ఆర్టీసీలో తొలిసారి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు! | Outsourcing and contract drivers for first time in RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో తొలిసారి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు!

Published Mon, Feb 24 2025 4:32 AM | Last Updated on Mon, Feb 24 2025 4:32 AM

Outsourcing and contract drivers for first time in RTC

మొత్తం 1,500 మంది నియామకానికి సంస్థ సర్క్యులర్‌ 

ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజీలో నమోదైన వారికి కాంట్రాక్టు పద్ధతిలో.. 

మ్యాన్‌పవర్‌ సప్లయర్స్‌ నుంచి అయితే ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగాలు 

తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తొలిసారి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లను సమకూర్చుకోనుంది. గతంలో పలు సందర్భాల్లో డిపోల్లో బస్సులను పార్క్‌ చేయటం, అటూ ఇటూ మార్చటం కోసం ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో కొంతమందిని నియమించుకున్నారు. కానీ రూట్లలో నడిపేందుకు మాత్రం తీసుకోలేదు. 

ప్రస్తుతం డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండటం, శాశ్వత నియామక ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేకపోవటంతో ప్రైవేటు ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజీల్లో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించింది. 1,500 మంది డ్రైవర్లను వెంటనే నియమించుకుని, రెండు వారాల శిక్షణ ఇచ్చి బస్సులు అప్పగించనుంది. ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది.  

పెరుగుతూ వచ్చిన కొరత 
భవిష్యత్తులో సొంతంగా బస్సులు అంతగా కొనాల్సిన అవసరం లేకుండా అద్దె ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో బస్సులు (ఎలక్ట్రిక్‌ సహా) సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, సిబ్బంది విషయంలోనూ భారం లేకుండా చూసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 50 మంది చొప్పున డ్రైవర్లు రిటైర్‌ అవుతున్నారు. 

మరోవైపు చాలాకాలంగా నియామకాలు లేకపోవటంతో క్రమంగా డ్రైవర్లకు కొరత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రత్యేక సందర్భాల్లో అదనపు బస్సులు తిప్పేందుకు డ్రైవర్లు లేని పరిస్థితి ఎదురవుతోంది. వేసవి సెలవుల్లో రద్దీ భారీగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పాల్సి ఉంటుంది. 1,500 మంది డ్రైవర్ల కొరతతో ఇది సాధ్యం కాదు. ఇప్పటికే చాలామంది డ్రైవర్లకు అవసరాన్ని బట్టి డబుల్‌ డ్యూటీలు వేయాల్సి వస్తోంది.  

నియామక ప్రక్రియ జాప్యంతో.. 
దాదాపు ఏడాది క్రితమే 3 వేల డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించగా, 2 వేల పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిoది. అయితే ఆర్టీసీ కాకుండా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ, మెడికల్‌ సిబ్బందికి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామక ప్రక్రియలు చేపడతాయని పేర్కొంది. 

కానీ ఆ మూడు సంస్థలు ఇప్పటివరకు జాబ్‌ కేలండర్‌ను ప్రకటించలేదు. ఆర్టీసీ సిబ్బంది కోసం ఎదురు చూస్తూనే ఉంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియల్లో మరింత జాప్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతి తెరపైకి వచ్చింది.  

4 నెలల కాలానికే.. 
భవిష్యత్తులో గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులు, సాధారణ అద్దె ప్రాతిపదికన డీజిల్‌ బస్సులు తీసుకోనున్నందున, ఆర్టీసీకి సొంత డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. బస్సులను అద్దెకు ఇచ్చే సంస్థలే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోనుండటం దీనికి కారణం. 

ఈ నేపథ్యంలోనే డ్రైవర్లను నియమించుకోవటం కంటే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనివల్ల ఆర్టీసీపై జీతాల భారం తగ్గుతుంది. ఇప్పుడు తీసుకోబోతున్న 1,500 మంది డ్రైవర్ల ఉద్యోగ కాలం మార్చి నుంచి జూన్‌ వరకు అని ఆర్టీసీ సర్క్యులర్‌లో పేర్కొంది. 

తదుపరి అవసరాలను బట్టి వీరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే వీరిని భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కారి్మక సంఘాలు చెబుతున్నాయి.

నియామకం ఇలా.. 
»   ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజీలో నమోదైన అర్హులను నేరుగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.  
»     మ్యాన్‌పవర్‌ సప్లయింగ్‌ సంస్థల నుంచి తీసుకుంటే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకుంటారు.  
»     హెవీ వెహికిల్‌ లైసెన్స్, భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం ఉండాలి. ఎత్తు 160 సెం.మీ.కు తగ్గకుండా ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవటం, రాయటం వచ్చి ఉండాలి. 60 ఏళ్లలోపు వారై ఉండాలి.  
»    వీరికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేటెడ్‌ రెమ్యునరేషన్‌ రూ.22,415 చెల్లించనున్నారు. ప్రతి డ్యూటీకి బత్తాగా జంటనగరాల పరిధిలో అయితే రూ.200, జంట నగరాల వెలుపల అయితే రూ.100 చొప్పున చెల్లిస్తారు.  
»   ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థల్లో 15 రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు రూ.200 చొప్పున చెల్లిస్తారు.  
»   డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్‌ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement