
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.
ఎన్నో ఎత్తుపళ్లాలు
ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.
పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్‌గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ సాధించింది.
అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..
ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మేము సెమీస్‌లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.
జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్‌బ్యాక్ ఇచ్చాము.
ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.
మేమంతా అందుకు అర్హులమే
మేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.
కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.
చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!