
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాకు చెందిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి(IPS officer Abhishek Mohanty)కి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ ముగిసే వరకు తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అభిషేక్ మహంతికి ఉపశమనం లభించింది.
తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి బదిలీచేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో అభిషేక్ మహంతి ఒకరు. అయితే ఆయన తనను ఆంధ్రప్రదేశ్‌కు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ప్రస్తుతం క్యాట్‌లో అభిషేక్ మహంతి పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై క్యాట్‌లో విచారణ ముగిసేంత వరకూ ఆయన బదిలీని నిలిపేయాలని, అప్పటి వరకూ తెలంగాణలోనే ఆయన విధులు నిర్వహించవచ్చని హైకోర్టు(High Court) పేర్కొంది.
రాష్ట్ర విభజన సమయంలో మహంతికి కేటాయించిన ఏపీలో ఆయన విధులలో చేరాలని కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహంతి గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో నేటి (సోమవారం) వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.
ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస