ఓటర్లకూ స్లిప్పులు | Sakshi
Sakshi News home page

ఓటర్లకూ స్లిప్పులు

Published Sun, May 5 2024 8:20 AM

ఓటర్లకూ స్లిప్పులు

జిల్లాలో ముమ్మరంగా పంపిణీ

సమగ్ర సమాచారంతో అందజేత

8 వరకూ కొనసాగనున్న కార్యక్రమం

కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల హడావుడి దాదాపు తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ఒకవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ నిర్వహణపై అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. పోలింగ్‌కు ఇక తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఈవీఎంలను స్త్రాంగ్‌ రూములకు తరలించడం వంటి ముఖ్యమైన అన్ని పనులూ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసింది. కొత్త ఓటర్ల నమోదు అనంతరం తుది జాబితా కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్లకు సమగ్ర సమాచారంతో ఓటర్‌ స్లిప్పుల (పోల్‌ చిట్టీ) పంపిణీ కార్యక్రమం చురుకుగా నిర్వహిస్తున్నారు. సెక్టోరియల్‌ అధికారుల పర్యవేక్షణలో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వెళ్లి ఈ స్లిప్పులను ముమ్మరంగా పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ వరకూ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కొనసాగించనున్నారు. ఏ రోజు ఎన్ని పంపిణీ చేస్తున్నారో ఉన్నతాధికారులకు సాయంత్రం నివేదిక అందిస్తున్నారు.

ఓటర్‌ గైడ్‌..

ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు గైడ్‌ పుస్తకం అందిస్తున్నారు. నాలుగు పేజీల ఈ పుస్తకంలో కొత్త ఓటరుగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నమోదు ప్రక్రియ, ఎప్పుడు నమోదు చేసుకోవాలో వివరించారు. ఓటు వేసేందుకు ఎటువంటి గుర్తింపు కార్డు తీసుకురావాలి, ఏవి తీసుకుని వెళ్లకూడదో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన వివిధ యాప్‌లు, పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం, ఓటు వేసే విధానం గురించి క్షుణ్ణంగా వివరించారు. తప్పకుండా ఓటు వేస్తానంటూ ఓటరు ప్రతిజ్ఞను కూడా ఓటరు గైడ్‌ పుస్తకంలో పొందుపరిచారు.

ఓటర్లకు చేరుతున్న స్లిప్పులు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న జరగనుంది. ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఓటర్లకు గుర్తింపుతో పాటు సులభతరంగా ఉండేలా స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని సహాయ రిటర్నింగ్‌ అధికారులు పోల్‌ చిట్టీలను పంపిణీ చేసే బీఎల్‌ఓలకు ముందుగా శిక్షణ ఇచ్చారు. వీటి పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు. బీఎల్‌ఓలు గ్రామాల్లో నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు వీటిని అందించాలి. ఇంటికి తాళం వేసి ఉంటే ప్రస్తుతం ఇచ్చిన గడువులోగా వారిని కలవాలి. అప్పటికీ రాని వారి వివరాలు, ఫొటో స్లిప్పులను తిరిగి ఎన్నికల అధికారులకే అప్పగించాల్సి ఉంటుంది. పంపిణీలో అర్హులైన వారికి స్లిప్పులు రాకపోతే ఆ వివరాలు ఇవ్వాలి. మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో స్లిప్పుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో 30 శాతం వరకూ పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని కాకినాడ లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,29,471 మంది పురుషులు 8,04,465 మంది, ఇతరులు 186 మంది ఉన్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్‌లో 2,69,330 మంది, అత్యల్పంగా పెద్దాపురంలో 2,15,095 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాకినాడ సిటీ 2,41,620 మంది ఓటర్లతో రెండో స్థానం, పిఠాపురం 2,36,409 మంది ఓటర్లతో మూడో స్థానం, జగ్గంపేట 2,29,863 మందితో నాలుగో స్థానం, తుని 2,24,538 మందితో ఐదో స్థానంలో ఉన్నాయి.

పోల్‌ చిట్టీలో..

పోల్‌ చిట్టీలో అసెంబ్లీ నియోజకవర్గం, సంఖ్య, ఓటర్‌ పేరు, లింగం, ఓటర్‌ గుర్తింపు కార్డు సంఖ్య, తండ్రి పేరు, పోలింగ్‌ కేంద్రం ఉన్న ప్రదేశం, పోలింగ్‌ కేంద్రం సంఖ్య, పోలింగ్‌ కేంద్రం భవనం వివరాలు, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ నంబర్‌ 1950, క్యూఆర్‌ కోడ్‌, రూట్‌ మ్యాప్‌ తదితర వివరాలు ముద్రించారు. అలాగే, సంబంధిత బీఎల్‌ఓ పేరు, మొబైల్‌ నంబర్‌, ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల్లో కల్పిస్తున్న సదుపాయాలు, పోలింగ్‌ రోజున పాటించాల్సిన నిబంధనలను ఈ చిట్టీలో పొందుపరిచారు.

Advertisement
 
Advertisement