grama panchayat
-
స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నిర్బంధం
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులోని సెజ్ భూములను అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సోమవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు నిర్బంధించారు. వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత కేంద్రం (సెజ్) లో రెండు కులసంఘాలకు స్థలాలు ఇచ్చేందుకు గాను భూములను పరిశీలించేందుకు సోమవారం తహసీల్దార్ అనిల్‌కుమార్‌తో పాటు సర్పంచ్ మూడ సుమలత వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. గ్రామస్తులకు, పాలకవర్గ సిబ్బందికి తెలియకుండా సర్పంచ్ భర్త మూడ మహేందర్ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేశారు. అంతేగాకుండా పాలకవర్గానికి, గ్రామస్తులకు తెలియకుండా గ్రామపంచాయతీ తీర్మానం కాపీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంతం వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో తమ విలువైన భూములను సెజ్‌కు అప్పగించామని ఇప్పుడు తమకు తెలియకుండా భూములను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మాట్లాడేందుకు గాను గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామ సర్పంచ్ మూడ సుమలత, ఉప సర్పంచ్ మాయాపురం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రమేష్, కారోబార్ కిషన్‌లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం గదిలో నిర్బంధించి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్కంపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడి వారిని శాంతిప జేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికురులు సమస్యను తేల్చేంత వరకు వీరిని వదిలి పెట్టేది లేదని పోలీసులతో గ్రామస్తులు, యువకులు వాగ్వివాదం చేశారు. ఆందోళన చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
చెత్త నుండి సంపద సృష్టిస్తున్న కోవెలకుంట్ల గ్రామపంచాయతీ
-
గ్రామ కంఠం భూములు గ్రామ పంచాయతీ భూములు కావు
సాక్షి, అమరావతి: గ్రామ కంఠం భూములు గ్రామ పంచాయతీకి చెందిన భూములు కావని హైకోర్టు తేల్చి చెప్పింది. గ్రామ కంఠం భూమి తమదంటూ ఆ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మించిన షాపులను అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. కూల్చిన షాపులను కూల్చిన చోటే యథాతథంగా 9 నెలల్లో నిర్మించి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. ఒకవేళ నిర్మాణంలో జాప్యం చేసినా, నిర్మాణాలు చేపట్టకపోయినా పిటిషనర్లే నిర్మాణాలు పూర్తి చేసుకుని, అందుకైన ఖర్చును గ్రామ పంచాయతీ నుంచి రాబట్టుకోవచ్చునని స్పష్టం చేసింది. గ్రామ కంఠం భూముల్లో షాపులు.. కశింకోట గ్రామం సర్వే నంబర్ 110/1లోని గ్రామ కంఠం భూమిలో పి.వెంకటలక్ష్మి, డి.శ్రీదేవి, వి.పాపారావులు దుకాణాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామ కంఠం భూమి తమ భూమి అని, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని, అందువల్ల షాపులను ఖాళీ చేసి వెళ్లాలంటూ కళింపేట గ్రామ పంచాయతీ అధికారులు వెంకటలక్ష్మి తదితరులకు 2020లో నోటీసులిచ్చారు. ఆపై 2022లో మరోసారి నోటీసులిచ్చారు. మూడు రోజుల్లో షాపులను ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వెంకటలక్ష్మి తదితరులు సమాధానమిచ్చారు. అయితే తామిచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా తమ షాపులను కూల్చేసేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారంటూ వెంకటలక్ష్మి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే పంచాయతీ అధికారులు పిటిషనర్ల షాపులను కూల్చివేశారు. ఆ స్థలాన్ని ఓ సామాజిక భవన నిర్మాణం కోసం అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వెంకటలక్ష్మి తదితరుల తరఫు న్యాయవాది వీవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. నోటీసుకు తాము సమాధానం ఇచ్చామని, దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ షాపులను కూల్చివేశారని కోర్టుకు నివేదించారు. గ్రామ పంచాయతీ తరఫు న్యాయవాది ఎన్.శ్రీహరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పైవిధంగా తీర్పునిచ్చారు. -
అభివృద్ధి పనులంటేనే హడల్!
కూలి పనికి వెళ్తున్న సర్పంచ్ ఈమె పేరు బానోతు బుజ్జి ఖాసీం నాయక్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా సర్పంచ్. గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ప్రహరీ నిర్మాణం, ఇతరత్రా పనులకు రూ.18 లక్షలు వెచ్చించారు. పూర్తయి ఏడాదైనా బిల్లులు రాలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఆమె కూలి పనులకు వెళ్తోంది. ►నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి గతంలో ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.1.35 లక్షలు వచ్చేవి. కానీ ఇప్పుడవి రూ.89 వేలకు తగ్గిపోయాయి. ఇందులో రూ.25 వేలు కరెంటు బిల్లు, రూ.25 వేలు కార్మికుల వేతనాలు, రూ.10 వేలు ట్రాక్టర్ ఈఎంఐ, రూ.10 వేలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు పోతోంది. ఇవి కాకుండా పేపరు బిల్లులు, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతే మరమ్మతులు చేయించడం, పైపు లైన్లు పగిలితే వేయించడం, పల్లె వనాలు, పంచాయతీ స్థలాలకు ఫెన్సింగ్ వేయించడం, డ్రైనేజీల నిర్వహణ పనులు కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ►చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే ముందస్తుగా వైకుంఠధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, డంపింగ్ యార్డులు, వాటిల్లో సెగ్రిగేషన్ (చెత్తను విభజించే) షెడ్లు నిర్మించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) మెటీరియల్ కాంపోనెంట్ కింద వీటికి నిధులు రావలసి ఉంది. కానీ రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలా ఒక్కో గ్రామంలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీల్లో నెలవారీ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదు. దీంతో సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి వస్తోంది. రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు సకాలంలో రాకపోగా, అదనంగా వెచ్చించినవి నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డు వంటి నిర్మాణాలు ఏడాది, రెండేళ్ల కిందటే పూర్తయినా బిల్లులు రాలేదు. ఆరు నెలలుగా పైసా విడుదల కాలేదు. ఇవే రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్లు రావాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన సర్పంచ్‌లు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్నారు. ఈ కారణంతోనే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట సర్పంచ్ బండి ఎల్లయ్య ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది సర్పంచ్‌లు అప్పులు తీర్చేందుకు కూలి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తాము మళ్లీ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎక్కడ అప్పులు చేయాలని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనుల కోసం మరోసారి అప్పు అంటేనే వారు హడలెత్తిపోతున్నారు. బిల్లులు విడుదల చేయమంటే బెదిరింపులు తాము చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని, లేదంటే పల్లె ప్రగతిలో పాల్గొనబోమని ఇటీవల స్పష్టం చేసిన సర్పంచ్‌లను అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాలకు చెందిన సర్పంచ్‌లను నిధులు రాలేదని బహిరంగంగా ఎలా విమర్శిస్తారని ఆ మండల ఎంపీడీఓలు బెదిరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను నోటీసు బోర్డు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదీ జిల్లాల్లో పరిస్థితి.. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.43 కోట్లకు పైగా బకాయిలున్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.49.82 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రెజరీలో 200కు పైగా గ్రామపంచాయతీల చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు డబ్బులు రావాల్సి ఉంది. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.150 కోట్లకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా రావాల్సిన బిల్లులు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.98 కోట్లు పెండింగ్ ఉన్నాయి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఇతర పనులవి కోట్ల రూపాయల బిల్లులు ఐదారు నెలలుగా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ కావటం లేదు. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రావాల్సినవి రూ.62 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు రూ.95 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలకు రూ.60 కోట్లు, మెదక్ జిల్లాలో 445 గ్రామ పంచాయతీలకు రూ.40 కోట్లు రావాల్సి ఉంది. ►జనగామ జిల్లాలో రూ.3.10 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ములుగు జిల్లాలో రూ.2 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.6 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.7 లక్షల అప్పు.. తీర్చలేక ఆత్మహత్యాయత్నం సీసీ రోడ్లు, శ్మశానవాటిక, పారిశుధ్య పనులకు రూ.11 లక్షలు ఖర్చు చేశా. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలే వచ్చాయి. రెండేళ్లుగా రూ.9 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో రూ.7 లక్షలు అప్పు చేసినవే. అవి చెల్లించలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశా. – బండి ఎల్లయ్య, సర్పంచ్, అవుసలికుంట, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా వడ్డీలు పెరిగిపోతున్నాయి రూ.5 లక్షలు అప్పు చేసి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించా. పూర్తయి ఏడాది దాటింది. మరో రూ.4 లక్షలు ఇతర పనులు చేశా. రూ.9 లక్షలు రావాలి. ఆలస్యం అవుతుండటంతో వడ్డీలు పెరుగుతున్నాయి. –బానోత్ రాందాస్, చుంచుపల్లి మండలం ధన్‌బాధ్, భద్రాద్రి కొత్తగూడెం బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది రూ.18 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, రైతు వేదిక, స్మశానవాటిక నిర్మించా. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది అవుతోంది. –తోట సుజాత, నెన్నెల సర్పంచ్, మంచిర్యాల -
రూపాయి బకాయి కూడా లేదు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల చొప్పున విడుదల చేసిందని, ఈ నెల మొత్తం కూడా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఈ లెక్కన రూ.10 వేల కోట్లు గ్రామ పంచాయతీలకు అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా పెండింగ్‌లో లేదన్నారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమం ఈ నెల 3 నుంచి 17 వరకు జరుగుతుందని.. ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో లేవని, సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అబద్ధమని చెప్పారు. ఇప్పటివరకు 1,39,152 చెక్కుల ద్వారా రూ.696.71 కోట్లను ఆర్థికశాఖ క్లియర్ చేసిందని.. మిగతా పెండింగ్ చెక్కులేవైనా ఉంటే వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,400 కోట్లు విడుదల చేయలేదని.. వెంటనే అవి విడుదల చేసేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల బకా>యిలు విడుదలయ్యేలా పోరాడాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులూ ఇవ్వకుండా.. కొత్త సాఫ్ట్వేర్ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బండి సంజయ్ దీక్ష ఎందుకో చెప్పాలి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్ష ఎందుకు? ఎవరి మీద? చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రం మీదా? కేంద్రం ఇవ్వకపోయినా ఇచ్చిన రాష్ట్రం మీదా? అన్నది చెప్పిన తరువాతే ఆయన దీక్ష చేయాలన్నారు. -
పంచాయతీలకు ‘కరెంటు’ షాక్
సాక్షి, హైదరాబాద్: పెరిగిన కరెంటు చార్జీలు గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారుతున్నాయి. అంతగా ఆదాయం లేని పంచాయతీలు, ఇతర చిన్న పంచాయతీలకు అసలు కరెంట్ చార్జీలు కట్ట డమే సమస్యగా ఉండగా తాజాగా పెరిగిన చార్జీ లతో మరింత భారం పడింది. తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలతో గతంలో కంటే 15–20 శాతం దాకా బిల్లులు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో తగినన్ని సొంత ఆదాయ వనరులు, నిధులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచ రంగా తయారైంది. నేరుగా అందే 15వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో సింహభాగం విద్యుత్ చార్జీలు చెల్లించేందుకే సరి పోతోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు, ఏవైనా మరమ్మతులు చేపట్టాలంటే నిధులు సరిపోవడం లేదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చిన వెంటనే వాటి నుంచి అప్పటికప్పుడే కరెంటు బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో.. నిధులు ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటు న్నట్టుగా తయారైందని అంతగా ఆదాయం లేని పంచాయతీల సర్పంచ్‌లు వాపోతున్నారు. అసలే ఆదాయం తగ్గి.. ఇసుక మైనింగ్, సీనరేజీ, భూముల విక్రయం, స్టాంప్ డ్యూటీల వసూలు ఇతర రూపాల్లో వచ్చే ఆదాయాన్ని రాకుండా చేయడంతో గ్రామ పంచా యతీలకు ఇప్పటికే ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కరెంట్ చార్జీల పెంపుతో నిధులు కరువై ఎటూ పాలుపోవడం లేదని సర్పంచ్‌లు అంటున్నారు. గతంలో ఇద్దరు పారి శు«ధ్య కార్మికులతో పార్ట్‌టైంగా పని చేయించుకుని రూ.2 వేల చొప్పున చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు ఇద్దరికి నెల కు రూ.8 వేల చొప్పున చెల్లించాల్సి రావడంతో అది కూడా భారంగా మారిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గతం లో మాదిరి ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కరెంట్ చార్జీలు భారంగా మార డంపై అభిప్రాయం చెప్పేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారు లెవరూ అందుబాటులోకి రాలేదు. పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి పంచాయతీలకు ముందే కరెంట్ చార్జీలు కట్ట గలిగే ఆర్థికస్తోమత లేదు. ఇప్పుడు కరెంట్ బిల్లులు పెరగడంతో మరింత భారం పడుతోంది. అందువల్ల ప్రభుత్వమే ఈ బిల్లులు చెల్లించాలి. కాంగ్రెస్. టీడీ పీల హయాంలో పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తర్వాత వీధిలైట్లకు తక్కువ పర్సంటేజీతో చార్జీలు తీసుకునేవారు. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు బిల్లులు కట్టే అవకాశ ముండేది. ఇప్పు డలా లేదు. పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి. – చింపుల సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ బోర్ల వినియోగంతో బిల్లులు భారం వీధిలైట్ల బిల్లుల చెల్లింపుతో పాటు మిషన్ భగీరథ నీళ్ల సరఫరా సరిగా లేక బోర్లు వినియోగించాల్సి రావడంతో ఆ బిల్లుల చెల్లింపు భారంగా మారింది. ఇదిగాక వినాయకచవితి, బతుకమ్మ, దసరా, మైసమ్మ, పోచమ్మ ఇతర పండుగలు, పబ్బాలు, జాతర్లకు, కార్యాలకు అదనంగా లైట్లు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు కలుపుకొని నెలకు రూ.లక్ష చిల్లర ఆదాయం వస్తుంది. అందులో రూ.15–20 వేల దాకా కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తోంది. – ఉప్పల అంజనీ ప్రసాద్, గోలిరామయ్యపల్లి సర్పంచ్, కరీంనగర్ జిల్లా -
ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే
Not A Single House In The Village Is Owned By A Man: మహిళా సాధికారత అంటూ ఏవేవో పెద్ద మాటలు చెబుతారు. కానీ నిజానికి వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ఇంకా చాలా విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి. కానీ ఇక్కడొక ఊరు మాత్రం లింగ సమానత్వాన్ని పాటిస్తూ ఆదర్శ గ్రామంగా నిలిచింది. వివరాల్లోకెళ్తే...మహారాష్ట్రాలోని జౌరంగాబాద్ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బాకాపూర్లోని ప్రతి ఇంటి నేమ్ ప్లేట్ పై మహిళ పేరే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఇంటికి మహిళలే యజమానులు. బకాపూర్లో దాదాపు 2 వేల నివాసితులతో కూడిన చిన్న గ్రామం. అయితే అక్కడ ప్రతి ఇంటికి మహిళే హక్కుదారిగా ప్రకటించి లింగ సమానత్వానికి పెద్ద పీట వేసిందంటూ అధికారులు ఆ గ్రామం పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అక్కడ పంచాయతీ రికార్డుల్లో కూడా యజమానిగా మహిళ పేరే ఉంటుంది. 2008లో గ్రామ పంచాయతీ చేసిన ప్రత్యేక ప్రతిపత్తితోనే ఇది సాధ్యమైంది. ఈ మేరకు బాకాపూర్ సర్పంచ్ (గ్రామాధికారి) కవితా సాల్వే మాట్లాడుతూ..."ఈవిధంగా చేయడం వల్లే ఇంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలను మహిళలే తీసుకుంటున్నారని గర్వంగా చెబుతున్నారు. అయితే ప్రతి ఇంటికి మహిళలనే యజమాని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సుదాంరావు పలాస్కర్ ఉన్నారు. పురుషులు తమ కుటుంబాల అనుమతి లేకుండా ఇళ్లను అమ్ముకోవచ్చనే భయం ఇక్కడ ఉండేది. దీని వల్ల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయి. కానీ, మహిళను ఇంటి యజమానిగా చేయాలనే నిర్ణయం ఇక్కడి మహిళలకు అధికారం, భద్రత కల్పించింది. ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో వారే కీలకపాత్ర పోషిస్తున్నారు. అని అన్నారు. మాజీ సర్పంచ్ పలాస్కర్ మాట్లాడుతూ..గతంలో జరిగిన కొన్ని అనుభవాల ఆధారంగా, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఆమె నివాసానికి యజమానిగా చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీలో మాకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఒక్క సభ్యుడు కూడా ఓటు వేయలేదు. ఈ నిర్ణయం ఒక అర్ధాన్ని తెచ్చిపెట్టింది. ప్రతి గ్రామంలోని ఇంటిలో మహిళల భద్రత, పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం ”పలాస్కర్ అన్నారు. ఒక వ్యక్తి బకాపూర్లో ఇల్లు కొనాలనుకున్నా, అతను దానిని తన కుటుంబంలోని ఒక మహిళతో కలిసి కొనుగోలు చేయాలి అని ఉప సర్పంచ్ అజీజ్ షా అన్నారు. (చదవండి: రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి) -
ఇక గ్రామాల వారీగా బడ్జెట్లు
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా బడ్జెట్ల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిపై వారంతా కలిసి చర్చించుకుని, అందుబాటులో ఉన్న నిధులతో ప్రణాళికబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా నిర్ణయించుకుని బడ్జెట్ల రూపకల్పన చేసేలా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు వేర్వేరుగా బడ్జెట్లు రూపొందించుకోవాలంటూ కలెక్టర్లు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను అక్టోబరు 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేకంగా గ్రామ సభలను నిర్వహించి.. అక్కడే గ్రామ బడ్జెట్ ప్రణాళికపై చర్చించుకోవాలని సూచించారు. రూపకల్పన ఇలా.. ►గ్రామ పంచాయతీలకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో సమకూరే ఆదాయంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ఆయా శాఖల నుంచి గ్రామ పంచాయతీకి అందే అవకాశం ఉన్న నిధులన్నింటినీ అంచనా వేసుకుని.. ఆ మేరకు ఏడాది కాలంలో ప్రణాళికబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలో ఆ బడ్జెట్లో పొందుపరుచుకోవాల్సి ఉంటుంది. ►మండల పరిధిలో ఉండే అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామస్థాయి బడ్జెట్ల రూపకల్పన ప్రక్రియ పూర్తి కాగానే.. మండల స్థాయిలో బడ్జెట్ రూపకల్పన చేస్తారు. ఆ తర్వాత జిల్లాల వారీగా బడ్జెట్లను రూపొందిస్తారు. ►బడ్జెట్ రూపకల్పనకు నిర్వహించే ప్రత్యేక గ్రామ సభలకు పంచాయతీ, మండల, జెడ్పీ స్థాయిలో వివిధ శాఖల సిబ్బందిని ఆహ్వానిస్తారు. ►గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల వారీగా రూపొందించిన బడ్జెట్ నివేదికలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. -
