
అరటి.. లాభాల్లో మేటి
అరటికి ఏ సీజన్‌లో నైనా మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడువునా సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు పంట పండిస్తున్నారు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరిచుకోవడంతో ఆసక్తి చూపుతున్నారు. అరటిలో కేవలం పండు మాత్రమే కాకుండా పిలకలు, ఆకులకు గిరాకీ ఉంటుంది. లాభాలు రాకున్నా నష్టం మాత్రం ఉండదు. అందుకని రైతులు అరటి సాగు పట్ల ఆసక్తి చూపుతుంటారు. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక లాభాలు సాధించవచ్చు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు.
– జహీరాబాద్ టౌన్
జహీరాబాద్‌లో సాగవుతున్న అరటి తోట
● పంట సాగుకు అనువైన సమయం
● అన్ని సీజన్‌లలో మంచి డిమాండ్
● పిలకలు, ఆకులకు సైతం గిరాకీ
● సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
అరటి ఉష్ణ మండల పంట. ఏడాది పొడుగునా సాగు చేయొచ్చు. 10 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనూ దిగుబడి వస్తుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే గెలల్లో ఎదుగుదల తగ్గుతుంది. నీరు ఇంకే సారవంతమైన నేలలు అరటి పంటకు అనుకూలం. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల్లో మొక్కలు నాటడం వల్ల సమస్యలు తగ్గి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. చౌడు భూములు అనుకూలం కావు. భూమిని దుక్కి చేసి చదును చేసిన తర్వాత ఆరడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో నాటుకోవాలి. గుంత పైభాగం మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాముల ఆముదం లేదా వేప పిండి, 150 గ్రాముల సూపర్‌ఫాస్పేట్ కలిపి గుంతలు పూడ్చాలి. నీరు పెడితే గుంతలో మట్టి సర్దుకుంటుంది. టిష్యూ కల్చర్ మొక్కలను మట్టి గడ్డి చెదరకుండా పాలథీన్ సంచులను తీసి గుంతల మద్యలో పెట్టి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెట్టాలి.
తెగళ్లు– నివారణ:
● వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
● అరటి సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+2.5 మి.లీ మోనోక్రాటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి.
● అరటి పెరుగు దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోప్యురాన్ 3జీ గులకలను మొక్కల దగ్గరగా వేయాలి.
● అరటి కాయల చివర మెచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. నివారణ చర్యగా ఒక గ్రామ్ కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
● ఆకుమచ్చ తెగుళ్లు వర్షాకాలంలో ఆశిస్తుంది. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పిలకలు తీసివేస్తే మేలు
అరటి చెట్టుకు 3 నుంచి 8 వరకు పిలకలు వస్తాయి. అవసరానికి మంచి నత్రజని వేసినప్పుడు తదితర కారణాల వల్ల పిలకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడూ తీయాలి. లేకుంటే తల్లి చెట్టుతో సమానంగా పోటీ పడి తెగుళ్లు, పురుగుల బెడద పెంచుతుంది. టిష్యూ కల్చర్ మొక్కలను పోషక పదార్థాలు నిల్వ ఉండే దుంపలుండవు. ఇవి నాటిన వెంటనే తొందరగా పెరగవు. ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. నాటిన నాలుగైదు నెలల్లో గెల అంకురం ఏర్పడి కాయల సంఖ్య నిర్ణయమవుతుంది. అందుకని సిఫారసు మేరకు ఎరువులు అందించాలి.
జాగ్రత్తలు పాటిస్తే లాభాలు
కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అరటిలో సాగులో అధిక లాభాలు సాధించవచ్చు. పంట సాగు విషయంలో అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేపట్టి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. నీరు, ఎరువులు సమయానికి అందించాలి. అధికంగా రసాయనాలు వాడొద్దు.
–పండరి, ఉద్యానశాఖ అధికారి,
జహీరాబాద్

అరటి.. లాభాల్లో మేటి