
సొరంగం వద్ద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి శివశంకర్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల వెలికితీతకు 50 రోజులుగా ప్రయత్నాలు
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ తదితర 12 సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు
దేశంలో కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సాగుతున్న సహాయక చర్యలు
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతోపాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.
150 మీటర్ల మేర మట్టిని తొలగించి..
ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మిగితా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతోపాటు సుమారు 150 మీటర్ల మేర టన్నులకొద్దీ మట్టిని తొలగించి 13.9 కి.మీ. అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి, శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
రంగంలోకి ఎన్నో సంస్థలు..
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, మేఘా, ఎల్ అండ్ టీ, రాబిన్స్, జేపీ సంస్థలతోపాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికత వినియోగం..
బురద, శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటివరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం, అవశే షాలను గుర్తించే అక్వా–ఐ, ప్రోబోస్కోప్ టెక్నాలజీతోపాటు ఎన్జీఆర్‌ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పనిచేస్తున్నాయి.
టీబీఎం భాగాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మల్, గ్యాస్ కట్టర్లను వినియోగిస్తుండగా మ ట్టిని వేగంగా కన్వేయర్ బెల్టుపై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్‌కట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్‌కు చెందిన రొబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు.