
వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా నియమితులైన పీఏబీ సభ్యులను ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రులు డాక్టర్ సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకర్ నారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ కమిటీలో ఉన్నారు.
క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రెడ్డి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా నుంచి గతంలో ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి ఈ స్థానంలో ఉండేవారు. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి అవకాశం కల్పించారు.
వైభవం.. శ్రీగిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం శనివారం సాయంత్రం పట్టణంలో సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అందంగా అలంకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం ముఖద్వారం నుంచి రథాన్ని లాగుతూ ఊరేగింపుగా ప్రశాంతి నిలయం, విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి ,గణేష్ కూడలి, పెట్రోల్‌బంక్, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రేపు పీజీఆర్‌ఎస్ రద్దు
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ (సోమవారం) రద్దు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
తల్లిని తిట్టి.. కొడుకును కొట్టి..
● రేషన్ డీలర్ నిర్వాకం
ధర్మవరం రూరల్: రావులచెరువు గ్రామంలో నాగేంద్రమ్మ తన కుమారుడు కార్తీక్‌తో కలిసి శనివారం రేషన్ కోసం స్టోర్‌కు వెళ్లారు. బియ్యం అందరికీ వేసేశామని, ఇప్పుడు వస్తే ఎలా అంటూ డీలర్ చెన్నారెడ్డి తన తల్లి నాగేంద్రమ్మను బూతులు తిడుతూ... తన చెంపచెల్లుమనిపించాడని కార్తీక్ తెలిపాడు. రేషన్ సక్రమంగా వేసేదిపోయి.. కార్డుదారులపై దురుసుగా ప్రవర్తించడమేంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు