
అట్టహాసం..చౌడేశ్వరీ ఉత్సవం
అమడగూరు: చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం కుంభకూడు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఏడాది కూడా చీకిరేవులపల్లికి చెందిన పళ్లెం నరసింహప్ప, చంద్రకళ, అలాగే దాసరి శివప్ప, రాధమ్మ దంపతులతో పాటుగా తొగటవీర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే రాత్రి ముత్యాల జొన్నలతో వండిన కూడును ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా పెద్ద ఎత్తున కుంభం వలె రాశిగా పోసి పూల కుచ్చును ఏర్పాటు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం జంతువులను బలిగా ఇచ్చారు. పూజలన్నీ ముగిసిన తర్వాత రుధిరంతో తడిసిన జొన్నల కూడును, పూలకుచ్చును తీసుకెళ్లడానికి భక్తులు పోటీపడ్డారు. ఈ కుంభకూడును తీసుకెళ్లి నివాస గృహాలపైన, పంటపొలాల్లో, పశువులపై చల్లితే ఎటువంటి కీడు జరగదని భక్తుల నమ్మకం. కుంభకూడు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఆకట్టుకున్న జ్యోతుల ఊరేగింపు..
కుంభకూడును పురస్కరించుకుని చీకిరేవులపల్లి తొగటవీర క్షత్రియ సంఘం సభ్యులతో కలసి ధర్మవరానికి చెందిన 20 మంది అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. తొలుత ప్రత్యేకంగా తయారుచేసిన జ్యోతులతో బోనాలు తయారు చేసుకుని చీకిరేవులపల్లి వీధుల గుండా ఊరేగారు. అనంతరం జ్యోతులను తలమీద పెట్టుకుని అమ్మవారి ఖడ్గ పద్యాలు చదువుతూ, పాటలు పాడుకుంటూ అమడగూరుకు వెళ్లి సమర్పించారు. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్‌ఐ వెంకటరాముడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పురుషోత్తమరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తొలిరోజు కుంభకూడుకు
కిక్కిరిసిన భక్తజనం

అట్టహాసం..చౌడేశ్వరీ ఉత్సవం