పేషీల ప్రక్షాళన | - | Sakshi
Sakshi News home page

పేషీల ప్రక్షాళన

Sep 12 2025 11:28 AM | Updated on Sep 12 2025 11:28 AM

పేషీల ప్రక్షాళన

పేషీల ప్రక్షాళన

● సదరు అధికారి పనిచేసే మండలానికి పంపిన అధికారులు ● ఇప్పటికే తన పేషీలోని సీసీలనుమార్చిన కలెక్టర్‌ ప్రావీణ్య మరో కీలక ఉన్నతాధికారి సీసీపై బదిలీ వేటు

● సదరు అధికారి పనిచేసే మండలానికి పంపిన అధికారులు ● ఇప్పటికే తన పేషీలోని సీసీలనుమార్చిన కలెక్టర్‌ ప్రావీణ్య

లెక్టరేట్‌లో ఏళ్లుగా పాతుకుపోయి పెద్ద పెద్ద వ్యవహారాలను సైతం నడిపే క్యాంపు క్లర్క్‌ (సీసీ)లపై కలెక్టర్‌ ప్రావీణ్య దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎక్కువకాలం ఒకే చోట పనిచేయడం వల్ల అవినీతి వ్యవహారాల్లో ఆరితేరిన కొంతమందిని నెమ్మదిగా కలెక్టరేట్‌ నుంచి పంపించే యోచన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పేషీల్లో ప్రక్షాళన చేపట్టిన కలెక్టర్‌ తాజాగా మరో ఉన్నతాధికారి వద్ద పనిచేసే సీసీపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కలెక్టరేట్‌లో ఆయా ఉన్న తాధికారుల పేషీల ప్రక్షాళన కొనసాగుతోంది. ఇప్పటికే తన పేషీలో పాతుకుపోయిన సీసీ (క్యాంపు క్లర్క్‌)లను మార్చి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కలెక్టర్‌ ప్రావీణ్య.. తాజాగా మరో కీలక ఉన్నతాధికారి వద్ద పాతుకుపోయిన మరో సీసీని మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అతన్ని ఆయన పనిచేయాల్సిన మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సదరు సీసీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో కలెక్టరేట్‌కు వచ్చే బడాబాబులకు వ్యవహారాల ను చక్కబెట్టడంలో సదరు సీసీ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ప్రావీణ్య తక్షణం అతడి పోస్టు ఉన్న మండలానికి పంపారు. జిల్లా కలెక్టర్‌గా మూడు నెలలక్రితం బాధ్యతలు తీసుకున్న ప్రావీణ్య కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

పేరుకే క్లర్కులు.. నడిపేది పెద్ద వ్యవహారాలు

పేరుకు క్లర్కులైనా పెద్ద పెద్ద వ్యవహారాల్లో వీరి పాత్ర చాలా కీలకంగా మారింది. సదరు అధికారి వద్దకు ఏ ఫైలు త్వరగా వెళ్లాలన్నా వీరు చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలున్నాయి. బడాబాబుల భూముల వ్యవహారాలు, ప్రజాప్రతినిధుల పైరవీలతో వచ్చే వారికి సంబంధించిన ఫైళ్లు ఉన్నతాధికారుల ముందుకు తీసుకెళ్లి పనులు పూర్తి చేయడంలో వీరు ఆరితేరి పోయారు. ఒకరిద్దరి పనితీరు అయితే సీసీని కలిస్తే సరిపోతుంది..పని అయిపోయినట్లే..అనే స్థాయికి ఎదిగారంటే వీరు ఏ స్థాయిలో వ్యవహారాలు నడిపారనేది అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులను కలిసి తమ గోడును వెళ్ల బోసుకుందామని వచ్చే సామాన్యులను లోనికి అనుమతించని ఈ సీసీలు పైరవీకారులను, బడాబాబులను, రాజకీయ పలుకుబడి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తారనేది బహిరంగ రహస్యం. మరోవైపు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాలనాపరమైన విషయాలను చర్చించేందుకు, ఫైళ్లకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు కలెక్టర్‌ వద్దకు వస్తుంటారు. ఇలాంటి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ సీసీలకు జీ హుజూర్‌ అనాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని శాఖలకు జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులు జిల్లా బాస్‌లుగా ఉంటారు. ఈ స్థాయి అధికారులు ఈ క్లర్కుల వద్దకు వచ్చి వినయం ప్రదర్శించాల్సిన పరిస్థితిలో వ్యవహారాలు నడిపారు.

ఏళ్లుగా పాతుకు పోయి..

జిల్లాలో కొందరు కీలక ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్న క్యాంపు క్లర్కులు పాతుకు పోయా రు. జిల్లాకు ఏ అధికారి బదిలీపై వచ్చినా వారే సీసీలుగా కొనసాగుతుండటం పరిపాటైపోయింది. గతంలో ఓ కలెక్టర్‌ వద్ద పనిచేసిన ఓ సీసీ..సదరు అధికారి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిపోతే..ఆయనతో పాటే సీసీని కూడా తాను పనిచేసే జిల్లాకు తీసుకెళ్లిన ఘటనలున్నాయంటే వీరి వ్యవహారాలు ఏ స్థాయిలో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. ఒకరిద్దరు సీసీలైతే గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన కీలక అధికారి సంతకాలను పాత తేదీల్లో పెట్టించుకువచ్చిన ఘనులు కూడా ఉన్నారు. ఇలా క్లర్కులుగా పనిచేసిన వీరిలో కొందరు కోట్లకు పడగలెత్తారు. కీలక ఉన్నతాధికారుల స్థిరాస్తులకు బినామీలుగా ఉన్న సీసీలు కూడా ఉన్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా ఏళ్లుగా పాతుకు పోయి..తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీలను ఒక్కొక్కరిగా పంపించివేస్తుండటం కలెక్టరేట్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement