
భారత్‌లో పెరుగుతున్నస్కిల్స్ బేస్డ్ హైరింగ్ ట్రెండ్
స్కిల్స్ ఉంటే 40 లక్షల ప్యాకేజీ ఇస్తామని ఓ స్టార్టప్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ‘ఏ డిగ్రీ చదివారో అవసరం లేదు.. ఏ కాలేజీనో అవసరం లేదు.. రెజ్యూమ్ ముఖ్యం కాదు.. స్కిల్స్ ఉంటే మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తాం’అంటూ ఇటీవల ‘స్మాలెస్ట్.ఏఐ’ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటనకు కొనసాగింపుగా... తమ కంపెనీ ఫుల్‌స్టాక్ ఇంజనీర్‌ను అన్వేషిస్తోందని, తాము కోరుకున్న నైపుణ్యాలున్న వారు దొరికితే ఏడాదికి రూ.40 లక్షల ప్యాకేజీ ఇచ్చేందుకూ సిద్ధమని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఇచ్చిన ప్రకటనకు ఏడువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే అది ఏ స్థాయిలో ఆకట్టుకుందో స్పష్టమవుతోంది. ఈ కంపెనీలో 14 మంది టీమ్ పనిచేస్తుండగా, వారిలో డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందంలో పనిచేస్తున్న నలుగురు అసలు కాలేజీకి వెళ్లకపోవడమో లేదా మధ్యలో మానేసినవారో కావడం గమనార్హం. వారు ఈ సంస్థలోని ఐఐటీ, వీఐటీ, ఐఐఐటీల్లో పట్టాలు పొందినవారితో తమ తమ రంగాల్లో పోటీపడుతుండటం విశేషం.
ఈ స్టార్టప్ స్థాపకులు కామత్, అక్షత్ మాండ్లోయి ఐఐటీ–గువాహటి పట్టభద్రులైనప్పటికీ, డిగ్రీలు కాదు ఆయా రంగాల్లో నైపుణ్యాలు, సాధించాలనుకున్న లక్ష్యాలు ముఖ్యమని.. తాము కోరుకున్న రంగాల్లో నైపుణ్యాలు సమృద్ధిగా ఉంటే వారిని మంచి ప్యాకేజీలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు.
అదే బాటలో పలు కంపెనీలు
ఈ సంస్థే కాకుండా భారత్‌లోని వివిధ కంపెనీలు డిగ్రీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆయా విషయాల్లో, రంగాల్లో నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ ‘స్కిల్స్–ఫస్ట్’అంటూ ముందుకు సాగుతున్నాయి. దీంతో దేశంలో స్కిల్స్ బేస్డ్ హైరింగ్ ట్రెండ్ ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివే మొక్కుబడి చదువుల కన్నా తమ అభిరుచులకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఆయా రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందొచ్చనే సందేశం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఈ హైరింగ్ ట్రెండ్‌కే మొగ్గు చూపుతోంది. ఐబీఎం ఇండియా... ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వచ్చే వారి టాలెంట్‌ను డిగ్రీ సర్టిఫికెట్ల ద్వారా అంచనా వేయకుండా.. ఆయా రంగాల్లో వారి నైపుణ్యాలను బట్టి విధులకు సరిపోతారా లేదా అని అంచనా వేస్తోంది. ‘ప్రోగ్రామింగ్, జనరేటివ్ ఏఐ అనే వాటి విస్తరణతో మరీ లోతైన కోడింగ్ నైపుణ్యాలు తప్పనిసరి కాకపోవడంతో ‘నో కోడ్’లేదా ‘లో కోడ్’ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఉద్యోగార్థి డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాలు, యోగ్యత, అభిరుచులు అనే వాటికి ప్రాధాన్యత పెరిగింది’అని ఐబీఎం హెచ్‌ఆర్ మేనేజర్లు చెబుతున్నారు.
ఐబీఎం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న హ్యాకథాన్‌లలో సంప్రదాయ రెజ్యూమ్‌ల కంటే ఏదైనా సమస్య–పరిష్కారంపై చూపే చొరవ, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. అదేవిధంగా, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్), కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ జెట్‌వర్క్ కూడా స్కిల్క్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇదిలాఉంటే, డిగ్రీ లేకపోతే నైపుణ్యాలను అంచనా వేయడానికి స్పష్టమైన విధానం లేదన్న ధోరణితో పలు కంపెనీలు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతినే అవలంబిస్తున్నాయి.