
ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోని బ్రిడ్జిలు
ఏడు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
పలుమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోని రైల్వే శాఖ
నవాబుపేట: మండలంలోని ఏడు గ్రామాల ప్రజలకు రైల్వే ట్రాక్, చిన్నపాటి బ్రిడ్జిలు పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాదాపు 25 కిలో మీటర్ల మేర ఉంటుంది. దానికి సమీపంలో మూసీనది 20 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ రెండింటి కారణంగా పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం గొల్లగూడ.. చిట్టిగిద్ద గ్రామాల్లో పర్యటించిన అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ వినయ్‌కుమార్ త్రిపాఠికి రైల్వే ట్రాక్, బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు.
కానీ ఇప్పటి వరకు రెండు సమస్యలూ పరిష్కారం కాలేదు. ఇటీవల వికారాబాద్‌కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు సైతం ఎమ్మెల్యే యాదయ్య సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ఈ సారైనా బ్రిడ్జి విస్తరణ పనులకు నిధులు మంజూరవుతాయని మండల ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు. మండలంలోని చించల్‌పేట, గంగ్యాడ, ముబారక్‌పూర్ గ్రామాల వద్ద మాత్రమే మూసీ నదిపై బ్రిడ్జిని నిర్మించారు.
గొల్లగూడ రైల్వే స్టేషన్ వద్ద మాత్రమే రాకపోకలకు గేటు ఉంది. మండలంలోని ఏడు గ్రామాలు మూసీ నది, రైల్వే ట్రాక్‌కు ఇవతలి వైపు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రంతోపాటు మిగతా 27 గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే గొల్లగూడ రైల్వే గేటు, చించల్‌పేట, గంగ్యాడ, ముబారక్‌పూర్ వద్ద మూసీనదిపై ఉన్న బిడ్జీలే దిక్కు. మరో చోటు నుంచి రాకపోకలకు అవకాశం లేదు.
చిన్న బ్రిడ్జిలతో ఇబ్బందులు
మండల పరిధిలోని ముబారక్‌పూర్, ఎల్లకొండ, గొల్లగూడ, పులుమామిడి, లింగంపల్లి, నారేగూడ, అక్నాపూర్, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, చించల్‌పేట, గేట్ వనంపల్లి గ్రామాల వద్ద గత అవసరాల మేరకు బ్రిడ్జిలు నిర్మించారు. ప్రస్తుతం రవాణా సదుపాయం పెరిగింది. భారీ వాహనాలు రావాలంటే వీలుపడటం లేదు. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వంతెనలను విస్తరించి సీసీ రోడ్లు వేయాలని మండల ప్రజలు పలుమార్లు స్థానిక, రైల్వే శాఖ అధికారులకు విన్నవించారు. కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు.
రైల్వే జీఎం చొరవ చూపాలి
రైల్వే బ్రిడ్జి, ట్రాక్ విస్తరించాలని ఇది వరకే సంబంధిత మంత్రి, అధికారులకు ఎమ్మెల్యే యాదయ్య, స్థానిక ప్రజలు వినతి పత్రాలు సమర్పించాం. కానీ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. చాలా కాలంగా రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే సమస్యలు పరిష్కరించాలి. – విమలమ్మ, మాజీ సర్పంచ్, పులుమామిడి
ఓ వైపు మూసీ.. మరో వైపు ట్రాక్
మా గ్రామం మూసీ నది, రైల్వే ట్రాక్‌ల మధ్యన ఉంది. గ్రామంలోకి రావాలంటే ప్రధాన రోడ్డుకు రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది. దీన్ని దాటడానికి ఏళ్ల క్రితం చిన్నపాటి బ్రిడ్జి నిర్మించారు. అందులో పెద్ద వాహనాలు రావడానికి వీలు లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. బ్రిడ్జిని విస్తరించాలి. – బాలమణి, మాజీ సర్పంచ్, ముబారక్‌పూర్
నిధుల కేటాయింపు లేదు
చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట, శంకర్‌పల్లి మండలాల్లో మూసీ నది ప్రవహిస్తుంది. రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఈ రెండు మండలాల్లో కేవలం మూడు రైల్వే గేట్లు మాత్రమే ఉన్నాయి. మూసీ నదిపై నాలుగు బ్రిడ్జిలే ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్‌పై మరో నాలుగు గేట్లు ఏర్పాటు చేయాలని గతంలో సంబంధిత మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్‌కు విన్నవించాం. వారు సానుకూలంగా స్పందించారే తప్ప నిధులు మాత్రం కేటాయించలేదు. – కాలె యాదయ్య, ఎమ్మెల్యే