మొక్కనాటు.. ఫొటో పెట్టు | - | Sakshi
Sakshi News home page

మొక్కనాటు.. ఫొటో పెట్టు

Sep 12 2025 11:28 AM | Updated on Sep 12 2025 11:28 AM

మొక్కనాటు.. ఫొటో పెట్టు

మొక్కనాటు.. ఫొటో పెట్టు

కొనసాగుతున్న ‘ఏక్‌ పేడ్‌మా కే నామ్‌’2.0 కార్యక్రమం ఇప్పటివరకు 1,709 మొక్కలు నాటిన విద్యార్థులు

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపకంపై దృష్టిని సారించాయి. హరితహారం, వనమహోత్సవం లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా, ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ 2.0 పేరుతో తల్లి పేరిట ప్రతీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 1,709 మొక్కలను విద్యార్థులు నాటగా వాటి ఫొటోలను ఉపాధ్యాయులు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

ఉపాధ్యాయులకు అవగాహన

జిల్లాలో 864 ప్రాథమిక, 187ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్‌ స్కూళ్లు ఉండగా, 109 గురుకుల, సాంఘిక సంక్షేమ తదితర ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటితోపాటు సుమారు 500 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 3.40లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’కార్యక్రమంలో భాగంగా ప్రతీ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తమ తల్లి పేరిట మొక్కలు నాటి వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశాలపై ఎంఈఓలు, శిక్షణ పొందిన ఆర్‌పీలు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.

వివరాలు నమోదు ఇలా..

https://ecoclubs.education.gov.in పోర్టల్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, తరగతి, తల్లిదండ్రుల పేర్లు, చదువుతున్న పాఠశాల వివరాలను నమోదు చేయాలి. పాఠశాల ఆవరణలో తల్లితో కలిసి మొక్కలు నాటిన ఫొటోను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత విద్యార్థి తల్లితో కలసి నాటిన ఫొటోతో సర్టిఫికెట్‌ వస్తుంది.

సరఫరా చేస్తున్న ఉపాధి పథకం సిబ్బంది

అన్ని పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. అవసరమైన మొక్కలను ఉపాధి పథకం సిబ్బంది సరఫరా చేస్తుండగా అవి సరిపోకపోతే ఎక్కడైనా కొనుగోలు చేసి మరీ మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. జూలైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలో 1,900లకు పైగా పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 164 పాఠశాలల్లో 1,709 మొక్కలు నాటినట్లు సమాచారం. అయితే చాలా పాఠశాలల్లో మొక్కలు నాటినప్పటికీ పోర్టల్‌లో నమోదు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

మంచి కార్యక్రమం

స్కూల్‌ ఆవరణలో తల్లి పేరిట మొక్కలు నాటడం చాలా మంచి కార్యక్రమం. బిడ్డతో కలసి మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ చెట్ల వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించనుంది.

– శకుంతల, విద్యార్థి తల్లి, కల్బెమల్‌

నెలాఖరుకు పూర్తి చేయాలి

విద్యార్థులు తమ తల్లితో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం.

– వెంకటేశ్వర్లు, డీఈఓ

పాఠశాలల్లో పచ్చని ఆహ్లాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement