జాతీయ పంటల బీమా పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు గతంలో బాగా లబ్ధి చేకూరగా..
వేంపల్లె, న్యూస్‌లైన్ : జాతీయ పంటల బీమా పథకానికి ప్రభుత్వం మంగళం పాడనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు గతంలో బాగా లబ్ధి చేకూరగా.. కాలానుగుణంగా నిబంధనలు కఠినతరం చేస్తూ వచ్చారు. పొమ్మనకుండా పొగబెట్టినట్లుగా రైతులే స్వయంగా ఈ పథకానికి దూరంగా ఉండే విధంగా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రయివేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గతంలో ఏ నిబంధనలు లేకుండా వ్యవసాయదారులు వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లిస్తుండగా.. ఈ ఏడాది రబీ సీజన్‌లో బుడ్డ శనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి తదితర పంటలకు మీసేవ ద్వారా ప్రీమియం చెల్లించాలని నిబంధనలు పెట్టారు. ఇదిలా ఉండగా పంటల బీమాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హులైన రైతులకే అందేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నామని ఒక వైపు ప్రభుత్వం చెబుతున్నా పథకానికి మంగళం పాడేందుకు షరతులు విధిస్తున్నారనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది రబీ సీజన్‌లో ప్రీమియం గడువును డిసెంబర్ 24 నుంచి 31వ తేదీవరకు విధించారు. కానీ ఈ దరఖాస్తు ఫారంలో ప్రీమియం చెల్లించే నాటికి పంట కాలం నెల రోజులు ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇప్పటివరకు ప్రీమియం చెల్లించిన ఏ ఒక్క రైతు కూడా ఈ నిబంధనతో పంటల బీమాకు అర్హులయ్యే అవకాశంలేదు. జిల్లా వ్యాప్తంగా 45వేలమంది రైతులు ఉండగా.. కేవలం 27,730మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికి వారు పెట్టే నిబంధనలకు బీమా వచ్చే అవకాశాలు లేవు.
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన :
రబీ సీజన్‌లో ప్రీమియం చెల్లించిన రైతుల పొలాల వివరాలను తెలుసుకొని క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించి నిజంగా పంట సాగు చేసిన రైతులను గుర్తించాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అందులో భాగంగానే శనివారం నుంచి ఆయా మండలాల్లో ఏవోలు, ఏఈవోలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి పరిశీలన చేస్తున్నారు.