపు వీరిద్దరితో మెదక్ ఎంపీగా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధుకు కూడా దూరం పెరిగింది. ఈ నియోజకవర్గంలోను పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ క్యాడర్ మొదటి నుంచి రెండు వర్గాలుగా ఉంది. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. తద్వారా ఇద్దరు కూడా విజయం సాధించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మండల స్థాయి క్యాడర్ మాత్రం రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఓ మండలంలో ఈ రెండు వర్గాల నేతలు ఇటీవల చిన్నపాటి గొడవకు దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ విభేదాలు బయటపడలేదు కానీ అంతర్గతంగా మాత్రం రగులుతూనే ఉన్నాయనే అభిప్రాయం ఉంది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. కానీ మిగిలిన నాలుగుచోట్ల కాంగ్రెస్ క్యాడర్ ‘చేతులు’ కలవడం లేదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సోమవారం నిర్వహించనున్న పార్టీ సమీక్ష సమావేశంలో ఆయా నేతల మధ్య నెలకొన్న ఈ వర్గ విభేదాలు బహిర్గతమయ్యే అవకాశాలు లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. -
తొలిరోజు ప్రశాంతం
సోమవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2024జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ సంగారెడ్డి జోన్: గ్రూప్–3 పరీక్ష తొలిరోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సోమవారం కూడా మరో పరీక్ష ఉంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. పేపర్ 1 పరీక్షకు 15123 మంది హాజరు కావాల్సి ఉండగా 8121 మంది హాజరు కాగా 7002 మంది గైర్హాజరు అయ్యారు. పేపర్ 2 పరీక్షకు 15123 మంది హాజరు కావాల్సి ఉండగా 8045 మంది హాజరు కాగా 7078 మంది గైర్హాజరు అయ్యారు. సమయం దాటిన తర్వాత వచ్చిన పలువురు అభ్యర్థులకు అనుమతి ఇవ్వకపోవటంతో నిరాశతో వెనుదిరిగారు. నిబంధనల మేరకు కేంద్రాలలోని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు షూలను అనుమతి ఇవ్వలేదు. సమయం మించిపోవటంతో పలువురు చివరి క్షణంలో పరుగులు తీశారు. అడిషనల్ కలెక్టరు చంద్రశేఖర్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. న్యూస్‌రీల్ -
రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లవ్
జోగిపేట(అందోల్): రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. తాము కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై శాంతియుతంగా పోరాటాలు నిర్వహించామన్నారు. కానీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నేతలు కలెక్టర్ స్థాయి అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అందుకు వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్రలు బయటపడగా అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీస్థాయిలో పైరవీలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. 32 వేల ఎకరాలు ముంపునకు గురైతే 1600 మంది రైతులు కోర్టును ఆశ్రయించి ప్రతీకేసును గెలిచారన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే ఇందుకు రైతులు వ్యతిరేకించి శాంతియుతంగా 966 రోజులపాటు దీక్ష చేపట్టి రూ.12 లక్షలకు పరిహారాన్ని పెంచుకోగలిగారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలలోకి వచ్చిన 11 నెలల్లోనే 54 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల, గిరిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, మదన్‌రెడ్డి, జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి దామోదర రాజనర్సింహ -
వరి కొయ్యలను కాలిస్తే ముప్పే!
● భూమిలోని పోషకాలపై తీవ్రప్రభావం ● పంట దిగుబడి తగ్గే చాన్స్ ● వాయుకాలుష్యంతో రైతులకు చేటు ● అవగాహన కల్పనకు వ్యవసాయ శాఖ సన్నద్ధంవరి కొయ్యలు, ఆయా పంటల అవశేషాలను దహనం చేయరాదు. ఒకవేళ చేస్తే తీవ్ర నష్టం జరగొచ్చు. భూమిలోని పోషకాలు తగ్గి దిగుబడి పడిపోవచ్చు. పంటకు మేలు చేసే పోషకాలుకూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం ఆవిరై భవిష్యత్‌లో పంటల ఉత్పాదకపై ప్రతికూల ప్రభావం పడనుంది. వాయుకాలుష్యం వల్ల రైతు ఆరోగ్యానికి చేటు కూడా. అందువల్ల వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు సన్నద్ధం అవుతున్నారు. మెదక్‌జోన్: మెదక్ జిల్లాలో 5 లక్షల పైచిలుకు ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 3.50 లక్షలపైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి 3 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. పంట కొయ్యలతోపాటు వాటి అవశేషాలను రైతులు కాల్చి వేస్తున్నారు. దీంతో భూసారంతో పాటు వాయుకాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. వాటిని తగలబెట్టవద్దని రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతోంది. ఒక వేళ తగలబెడితే చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి చర్యల వల్ల ఈ ప్రాంతాల్లో వాయుకాలుష్యంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బడులకు సెలవులు ఇస్తున్నారు. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో రావద్దంటే వరి, ఇతర పంటల అవశేషాలు కాల్చ వద్దని హెచ్చరిస్తున్నారు. దుక్కిలో దున్నేస్తేనే మేలు కొయ్యలు, ఇతర అవశేషాలు తగలబెట్టడంతో భూసారం దెబ్బతింటుంది. భవిష్యత్‌లో పంటల దిగుబడి గణనీయంగా తగ్గొచ్చు. వాయుకాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటిని తగలబెట్టకుండా దుక్కిలో దున్నేస్తే సేంద్రియ ఎరువులు తయ్యారవుతాయి. కొయ్యలను తగలబెట్టితే రైతులపై చర్యలు తప్పవు. – గోవింద్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి మెదక్ -
భలే బేలర్..
హార్వెస్టర్‌తో వరి కోతలు.. బేలర్‌తో గడ్డికట్టలు కట్టడం ● బేలర్ యంత్రంపై ఆసక్తి చూపుతున్న రైతులు ● ఈ ఏడాది వరి గడ్డికి భలే డిమాండ్ ● కట్టకు రూ.30 నుంచి 35 వసూలు దుబ్బాకటౌన్: కాలం మారేకొద్దీ వ్యవసాయంలో యాంత్రీకరణ వినియోగం పెరుగుతుండటమేకాదు ఏకంగా శాసిస్తోంది కూడా. ఒకప్పుడు వరి కోతలు కొడవళ్లతో కోసేవారు. రాను రాను హార్వెస్టర్లు రావడంతో కొడవళ్లతో కోతలు కనుమరుగయ్యాయి. హార్వెస్టర్‌తో కోసిన వరి పొలాల్లో గడ్డి తక్కువగా రావడంతోపాటు పొలంలో పడి వృథాగా మారుతుంది. దీంతో రైతులు పొలాల్లో వృథాగా పడి ఉన్న గడ్డిని కాల్చేస్తున్నారు. దీంతో డెయిరీ ఫారం నిర్వాహకులకు, పాల వ్యాపారంపై ఆధారపడుతున్న రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు బేలర్ యంత్రాలతో గడ్డిని కట్టలుగా కట్టించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కట్టలు కట్టిన గడ్డిని తెచ్చుకుంటూ..పశుగ్రాసం కొరత తీర్చుకుంటున్నారు. ఒక్కో కట్టకు రూ.30–35 వరిగడ్డి కట్టే బేలర్ యంత్రాలు ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. హార్వెస్టర్ కోసినప్పుడు పొలంమంతా పడిన గడ్డిని బేలర్ యంత్రం కట్టలు కడుతుంది. ఎకరం పొలంలోని గడ్డిని గంటలోపే దాదాపు 40 నుంచి 45 కట్టలు కడుతుంది. ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35 తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పెంచే రైతులు పొలంలోని గడ్డిని తీసుకెళ్లేందుకు ముందుగా రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి యంత్రంతో కట్టలు కట్టిస్తున్నారు. గడ్డికి సైతం డబ్బులు వస్తుండటంతో చాలామంది రైతులు గడ్డిని కాల్చకుండా వదిలేస్తున్నారు. సాధారణంగా మూడు నాలుగు నెలల పాటు పశుగ్రాసం వచ్చేలా రైతులు నిల్వ చేస్తుంటారు. అకాల వర్షాలతో.. వరి గడ్డికి భలే డిమాండ్ అకాల వర్షాలతో రైతులు వరి కోయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చైన్ మెషీన్లు దొరకక వరి కోతలకు నానాతంటాలు పడ్డారు. వర్షాలతో చైన్ మెషీన్లు వరి కోయడం వలన ఈసారి ఎండుగడ్డిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వరి గడ్డికి డిమాండ్ పెరిగింది. నాలుగు నెలల వరకు గడ్డి దొరికే అవకాశం లేకపోవడంతో ఆవులు, గేదెల ఫారాల రైతులు గడ్డిని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఎకరాకు రూ.2 నుంచి 3 వేల వరకు గడ్డి కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో గడ్డికి డిమాండ్ ఏర్పడుతుంది. గడ్డిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు బేలర్ యంత్రాలు రాకముందు గడ్డి వాము పెట్టాలంటే రోజుకు ఒక్క కూలీకి రూ.600 నుంచి 7 వందల వరకు చెల్లించే వాళ్లం. బేలర్ యంత్రాలతో కట్టలు కట్టించడం వల్ల కూలీల ఖర్చు మిగలడమే కాకుండా సమయం వృథా కావడం లేదు. కట్టలు కట్టించడంతో గడ్డి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. – భాస్కర్, రైతు, దుబ్బాక -
అదృశ్యమైన యువకుడు శవమై తేలి...
టేక్మాల్ (మెదక్): అదృశ్యమైన యువకుడు బావిలో శవమై తేలాడు. ఈ ఘటన టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. దాదాయిపల్లి గ్రామానికి చెందిన కోటంగారి రాజు (23) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం మాదిరిగానే ఈ నెల 13న ఉదయం పొలానికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలి కనిపించగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కారు ఢీకొని యువకుడి మృతి
నర్సాపూర్ రూరల్: ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి పడిపోయిన ఓ యువకుడిని కారు ఢీ కొట్టడ ంతో అక్కడికక్కడే దు ర్మరణంపాలయ్యాడు. నర్సాపూర్–హైదరాబాద్ జాతీయరహదారిలోని కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అల్లం విక్రంరెడ్డి కుమారుడు కౌశిక్ కళ్యాణ్‌రెడ్డి(19), అతడి స్నేహితుడు రుషిల్ ఇద్దరూ కలసి చెరో రెండు బైక్‌లపై రైడింగ్‌కు వెళ్లారు. ఇద్దరూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వెళ్లి తిరిగి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా కొండాపూర్ అటవీ ప్రాంతంలోని మూల మలు పు వద్ద అదుపు తప్పి కల్యాణ్‌రెడ్డి కిందపడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు కల్యాణ్రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని పంచనామా నిమిత్తం మృతదేహా న్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెరువులో పడి యువకుడి మృతి అల్లాదుర్గం(మెదక్): ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన పెద్దలంక జగపతిబాబు(27) కొద్ది రోజుల క్రితం తాపీ పనులకోసం ముస్లాపూర్ గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం ముస్లాపూర్ గ్రామం నుంచి బయటకు వెళ్లిన జగపతిబాబు తిరిగి రాలేదు. ఆదివారం ముస్లాపూర్ తండా శివారులోని చెరువులో శవమై కనిపించారు. అయితే మృతుడికి మూర్ఛరోగం ఉండటంతో నీటిలో పడి చనిపోయి ఉంటారని తోటి కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వలస కూలీలను తీసుకొచ్చిన హరిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తులసి మొక్కకు పూజ చేస్తుండగా
● మహిళ మెడలో గొలుసు చోరీ●● ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ● సీసీ కెమెరాలో దుండగుల దృశ్యాలు నమోదు పటాన్చెరు టౌన్: తులసి చెట్టుకు పూజ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు కాజేసుకుని పరారయ్యారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ చారి తల్లి సోమలక్ష్మి కార్తీకమాసం కావడంతో ఆదివారం ఇంటి ముందు తులసి కోట వద్ద పూజ చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో 4 తులాల బంగారు గొలుసును దొంగిలించుకుని వెళ్లారు. ఒక వ్యక్తి శిరస్త్రాణం పెట్టుకుని బైక్‌పై వేచి ఉండగా, మరో వ్యక్తి మాస్కు ధరించి, ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, కాలనీ చెందిన సీసీ ఫుటేజీలో రికార్డైన దుండగుల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రెక్కాడక.. పూట గడవక
జగదేవ్‌పూర్ (గజ్వేల్): రెక్కాడితే కానీ పూట గడవని నిరుపేద కుటుంబం.. కనీసం తల దాచుకోవడానికి గూడు లేని దుస్థితి.. నాలుగు గుంజల పందిరే దిక్కు... కష్టం చేద్దామన్నా సహకరించని ఆరోగ్యం.. దీంతో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండలంలో తిగుల్ గ్రామానికి చెందిన మన్నె శ్రీనివాస్ గత పదిహేనేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు. ప్రస్తుతం స్థానిక పాఠశాలలోనే పదో తరగతి చదువుతోంది. గ్రామంలోనే ఓ పూరిగుడిసెలోనే ఉంటూ కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం భార్య జ్యోతి తీవ్ర అనారోగ్యం బారిన పడింది. భార్యను వైద్య నిమిత్తం ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఆమె ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన భార్యను చూసుకోవడంతోపాటు కుటుంబ పోషణకూడా శ్రీనివాస్ చూసుకుంటుండటంతో జీవనం కష్టమైపోయింది. వీటికితోడు వీరు నివసించే గుడిసె కూడా ఇటీవలే కూలిపోయింది. మరో గూడు ఏర్పాటుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నాలుగు గుంజల పందిరి కిందనే కుటుంబం మొత్తం తలదాచుకుంటున్నారు. చుట్టూ కనీసం కవరు కూడా లేకపోవడం వల్ల చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కూడా కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేకపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం, మానవతావాదులు స్పందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిరుపేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. నీడ కల్పించాలి.. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. కనీసం ఉండేందుకు కూడా ఇల్లు లేదు. గూడు కల్పించి సరైన వైద్యం అందిస్తే మేలు. పేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –శ్రీనివాస్. తిగుల్● పస్తులుంటున్న నిరుపేద కుటుంబం ● నాలుగు గుంజల పందిరే నివాసం ● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు -
వేర్వేరు ఘటనల్లో ఆరుగురి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో చిన్నకోడూరు(సిద్దిపేట): కుటుంబ కలహాలతో రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిన్నకోడూరులో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కర్నె రాంరెడ్డి(65), యాదవరెడ్డి సోదరులు. గత కొద్ది రోజులుగా రాంరెడ్డి, తమ్ముడు యాదవరెడ్డిల మధ్య వ్యవసాయ భూ పంపిణీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అలాగే తల్లి లక్ష్మి పోషణ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన రాంరెడ్డి ఆదివారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పోయాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించేసరికి రాంరెడ్డి మృతి చెందాడు. మృతుడు రాంరెడ్డికి భార్య తారవ్వ, కొడుకు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పులు భారమై వ్యక్తి ఆత్మహత్య దుబ్బాకటౌన్ : కొడుకు అనారోగ్యం ఓ వైపు, మరోవైపు వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే మార్గం తెలీక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయపోల్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన ఉషనగళ్ళ రాములు (56) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు అనారోగ్యం పాలవడంతో తెలిసినవారివద్ద అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నాడు. ఇక వ్యవసాయం కోసం చేసిన అప్పులు కూడా తోడవడంతో మనోవ్యధకు గురైయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో మార్గం తెలీక మనస్తాపం చెందిన రాములు శనివారం రాత్రి అందరూ నిద్రపోయాక ఇంటిబయట ఉన్న మామిడి చెట్టుకు ఉరిపోసుకున్నాడు. తెల్లవారు జామున భార్య పోచవ్వ బయటకు వచ్చి చూడగా రాములు మామిడి చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. వెంటనే కుమారుడు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి సహాయంతో చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా...పరిశీలించిన రాములు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తాళలేక.. మిరుదొడ్డి(దుబ్బాక): తమ్ముడు, చెల్లెలి పెళ్లిళ్ల కోసం అన్న చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. వీటికితోడు వ్యవసాయం అచ్చిరాకపోవడంతో తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల బాధ తాళలేక అన్న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుడ్డోళ్ళ మల్లేశం, మల్లవ్వ దంపతుల పెద్ద కుమారుడు బాల్‌రాజు(32) తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ భార్య భవాని, కూతురు శాన్వీ (4)తో పాటు, తల్లి మల్లవ్వను పోషించుకుంటున్నాడు. కాగా మృతుడు బాల్‌రాజు తండ్రి మల్లేశం గత 15 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబభారం బాల్‌రాజుపై పడింది. కాలక్రమంలో తన తమ్ముడు చెల్లెలు పెళ్లిళ్ల కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేసి వివాహాలు చేశాడు. వ్యవసాయం కలసి రాకపోవడంతో తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరిగి పోయాయి. దీంతో అప్పుల వారి నుంచి నిత్యం ఒత్తిడి రావడంతో దిగులు పడుతుండేవాడు. శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బాల్‌రాజు ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు రాత్రి బాల్‌రాజ్‌ను వెదుక్కుంటూ వ్యవసాయపొలం వద్దకు వెళ్లి చూడగా బాల్‌రాజు చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కన్పించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని బాలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుడుపునొప్పి తాళలేక యువతి... మర్కూక్(గజ్వేల్): కుడుపు నొప్పి భరించలేక ఓ యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గజ్వేల్ మండలం యుసుఫ్ఖాన్పల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కెన్వార్ సోనుభాయ్ (20)ను 7 నెలల క్రితం అదే గ్రామనికి చెందిన మేనబావ కేన్వార్ అమర్‌సింగ్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహానికి ముందునుంచే సోనుభాయ్ కొద్దికాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. వివాహం అనంతరం గత ఐదు రోజుల నుంచి కడుపునొప్పి వస్తుండటంతో శనివారం తన తల్లి పద్మినీభాయ్కి చెప్పగా...ఆస్పత్రికి తీసుకెళ్తాను ఇంటివద్దే ఉండమని చెప్పింది. ఆమె వచ్చేలోపే కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉన్న పైప్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెరువులో దూకి.. వెల్దుర్తి(తూప్రాన్)ః ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్దుర్తి పోలీసుస్టేషన్ పరిధి కొప్పులపల్లి గ్రామ శివారులో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గెంట్యల ప్రభాకర్(35) తూప్రాన్‌లో డిజిటల్ ప్రింటింగ్ నడుపుతున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం సమయంలో దుకాణానికి వెళ్తున్నానని స్కూటీపై ఇంటినుంచి బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వరకు ఇంటికి చేరుకోకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామశివారులోని ఊరి చెరువులో యువకుడి మృతదేహం తేలిఉందన్న సమాచారం మేరకు ప్రభాకర్ తల్లి చంద్రమ్మ వెళ్లి చూడగా మృతదేహం తన కుమారుడిదిగా గుర్తించారు. మృతదేహం ప్రక్కనే చెరువులో స్కూటీ కూడా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనా స్థలంలో తన మృతికి వేధింపులే కారణమంటూ వేర్వేరుగా సెప్టెంబర్ 20వ తేదీన రాసినట్లు ఉన్న మూడు సూసైడ్నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భోజనానికి వెళ్లొస్తానని.. సంగారెడ్డి క్త్రెమ్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలంలోని బాలాజీనగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ నుంచి సంగారెడ్డికి పని నిమిత్తం వలస వచ్చిన కేతరామ్ (20) ప్రేమ్ భీష్ణోయ్ అనేవ్యక్తితో కలసి ఒకే గదిలో ఉంటున్నాడు. జీవనోపాధి కోసం బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న రవీందర్‌రెడ్డికి చెందిన ఓ స్వీట్ షాపులో పనిచేస్తున్నాడు. రోజులాగే ఆదివారం ఉదయం పనికి వచ్చి, మధ్యాహ్నం భోజనానికి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ప్రేమ్ భీష్ణోయ్ తన గదికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘‘ధనం మూలం ఇదం జగత్’’ అనే నానుడి ఎప్పటికీ అక్షర సత్యమని నిరూపిస్తూ ఉంటాయి కొన్ని ఘటనలు. తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో తక్షణావసరాలకోసం అప్పులు చేయడం మనిషికి తప్పడమూలేదు. దీంతో అప్పులే యమపాశాలై మనిషి ప్రాణాలు బలిగొంటున్నాయి. అప్పులు భారమై వాటిని తీర్చే దారిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల వారి ఒత్తిళు,్ల భూ వివాదాలు వంటి కారణాలతో ఆరుగురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. -
మరింత బలోపేతం
జిల్లాలో మండలాల వారీగా విడుదలైన వడ్డీ నిధులు మండలం గ్రూపులు విడుదలైన వడ్డీ (రూ.ల్లో) అమీన్పూర్ 9 40,426 అందోల్ 82 3,13,528 గుమ్మడిదల 59 2,41,319 హత్నూర 207 9,43,410 ఝరాసంగం 355 13,25,283 జిన్నారం 50 2,04,383 కల్హెర్ 66 2,21,342 కంది 91 3,87,588 కంగ్టి 80 3,10,404 కోహిర్ 395 13,13,785 కొండాపూర్ 126 4,88,379 మనూర్ 53 1,95,918 మొగుడంపల్లి 223 6,21,718 మునిపల్లి 124 5,08,515 నాగిల్గిద్ద 55 1,70,622 నారాయణఖేడ్ 155 51,395 న్యాల్కల్ 443 13,82,264 పటాన్చెరు 152 7,36,685 పుల్కల్ 85 3,25,896 రాయికోడ్ 155 6,62,317 సదాశివపేట 112 5,28,597 సంగారెడ్డి 63 2,38,236 సిర్గాపూర్ 57 2,21,591 వట్పల్లి 72 4,01,756 జహీరాబాద్ 425 12,53,691సంగారెడ్డి జోన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు వివిధ రకాల రుణాలకు సంబంధించిన వడ్డీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లోని సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సభ్యులకు బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తూ ఆ నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇందిరి మహిళా శక్తి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. జిల్లాలో 18,198 స్వయం సహాయక సంఘాలు జిల్లాలోని వివిధ గ్రామాల్లో 18,198 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలలో 1,90,381 మంది సభ్యులు ఉన్నారు. సంఘాలలోని సభ్యులకు వివిధ పథకాలు రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసి ఆదాయం వచ్చే ఆస్తులను కొనుగోలు చేసి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారు. బ్యాంకు లింకేజి, సీ్త్రనిధితో పాటు వివిధ రకాల రుణాలను అందిస్తారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డిని నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ప్రభుత్వ హా యంలో 3 సంవత్సరాలుగా విడుదల చేయాల్సిన వడ్డీ నిలిపివేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కోసం ఎదురుచూసిన పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటవెంటనే విడుదల చేస్తుంది. రూ.కోటి 35లక్షల వడ్డీ విడుదల గత ఆర్థిక సంవత్సరంలోని డిసెంబరు నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. గత కొన్ని నెలల క్రితం డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించిన వడ్డి బకాయిలు విడుదల చేసింది. తాజాగా ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన 1,35,51,598 రూపాయలు మంజూరు చేసింది. నాలుగు నెలలకు సంబంధించి 17,014 గ్రూపులకు రూ.1,345.36లక్షలను విడు దల చేసింది. విడుదల అయిన వడ్డీ నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో మహి ళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధితోపాటు ఇతరులకు ఉపాధి మహిళా సంఘాలలో సభ్యులు తీసుకున్న రుణాలతో ఇతరులపై ఆధారపడకుండా తాను ఆర్థికంగా ఎదగటంతోపాటు మరికొంత మందికి ఉపాధిని సైతం చూపిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల వివిధ రకాల రుణాలను తీసుకుని క్యాంటిన్, పెరటికోళ్లపెంపకం, గేదెల షెడ్డు (పాల ఉత్పత్తి)తో ఇతరులకు ఉపాధి చూపించే రంగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సభ్యులకు రుణాలను అందించటమే కాకుండా వారు ఆదాయం వచ్చే యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాలకు రూ.కోటి 35లక్షల వడ్డీ విడుదల డిసెంబరు నుంచి మార్చి వరకు అందించినప్రభుత్వం నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల సభ్యులు సంఘం ద్వారా తీసుకున్న రుణాలు ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ నిధులు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించి, తిరిగి రుణం పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అందించటం జరుగుతుంది. –జ్యోతి, డీఆర్డీఓ, సంగారెడ్డి జిల్లా -
కూలి డబ్బుల తగాదా.. తాపీమేసీ్త్ర హత్య
కూలి డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి... మనోహరాబాద్(తూప్రాన్): కూలి డబ్బుల తగాదా కాస్తా తాపీమేసీ్త్ర ప్రాణం తీసింది. మనోహరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న ప్రమోద్ పాశ్వాన్ (55), బిట్టు దంపతులు కొంతమంది కూలీలతో కలసి భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే అదే గ్రామంలోని శ్రీరామ్ పండరి హైదరాబాద్‌లో ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటి నిర్మాణపనుల కోసం బిట్టు కూలీలను తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాపీమేసీ్త్ర ప్రమోద్ పాశ్వాన్‌కు బిట్టుకు కూలి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్యా మాటామాటాపెరిగిన క్రమంలో బిట్టు ఆవేశం ఆపుకోలేక దగ్గర్లోనే ఉన్న కట్టెతో పాశ్వాన్ తలపై బలంగా మోదాడు. దీంతో అక్కడికక్కడే పాశ్వాన్ కుప్పకూలిపోయి మృతి చెందాడు. వెంటనే బిట్టు పారిపోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పుట్ట నరేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మొక్కవోని దీక్షకు దక్కిన ఫలితం
నారాయణఖేడ్: ఖేడ్ జంట గ్రామమైన మంగళ్పేటకు చెందిన రాజ్ కుమార్. నాలుగు, ఐదు సంవత్సరాలుగా ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గ్రూప్4 రాస్తే ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రభుత్వం కొలువు సాధించాడు. వాణిజ్య పనుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు. మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడం తనకు ఆనందంగా ఉందని రాజ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కర్ణాటక సెంట్రల్ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ పూర్తి చేశారు. నారాయణఖేడ్ మండలం పిప్పిరికి చెందిన ధనరాజ్ డిగ్రీలో బీఎస్సీ కోర్సు పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం ఐదు సంవత్సరాలుగా ప్రిపరేషన్ చేస్తున్నాడు. గ్రూప్ 4 పరీక్షలు రాసి విడుదలైన ఫలితాల్లో ఉద్యోగం దక్కించుకున్నాడు. ధనరాజుకు మున్సిపల్ వార్డు అధికారిగా ఉద్యోగం ఇచ్చారు. తాను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గ్రూప్4లో ఇద్దరికి ప్రభుత్వ కొలువులు -
రామలింగేశ్వర ఆలయంలో మంత్రి సురేఖ పూజలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండల పరిధిలోని నందికంది రామలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయ కమిటీ,అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా జడ్జి సంగారెడ్డి టౌన్ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో మల్లికార్జునస్వామి దేవాలయాన్ని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు దీపారాధన, అభిషేకాలు చేశారు. ముఖ్యంగా మహిళలు తులసి మొక్కకు పూజలు చేసి శివాలయాల్లో కార్తీకదీపాలను వెలిగించారు. గణేష్ గడ్డ దేవస్థానంలో లక్ష దీపోత్సవం పటాన్చెరు టౌన్: పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకుల బృందం, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేడు మాలల ఆత్మీయ సమ్మేళనం జహీరాబాద్ టౌన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మాల మహనాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ దీపక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఉదయం 10 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలోని మాల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.నేడు డయల్ యువర్ డీఎం సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి ఆర్టీసీ డిపో పరిధిలో శనివారం రోజు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందని డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని జిల్లా పరిధిలోని ప్రయాణికులు వారి సమస్యలను, సలహా సూచనలను 99592 26267 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివలింగానికి అభిషేకం చేస్తున్నమంత్రి సురేఖ -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
48 గంటల్లో రైతులకు డబ్బులు జమ చేయాలి: కలెక్టర్‌సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం చౌటుకూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ధాన్యం బస్తాల లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, సంబంధిత మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కాగా, అనంతరం చౌటుకూరు మండల కేంద్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గిరిజనులకు మెరుగైన మౌలిక వసతులు సంగారెడ్డి జోన్: గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధర్తిఆబా జన జాతీయ గగ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి, తాగునీరు, వైద్య సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాముడొచ్చాడు..
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు శుక్రవారం కందిలో ఘన స్వాగతం పలికారు. కందిలోని జిల్లా జైలులో ఉన్న వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులను పరామర్శించేందుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్నారనే సమాచారంతో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. జాతీయ రహదారిపై గల ఓ దాబా వద్ద కేటీఆర్ కోసం పెద్ద ఎత్తున నిరీక్షించారు. ఇంతలోనే ఆయన రాగానే జై కేటీఆర్ అంటూ నినాదాలు చేయగా, వారికి అభివాదం చేశారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. అప్పటికే బారికేడ్ల ఏర్పాటు చేయడంతో కాన్వాయ్‌తో కేటీఆర్ జైలు లోపలకు వెళ్లారు. కేటీఆర్ వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. – కంది(సంగారెడ్డి) -
విరాళం పేరుతో నయా మోసం
మిరుదొడ్డి(దుబ్బాక): గుర్తు తెలియని వ్యక్తులు విరాళం పేరుతో నయా మోసానికి తెరలేపారు. అన్నదాన సత్ర నిర్మాణానికి విరాళం ఇవ్వాలంటూ ఓ రైతుకు మాయ మాటలు చెప్పి విరాళంతో ఉడాయించారు. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తీపిరెడ్డి దుర్గారెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శ్రీశైలం ఆలయంలో అన్నదానం, సత్రం నిర్మాణానికి గ్రామంలో ఒక్కొక్కరి వద్ద సుమారు రూ. 20 వేల వరకు విరాళాలు సేకరిస్తున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తనకు అంత స్థోమత లేదని రూ.500 విరాళం ఇస్తానని చెప్పాడు. గ్రామంలో చాలా మంది ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక బాధితుడు వరి కోత కోసం తెచ్చి పెట్టుకున్న డబ్బుల్లో రూ.5 వేలు ఇచ్చాడు. అనంతరం గ్రామంలో ఎవరైనా విరాళం ఇచ్చారా అని ఆరా తీయగా.. విరాళాల పేరుతో గ్రామంలోకి ఎవరూ రాలేదని తోటి గ్రామస్తులు తేల్చి చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. దుర్గారెడ్డికి అనుమానం రావడంతో వారు ఇచ్చిన రసీదులోని నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గ్రామస్తులతో కలిసి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బోయిని పరుశరాములు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు రైతుకు టోకరా రూ.5 వేలు తీసుకొని ఉడాయింపు -
నకిలీ పత్రాలతో భూమి ఆక్రమణ
దుబ్బాకటౌన్: వంశపారంపర్యంగా వస్తున్న భూమిని ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన బాధితుడు బత్తిని మహేందర్ గౌడ్ వేడుకున్నాడు. శుక్రవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లచ్చపేటలో సర్వే నంబర్ 26లో కొంత భూమిని సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తూ, ఇటీవల గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వ్యక్తికి ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ భూమి తమ కుటుంబానికి చెందిందన్నారు. 1953 నుంచి తమ తాత బత్తిని సీతయ్య పేరిట 11.23 ఎకరాలు రికార్డుల్లో ఉందన్నారు. ఉపాధి కోసం సీతయ్య కుమారులు ఇతర ప్రాంతాలకు వలస పోవడంతో, వారి భూమిని పలువురు కబ్జా చేశారని వాపోయాడు. గ్రామానికి చెందిన కొంత మంది అక్రమార్కులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి, భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలె 1,805 గజాల స్థలాన్ని రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో రికార్డులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తమ పూర్వీకులకు చెందిన భూమికి సంబంధించి కోర్టు కేసు ఉన్నందున ప్రజలు భూమిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు. భూమి వ్యవహారం కోర్టు పరిధి ఉండగా అమ్మడం, కొనడం చట్టవిరుద్ధమన్నారు. ఉపాధి కోసం వెళ్తే కబ్జా చేశారని బాధితుడి ఆవేదన -
గ్రూప్–3 పరీక్షకు సర్వం సిద్ధం
జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● పరీక్ష రాయనున్న 15,163 అభ్యర్థులు ● అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ● అరగంట ముందే కేంద్రాలగేట్లు మూసివేతసంగారెడ్డి జోన్: జిల్లాలో గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న గ్రూప్– 3 పరీక్ష ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,123 అభ్యర్థులు హాజరు కానుండగా జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపుకార్డులను పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం మీడియాకు తెలిపారు. రెండు రోజులపాటు గ్రూప్3 పరీక్ష ఈనెల 17 న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్– 2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్ష నిర్వహణ జరగనుంది. పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసివేస్తారు. 18న ఉదయం 10.00 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష జరగనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆయారూట్లలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాలను 9 రూట్లుగా విభజించినట్లు ఒక్కో రూటుకు ఒక్కో జాయింట్ రూట్ ఆఫీసర్ లు నియమించినట్లు వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక డిపార్ట్మెంట్ అధికారి, 119 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 157 మంది గుర్తింపు అధికారులు, 15 ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఇతరసిబ్బంది 34 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అభ్యర్థులకు సూచనలు, సలహాలు అభ్యర్థులు నలుపు /నీలం బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో ఉన్న గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలి. సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలన్నారు. మొబైల్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్తోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు. -
జీజేసీపీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌రెడ్డి
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్(జీజేసీపీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా కోహెడ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైద్రాబాద్‌లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం తనపై మరింత బాధ్యత ను పెంచిందన్నారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా గజ్వేల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్, సంయుక్త కార్యదర్శిగా జగదేవ్‌పూర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, ప్రచారకార్యదర్శి నాగేందర్, అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు గిరి రవి, ప్రధాన కార్యదర్శి ధరిపల్లి నగేశ్, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్యనారాయణరెడ్డి, కూచంగారి శ్రీనివాస్ తదితరులు అభినందించారు. -
No Headline
కేతకీ ఆలయానికి కార్తీక శోభ కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వరాలయం కార్తీక శోభను సంతరించుకుంది. భక్తులు ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించి స్వామివారి పల్లకీ సేవను నిర్వహించారు. అనంతరం కమలాకర్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గీతాలాపన భక్తులను అలరించింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజ్ శర్మ, శివకుమార్, ఇతర నిత్య సేవకులు, భక్తులు పాల్గొన్నారు. – ఝరాసంగం (జహీరాబాద్) -
ఒక్కసారి నాటు.. 30 ఏళ్లు పంట ‘పట్టు’
ఏడాదికి ఎనిమిది పంటలు ● జిల్లాలో పెరుగుతున్న మల్బరీ సాగు ● తక్కువ పెట్టుబడితో అధిక లాభాలుసంగారెడ్డి జోన్: పట్టు చీర కడితేనే ఓ పుత్తడి బొమ్మ... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ అంటూ పట్టుచీరపైనా, కట్టుకున్న మగువపైనా, ఆ చీరనందించిన పట్టుపురుగుపైనా అద్భుతమైన పాటను రాశాడో సినీ కవి. అంతెందుకు పట్టుచీరలంటే మగువలకెంత మక్కువో తెలియనిదెవరికీ? అలాంటి పట్టు చీరలనందించే పట్టు పురుగుల పెంపకం (మల్బరీ సాగు) ఇప్పుడు మంచి కాసులు కురిపిస్తోంది. అంతేనా! ఒక్కసారి నాటితే ఏకంగా 30 ఏళ్ల పాటు పంట వస్తుందని సాగు చేస్తోన్న రైతులు చెబుతున్నారు. మూడో సంవత్సరం నుంచి ఏడాదికి ఎనిమిది పంటలు వరకు తీయవచ్చని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే మల్బరీ సాగు పట్ల అందుకే రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం 170 ఎకరాల్లో.. జిల్లాలో 2014లో ప్రారంభమైన పట్టు పరిశ్రమ సాగు నేడు జిల్లా వ్యాప్తంగా 170 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగవుతోంది. మరో 20 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగు పెంపొందించేందుకు రైతులకు పంట విధానంతోపాటు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ అందించే రాయితీలపైనా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నీటి సౌకర్యం కలిగి ఉన్న నల్లరేగడి, చౌడు మినహా అన్ని భూములు మల్బరీ సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 7 నుంచి 8 పంటలు బహు వార్షిక పంటైన మల్బరీ మొక్క ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు పంట ఉంటుంది. సాగు కొరకు నీటి సౌకర్యం తక్కువగా ఉంటుందని, సంవత్సర కాలంలో 7 నుండి 8 పంటలతో దిగుబడులు అధికంగా వస్తాయి. పంట సాగు నిర్వహణ సక్రమంగా ఉంటే తక్కువ ఖర్చు అధిక లాభాలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. మొదటి సంవత్సరం 2 నుండి 3 పంటలు రాగా రెండో సంవత్సరంనుంచి 7 లేదా 8 పంటలు వస్తాయి. కేజీ రూ.600 పలుకుతున్న పట్టు పట్టుపురుగుల గూళ్ల తయారీ అనంతరం వాటి నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. కరోనా సమయంలో కేజీ పట్టు ధర రూ.200 నుంచి రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.600వరకు పలుకుతోంది. దీంతోపాటు రైతుకు అదనంగా కేజీకి రూ.75 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. ఇక రైతులు సాగుచేసిన పట్టుగూళ్లు అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని తిరుమలగిరి, వరంగల్ జిల్లాలోని జనగామలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. సాగుకు కనీసం రెండెకరాలు... కనీసం రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చేయాలి. తోట పరిసర ప్రాంతంలో 20 ్ఠ 50 సీడ్స్ షెడ్డును ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణం , పరికరాలకు సిల్క్ సమగ్ర పథకం–2లో భాగంగా కేంద్రం రాయితీని అందజేస్తోంది. రెండు ఎకరాల్లో పట్టుపురుగుల పెంచేందుకు మల్బరీ మొక్కలు నాటి 250 గుడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పురుగులకు ఆకు కోసి వేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న షెడ్డులో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. చంద్రికల నుంచి పట్టుగూళ్లను వేరు చేసి మార్కెట్‌కు తరలించుకోవచ్చు. ఇలా మల్బరీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తే స్థిరమైన అధిక ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు. -
మట్టిలో మాణిక్యం మౌనిక
రెండు ఉద్యోగాలు సాధించిన పేదింటి బిడ్డవట్పల్లి(అందోల్): ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించింది ఈ ఫొటోలో కన్పిస్తున్న యువతి మౌనిక. ఇటీవల జరి గిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించిన మౌనిక గురువారం విడుదల చేసి గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో కూడా సర్కారీ కొలువుకు ఎంపికైంది. అందోల్ మండలం నాదులా పూర్ గ్రామానికి చెందిన మిరపకాయల హేమలత, శివ్వప్పలకు చెందిన మౌనిక చిన్నప్పట్నుంచీ చదువులో ముందుండేది. పేదరికం కారణంగా మౌనిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసింది. ఉన్న కొద్దిపాటి భూమిలోనే తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ మౌనికను చదివించారు. ఉస్మానియా వర్సిటీలో ఉన్నత విద్య ను పూర్తి చేసిన మౌనిక పోటీ పరీక్షలు రాస్తూ రెండు ఉద్యోగాలు సాధించింది. సాధించిన విజయాలపట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు మౌనికను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మౌనిక త్వరలోనే విద్యాశాఖలో కొలువులో చేరనున్నట్లు మౌనిక కుటుంబసభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రతీ పాఠశాలలోబోధనేతర సిబ్బంది
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ సంగారెడ్డి ఎడ్యుకేషన్ః ప్రతీ పాఠశాలలో బోధనేతర సిబ్బందిని నియమించడంతోపాటు మౌలికవసతులు కల్పించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యయులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక కులగణన కుటుంబ సర్వే కార్యక్రమంలో ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించి ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న సూచనలను పరిగణించాలన్నారు. కొఠారి కమిషన్ ప్రకారం విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలని సూచినప్పటికీ ప్రభుత్వాలు 7% మాత్రమే నిధులు కేటాయించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం కనీసం15% కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రవీందర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగారం శ్రీనివాస్, అనుముల రాంచందర్ పాల్గొన్నారు.