దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కించపరిచేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ఆర్‌ఎస్‌ఎస్ మలయాళ వారపత్రికలో వివాదాస్పద వ్యాసం
న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను కించపరిచేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన మలయాళ వారపత్రిక ‘కేసరి’లో వ్యాసం ప్రచురితం కావడం దుమారం రేపింది. జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే.. గాంధీకి బదులుగా దేశ విభజనకు కారణమైన నెహ్రూను లక్ష్యంగా చేసుకొని ఉండాల్సిందంటూ గోపాలకృష్ణన్ అనే బీజేపీ నేత (లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు) ఈ నెల 17 నాటి సంచికలో రాసిన వ్యాసం వివాదానికి దారితీసింది.
ఈ వ్యాసంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, హింస ఏ రూపంలో ఉన్నా తాము ఖండిస్తామని ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య శనివారం ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలపై విరుచుకుపడింది. నెహ్రూను కించపరచడం ద్వారా చరిత్రను వక్రీకరించేందుకు సంఘ్ పరివార్ మరోసారి ప్రయత్నించిందని దుయ్యబట్టింది.