గర్ల్‌ ఫ్రెండ్‌కో డైమండ్‌.. మీకో గుడ్‌ న్యూస్‌..! | South Korea Scientists Have Grown Diamonds In Just 150 Minutes, Know How To Make | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌కో డైమండ్‌.. మీకో గుడ్‌ న్యూస్‌..!

Published Mon, May 6 2024 11:58 AM

South Korea Scientists have grown diamonds in just 150 minutes

సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్‌ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!

వజ్రాలు.. డైమండ్స్‌.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో  చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్‌ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం  ఫ్యాషన్‌.

 కానీ గుడ్‌ న్యూస్‌ ఏమిటంటే కేవలం  కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు  ఫ్యాషన్  మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్‌ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో  గణనీయమైన మార్పురానుందని,  సరసమైన ధరల్లో డైమండ్స్‌ అందుబాటులోకి రానున్నాయని  పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్‌లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150  నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు.  ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.

అయితే వజ్రాల​కోసం కార్బన్‌ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్‌ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే  ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. 

కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. 

ఈ కొత్త పద్ధతి  ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్‌లో ప్రచురించారు.
 

Advertisement
Advertisement