
విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
కాంక్రీట్ జంగిల్‌లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ హెచ్‌సీయూ
రాహుల్‌గాందీ ఎందుకు పట్టించుకోవడం లేదు
విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు
జేసీబీలు, బుల్డోజర్లు రాత్రికి రాత్రే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి
హెచ్‌సీయూ విద్యార్థులతో కలిసి మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 40 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి...హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను వదిలేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ భూములను విక్రయించొద్దంటూ విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ హెచ్‌సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేలకూల్చడంతోపాటు, నెమళ్లు, దుప్పులు, జింకలు, అరుదైన పక్షిజాతులను అక్కడ నుంచి తరలించే యత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాల ఫలితమే సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పారు. యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా మారిందని అక్కడున్న ఈ లంగ్‌స్పేస్ లేకుండా చేయడంతో జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భూములు అమ్మడం, అప్పులు తేవడమే ఎజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. ముంబైలో 2,500 చెట్లు కొడితేనే.. పర్యావరణం నాశనమైందని గొంతు చించుకున్న రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిల్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవులున్న తరుణంలో రాత్రికిరాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారని, కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలయ్యాక సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడడానికి వచ్చినప్పుడే ఆ భూములపై కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను జైలుకు పంపించినట్టు చెబుతున్నారని, వారికి ఏ విధంగా న్యాయ సహాయం చేయాలో ఆలోచిస్తామన్నారు. గుంట నక్కలు అంటూ... ఆయన కామెంట్లు చేశారని, తాము ప్రవేశిస్తే ఇదంతా బీఆర్‌ఎస్ చేయిస్తుందని ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారనే ఆగామని చెప్పారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు అయినా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
పోరాటం చేస్తాం: విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని భయకంపితం చేస్తోందని, విద్యార్థులపై తీవ్ర బలప్రయోగం చేస్తోందని, అడ్డుకుంటున్నవారిని అదుపులోకి తీసుకుంటోందని విద్యార్థి సంఘం నాయకులు ఉమేష్ అంబేడ్కర్, శరణ్య, నిహార్ సులేమాన్, త్రివేణి వాపోయారు. న్యాయపరమైన అంశాలు తర్వాత చర్చించొచ్చని ముందు పర్యావరణాన్ని కాపాడాలని, నెమళ్లు, జింకలు చేస్తున్న రోదనలు పాలకులకు వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఆ భూములను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతాం అని స్పష్టం చేశారు.