కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని..
కొత్తపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ముగ్గురు బిడ్డల సహా కాలువలో దూకిన వైనమిది. ఒక బాలుడి మృ
ముగ్గురు బిడ్డలతో కాలువలోకి దూకిన అక్కాచెల్లెళ్లు
బాలుడి మృతదేహం గుర్తింపు
ముగ్గురి గల్లంతు
సురక్షితంగా బయటపడ్డ చెల్లెలు
కొత్తపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ముగ్గురు బిడ్డల సహా కాలువలో దూకిన వైనమిది. ఒక బాలుడి మృతదేహాన్ని గుర్తించగా ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. మరో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఐదుగురు కొత్తపేట మండలం పలివెల లాకుల వద్ద బొబ్బర్లంక– అమలాపురం కాలువలో దూకారు. కొత్తపేట గ్రామానికి చెందిన వెత్సా బుచ్చిరాజు పెద్ద కుమార్తె విజయవాడకు చెందిన మానేపల్లి పుష్పావతి (35), ఆమె కుమారుడు అంజన్ (9), కుమార్తె మాన్విత (7), బుచ్చిరాజు రెండో కుమార్తె రాజమహేంద్రవరానికి చెందిన 30 ఏళ్ల నల్లమిల్లి ప్రమీల, ఆమె కుమార్తె శ్రీగోదా అలివేలు మంగతాయారు (5) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో నల్లమిల్లి ప్రమీల వంతెన సమీపంలో మునిగిపోతుండగా స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చారు. పలివెల పెట్రోలు బంకు సమీపంలో పుష్పావతి కుమారుడు అంజన్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు.
తల్లిదండ్రులను విజయవాడ వెళ్లనిచ్చి అఘాయిత్యం
స్థానిక మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న వెత్సా బుచ్చిరాజు – కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పుష్పావతిని విజయవాడకు చెందిన మానేపల్లి రణధీర్ గుప్తకు ఇచ్చి సుమారు పదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి అంజన్, మాన్విత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమార్తె ప్రమీలను రాజమహేంద్రవరానికి చెందిన నల్లమిల్లి వెంకటరత్నానికిచ్చి 2010 అక్టోబర్‌లో వివాహం చేశారు. వారికి శ్రీగోదా అలివేలు మంగతాయారు అనే కుమార్తె ఉంది. వెంకటరత్నం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలలు కాపురం సజావుగా సాగగా అనంతరం భార్యాభర్తల మధ్య అదనపు కట్నం విషయంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలో ఏడాది క్రితం తన కుమార్తెతో పుట్టింటికి కొత్తపేట వచ్చేసింది. గతంలో మూడుసార్లు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా వుండగా విజయవాడకు చెందిన పెద్ద కుమార్తె పుష్పావతిని భర్త అనుమానించడంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆమె కూడా మూడుసార్లు పుట్టింటికి వచ్చేయగా తల్లిదండ్రులు నచ్చచెప్పి పంపిం చారని సమాచారం. శనివారం భార్యాభర్తలు మళ్లీ గొడవ పడగా తండ్రికి ఫోన్ చేసింది. రేపు తాను వచ్చి మాట్లాడతానని చెప్పి ఆదివారం ఉదయం బుచ్చిరాజు తన భార్యను తీసుకుని విజయవాడ వెళ్లాడు. పుష్పావతి తన పిల్లలిద్దరినీ తీసుకుని కొత్తపేట వచ్చింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ముగ్గురు పిల్లల సహా అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ ఎన్ శ్రీధర్, రావులపాలెం సీఐ బి. పెద్దిరాజు, ఎస్సై డి. విజయకుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కాలువ పొడవునా గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలిపారు.
ఆర్‌ఎస్ పరామర్శ, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరా
ఈ సమాచారం తెలిసిన వెంటనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్‌ఎస్) కొత్తపేట ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రమీలను పరామర్శించి ఓదార్చారు. సంఘటనపై అధికారులను ఆరా తీశారు. స్థానికేతర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫోన్‌లో ఈ సంఘటనపై రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆరా తీశారు. సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన ప్రతినిధిగా జిల్లా వైఎస్సార్‌సీపీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావును అప్రమత్తం చేసి ఆస్పత్రికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘటనా స్థలికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.