
రమణీయం.. రథోత్సవం
తాడిమర్రి: చెన్నకేశవ స్వామి నామస్మరణతో తాడిమర్రి మార్మోగింది. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. మరగాళ్ల విన్యాసాలు, కీలు గుర్రాల నృత్యాలు, చక్క భజన, కోలాటం ప్రదర్శిస్తూ భక్తులు రథం ముందు సాగుతుండగా...దేవేరులతో కలిసి రథంపై కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు భక్తులకు దర్శనమిచ్చారు.
యాగంతో ప్రారంభం..
ఆలయ అర్చకులు మామిళ్లపల్లి జయరామయ్యశర్మ, సంతోష శర్మ శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్థంలో యాగం నిర్వహించి శ్రీవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన రథంలో ఉంచారు. ఉదయం 9.30 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు మడుగు తేరును లాగారు. అనంతరం సాయంత్రం 3.30 నుంచి భక్తాదులు గోవిందా...చెన్నకేశవస్వామి, వెంకటేశ్వర నామస్మరణ చేస్తూ తాడిమర్రి ప్రధాన వీధులలో రథాన్ని లాగారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో మోదుగులకుంట, శివంపల్లి, మద్దుల చెరువు. నిడిగల్లు, పిన్నదరి, ఆత్మకూరు, పుల్లా నారాయణపల్లి, పెద్దకోట్ల, తదితర గ్రామాలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు.
అంగరంగ వైభవంగా
లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలు

రమణీయం.. రథోత్సవం