తెలంగాణలో 10 లక్షల ఎకరాల పోడు సమస్య ఉంది : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గ్రామపంచాయతీ నిధులపై ప్రశ్నోత్తరాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 'మన పంచాయతీలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మన గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయి. పంచాయతీ గ్రాంట్లు ఆపొద్దని చాలాసార్లు చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో ప్రతిపక్షాలకు తెలియదా?. కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపాం కానీ.. పంచాయతీలకు నిధులు ఆపలేదు. మన రాష్ట్ర సర్పంచ్‌లే గౌరవంగా బతుకుతున్నారు. నిధులు మళ్లింపు అనేది పూర్తిగా అవాస్తవం' అని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామసర్పంచ్‌లు అద్భుతంగా పనిచేశారు: సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత హారంపై సభలో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేశారని వారి సేవలను కొనియాడారు. గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలను అందంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రభుత్వ కృషితో ప్రతీ గ్రామంలో పార్కులు ఏర్పాటయ్యాయని తెలిపారు. 526 మండల కేంద్రాల్లో రూరల్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారని అన్నారు. అదే విధంగా 35,700 ఎకరాల్లో అర్బన్ పార్కులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గతంలో భయంకరమైన కరువులు, విపత్తులు చూశామని సీఎం కేసీఆర్ సమావేశంలో అన్నారు. మన దేశంలో చెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని సభలో సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే, చెట్ల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో కెనడాలోనే అత్యధికంగా మొక్కలు నాటారని అన్నారు. పచ్చదనంతో ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. మన కళ్ల ముందే అడవుల విధ్వసం జరిగిందని సభలో సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. హరితహారంలో ఇప్పటి వరకూ రూ.6556 కోట్ల ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల వరకూ పోడు సమస్య ఉంది: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల వరకూ పోడు సమస్య ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులతో చర్చించామని తెలిపారు. గిరిజనులపై దాడులు చేయవద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూముల యాజమాన్య హక్కు మారదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలకు వారి చెంతనే అన్ని రకాల సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యంత్రాంగం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎన్ని ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యను గడువులోగా పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు.. ఎవరి వద్ద పెండింగ్ ఉంది.. పెండింగ్‌లో ఉండడానికి కారణం.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టారు. వార్డు/గ్రామ సచివాలయాలు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ అంశాలపై రోజూ బులెటిన్ జారీ చేస్తారు. ఇందులో పేర్కొన్న సమస్య ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో గుర్తించి.. సంబంధిత అధికారికి పరిష్కారం కోసం పంపుతారు. గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పెండింగ్ సమస్యలకు సంబంధించిన బులెటిన్‌ను అధికారులకు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించకపోతే చర్యలు నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించనివారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బులెటిన్‌లో తహసీల్దార్‌కు వచ్చిన మొత్తం అర్జీల సంఖ్య, పరిష్కరించిన అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువులోపు ఉన్న అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువు దాటిన అర్జీల సంఖ్య, 24 గంటలు, 48 గంటలలోపు పరిష్కరించాల్సినవి ఉంటాయి. బులెటిన్‌ను ఆరు కేటగిరీలుగా విభజించారు. మండల రెవెన్యూ అధికారి (రెవెన్యూ), అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్), మండల రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు) సబ్ రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు), అసిస్టెంట్ ఇంజనీర్ (రవాణా, రోడ్లు, భవనాలు) కేటగిరీలుగా విభజించి.. ఎందులో ఎన్ని అర్జీలు వచ్చింది పొందుపరుస్తారు. జవాబుదారీతనం కోసమే.. గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట గడువులోగా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. – వివేక్‌యాదవ్, కలెక్టర్, గుంటూరు జిల్లా -
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు
పర్చూరు: అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘పచ్చ’ రంగులు వేసుకొని తరించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోను వారి ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ కార్యాలయానికి గురువారం పచ్చ రంగు వేసేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శుక్రవారం పచ్చ రంగును తొలగించి తెలుపు రంగు వేయించారు. ఏడుగుండ్లపాడులో.. ఒంగోలు: సచివాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు నానా యాగీ చేసి కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందడం, శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటూ టీడీపీ నేతలు గ్రామ సచివాలయం బోర్డుకు పసుపు రంగులు వేశారు. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గ్రామపంచాయతీ పెద్దలు ఆ జంటకు మెడలో బూట్ల దండలు వేసి గ్రామమంతా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిని కాపాడారు. వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకుంది. అయితే ఈ మధ్య శివ పహాద్ ప్రాంతంలోని తన బంధువులతో కలిసి ఉండటానికి వచ్చింది. (బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) ఈ క్రమంలో జుహిబోనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఈ జంటను గ్రామపంచాయతీకి పిలిచారు. వారి కుటుంబ సభ్యులను కూడా సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా.. గ్రామ పంచాయతీ వారికి రూ.5లక్షల జరిమానా విధించింది. పంచాయతీ ఆదేశం మేరకు ఈ జంట బలవంతంగా బూట్ల దండతో గ్రామమంతా తిప్పారు. సంప్రదాయాలను, కట్టుబాట్లను అతిక్రమించకుండా ఉండటం తమ ప్రధాన కర్తవ్యం అని పంచాయతీ పేర్కొంది. వైరల్ అయిన ఈ వీడియో పోలీసుల దాకా వెళ్లడంతో వెంటనే అక్కడకు చేరుకొని వారిని రక్షించారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లుల భారం తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో ఎల్ఈడీ లైట్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..పల్లెల్లోనూ ఈ దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మామూలు వీధి దీపాలను వినియోగిస్తున్న గ్రామ పంచాయతీలు.. ఇకపై తక్కువ విద్యుత్, ఎక్కువ కాంతులు వెదజల్లే ఎల్ఈడీ లైట్లతో వెలిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఆదాలో మంచి గుర్తింపు ఉన్న ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈ ఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు వీధి దీపాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడనుంది. ఈఈఎస్ఎల్తో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని భావించిన పంచాయతీరాజ్‌శాఖ.. ఈ అగ్రిమెంట్లో జిల్లా పంచాయ తీ అధికారి, గ్రామ పంచాయతీ, ఈఈఎస్ఎల్లకు భాగస్వామ్యం కల్పిస్తోంది. నిధుల్లేకుంటే డీపీవోల ద్వారా సర్దుబాటు గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధి దీపాలతో కరెంట్ బిల్లులు భారీగా రావడమేగాకుండా.. నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా దీపాల వ్యవస్థను అమలు చేస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ ముందుకు రావడంతో పంచాయతీరాజ్‌శాఖ అటువైపు మొగ్గు చూపింది. ఒప్పందకాలంలో ఎల్ఈడీ లైట్ల నిర్వహణ బాధ్యత పూర్తిగా సంస్థదే. దీపాల బిగింపు, నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను కూడా సంస్థనే చూసుకోవాల్సి ఉంటోంది. నెలవారీ విద్యుత్ బిల్లులను స్థానిక పంచాయతీ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ నిధుల కటకటతో చెల్లించలేని పరిస్థితుల్లో జీపీ ఉంటే జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) బిల్లులను సర్దుబాటు చేయాలని పీఆర్ శాఖ నిర్దేశించింది. టెండర్లతో సంబంధం లేకుండా.. సంస్థతో అగ్రి మెంటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈఈ ఎస్ఎల్ సంస్థ పనితీరును మదింపు చేయాలని జీపీలను ఆదేశించింది. నేషనల్ లైట్స్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా దీపాలను ఏర్పా టు చేశారా? లేదా పరిశీలించాలని నిర్దేశించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ పరిశీలనకు పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. త్రైపాక్షిక ఒప్పంద పత్రా ల నమూనాను జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు పంపారు. -
మూడు నెలల్లో నిర్వహిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నివేదించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వివరాలను లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించట్లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వేణుగోపాల కృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. దీంతో ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
కొత్తగా సప్త‘నగరాలు’
కర్నూలు (అర్బన్): జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడ్ కానున్నాయి. వీటిని నగర పంచాయతీలుగా చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ప్రతిపాదనలను పంపింది. గ్రామ పంచాయతీల్లోని జనాభా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని నగర పంచాయతీలు/ మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు మున్సిపాలిటీలకు సంబంధించి సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్/ డైరెక్టర్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే గ్రామ పంచాయతీలు, అలాగే కర్నూలు కార్పొరేషన్, ఆదోని మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల జాబితాలను జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు పంపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో 25 వేలకు పైగా జనాభా ఉండడంతో పాటు పలు అంశాలను పరిశీలించి అప్‌గ్రేడ్, విలీనం జాబితాలను పంపారు. అప్‌గ్రేడ్ కానున్న గ్రామ పంచాయతీలు ఇవే.. కోడుమూరు, పత్తికొండ, కోసిగి, ఆలూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, బేతంచెర్ల గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీల్లో విలీనం కానున్న గ్రామాలు ... కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోకి సమీపంలోని పెద్దపాడు, లక్ష్మీపురం, పందిపాడు గ్రామాలను, ఆదోని మున్సిపాలిటీ పరిధిలోకి మండగిరి, సాదాపురం, బసాపురం, మధిరె, ఢణాపురం గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ... ఈ ఏడాది డిసెంబర్లో పురపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా నగర పంచాయితీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియతో పాటు మున్సిపాలిటీల విస్తరణ కార్యాక్రమం కూడా పూర్తి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
సరికొత్తగా సచి‘ఆలయం’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించగా.. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా పర్యవేక్షించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ సచివాలయం నడుస్తోంది. అక్కడ నుంచే సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన చేసేవారు. ఇక నుంచి పథకాల మంజూరుతో పాటు, పలు రకాల సేవలను సచివాలయాల నుంచే అందించేందుకు రూపకల్పన జరుగుతోంది. జిల్లాలో జనాభా ప్రతిపాదికన మొత్తం 681 సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2 వేల జనాభా దాటితే ఒక సచివాలయం.. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కనీసం రెండు వేల జనాభాకో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 980 పంచాయతీలుండగా.. 9,990 వార్డులున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 560 పంచాయతీల్లో 2 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలున్నాయి. వాటిని పరిశీలిస్తే.. 500 జనాభాలోపు పంచాయతీలు 33 ఉండగా.. 500 నుంచి 1000లోపు 140 ఉన్నాయి. అలాగే 1000 నుంచి 3000లలోపు 517 ఇందులో 75 శాతం 2 వేల కంటే జనాభా తక్కువ ఉన్న పంచాయతీలున్నాయి. 3000 నుంచి 5000లోపు 173, 5000 నుంచి 10,000లోపు 85, 10,000లకు పైగా 32 పంచాయతీలున్నాయి. పెనమలూరు మండలం కానూరు పంచాయతీలో అత్యధికంగా 49,600 జనాభా ఉండగా.. అత్యల్పంగా 134 మంది ఉన్న పంచాయతీగా ఉయ్యూరు మండలం జబర్లపూడి పంచాయతీ నిలిచింది. జిల్లాలో పంచాయతీలు 980 మొత్తం జనాభా (2011 లెక్కల ప్రకారం) 26.73 లక్షలు ప్రస్తుత జనాభా (దాదాపుగా) 29.80 లక్షలు గ్రామ వలంటీర్లకు దరఖాస్తులు (మంగళవారం సాయంత్రానికి) 33,616 ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాలు 681 15 శాతం అదనంగా కలిపి.. ఇది 2011లో తీసిన జనాభా లెక్కకావడంతో దీనికి అదనంగా 15 శాతం జనాభాను కలిపి లెక్కకడతారు. ఈ మేరకు రెండు వేల జనాభాపై ఉన్న పంచాయతీని ఒకే దాని కింద, అంత కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను రెండు లేదా మూడింటిని కలిపి ఒకే సచివాలయం కిందకు తీసుకురానున్నారు. ఇవి కేవలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు మాత్రమే ఉద్దేశించినవి. భౌగోళికంగా ఎటువంటి మార్పు ఉండదు. వలంటీర్లకు దరఖాస్తుల వెల్లువ.. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీరును ప్రభుత్వం నియమించబోతోంది. దీనికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి గత నెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రానికి 33,616 దరఖాస్తులు అందాయి. పక్కాగా ఏర్పాట్లు.. గ్రామ సచివాలయాల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చేపడుతోంది. వాటిని భౌగోళికంగా ప్రతిపాదించడంతో పాటు, అందుకు అనుబంధంగా ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేసి ఇవ్వాలి. ఏయే పంచాయతీలు సచివాలయాల పరిధిలోకి వస్తున్నాయన్నది అందులో రంగుల్లో గుర్తించేలా మార్కు చేశారు. వాటి పూర్తి వివరాలను పంచాయత్ రాజ్ శాఖకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, పంచాయతీల విలీనంలో తప్పిదం జరిగినా భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కా సమాచారం సేకరిస్తున్నారు. ఒకేచోట పది మంది ఉద్యోగులు.. గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. త్వరలోనే ఉద్యోగుల ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారికి శిక్షణ ఇచ్చి అక్టోబర్ రెండో తేదీ నాటికి వారు విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయం, పశుసంవర్థక, రెవెన్యూ, వైద్యం, ఉద్యాన, అటవీ, సంక్షేమం, పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పీడీఓ, మండల స్థాయి ఎంపీడీఓలు పర్యవేక్షించనున్నారు. -
పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఏ విధంగా ఖరారు చేయాలన్న దానిపై జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు పంపింది. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన ఫార్ములాను ఇందులో పొందుపరిచారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే వివిధ స్థాయిల్లోని రిజర్వేషన్లను లెక్కించాలని సూచించింది. ఈ కసరత్తుకు సంబంధించి మరింత స్పష్టత కోసం శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)తో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో డీపీవోలకు ఇచ్చే ఆదేశాలను బట్టి శనివారం జిల్లాస్థాయిలో తదుపరి కసరత్తు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఈ నెల 29 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. బీసీలకు 23.81%, ఎస్సీలకు 20.46%, ఎస్టీలకు 5.73% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. వీటికి అనుగుణంగా పంచాయతీలను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ రిజర్వేషన్లను ఓటర్ల జాబితాలకు అనుగుణంగా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా అన్ని కేటగిరిల్లోనూ మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయిస్తారు. నాన్–షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు సర్పంచ్ల విషయంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. వార్డు సభ్యులకు సంబంధించి గ్రామపంచాయతీలను యూనిట్‌గా తీసుకుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలను, 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీలను మినహాయించి రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో... అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకేకేటాయిస్తారు. అన్ని వార్డులనుఎస్టీలతోనే భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో... షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకే కేటాయిస్తారు వార్డు సభ్యుల విషయంలో సంబంధిత గ్రామపంచాయతీల్లోని వివిధ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయిస్తారు. అయితే మొత్తం సీట్లలో ఎస్టీల రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బీసీలకు సంబంధించి... 2018 రాష్ట్ర పంచాయతీరాజ్చట్టం ప్రకారంబీసీ సర్పం చ్ స్థానాలు ఖరారు చేసి ఒక్కో జిల్లాకు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో 50 శాతంఆయా వర్గాలకు చెందిన మహిళలకు పంచాయతీరాజ్ కమిషనర్కేటాయిస్తారు. మిగిలిన 50 శాతం రిజర్వ్ చేయని స్థానాలను ఒక్కో జిల్లాకు కేటాయించి, దానిని జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. సర్పంచ్ స్థానాల నిర్ధారణ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలవారీగా ఎన్ని సర్పంచ్ స్థానాలను రిజర్వ్ చేస్తారన్నది కమిషనర్ తెలియజేస్తారు దీనిపై జిల్లా కలెక్టర్ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఒక్కో కేటగిరీకి వచ్చే రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. సంబంధిత జిల్లాలోని మొత్తం ఎస్టీ,ఎస్సీల జనాభాకు అనుగుణంగా మండల స్థాయిల్లో ఎస్టీ, ఎస్సీలకు సర్పంచ్ స్థానాలు కేటాయిస్తారు. షెడ్యూల్డ్ ఏరియాల పరిధిలోని గ్రామాలతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారం వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న అన్ని సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేస్తారు. వార్డులపై ఎంపీడీవోలు... ఎంపీడీవో ముందుగా మండలంలోని వార్డుల్లో మిగతా మొత్తం ఓటర్ల కంటే ఎస్టీ ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉందో వాటిని ఎస్టీలకు అపసవ్యదిశలో (ఎక్కువ నుంచి తక్కువకు) రిజర్వ్ చేస్తారు. ఎస్టీలకు రిజర్వ్ చేశాక, వాటిని మినహాయించి మండలంలోని వార్డుల్లో మొత్తం ఓటర్ల కంటే ఎస్సీ ఓట్ల నిష్పత్తి ఎక్కువగా ఉన్నవాటిని ఎస్సీలకు అపసవ్యదిశలో (ఎక్కువ నుంచి తక్కువకు) రిజర్వ్ చేస్తారు. ఎస్టీ, ఎస్సీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాక మిగిలిన వార్డుల్లో మొత్తం ఓటర్ల కంటే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న వాటిని ఎక్కువ నుంచి తక్కువకు కేటాయిస్తారు. పంచాయతీల్లోని వార్డులను డ్రా ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అన్ రిజర్వ్డ్ కేటగిరీల్లోని మహిళలకు రిజర్వ్ చేస్తారు. నవంబర్ 11 నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ ఓటర్ల నిష్పత్తిని ఖరారు చేస్తారు.జిల్లా కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు... రిజర్వేషన్ల ఖరారు తర్వాత జిల్లా కలెక్టర్లు సంబంధిత ఆర్డీవోలకు వీటిపై సమాచారాన్ని పంపిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన పంచాయతీలు, రిజర్వ్ చేయని పంచాయతీస్థానాల వివరాలను ఆర్డీవోకు కలెక్టర్ తెలియజేస్తారు. దీనికి అనుగుణంగా ఆర్డీవో ప్రతి మండల ప్రజాపరిషత్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన పంచాయతీస్థానాలతోపాటు అన్ రిజర్వ్డ్ సర్పంచ్ స్థానాలను కేటాయిస్తారు -
కొనసాగుతున్న పంచాయతీ కార్మికులు సమ్మె
మద్దూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శనివారానికి ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు పంచాయతీ ఉద్యోగులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించానలి ఐఎఫ్టీయూ, సీపీఐ నాయకులు భీమేష్, హన్మంతు డిమాండ్ చేశారు. ఆరు రోజులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం శోఛనీయమని అన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం రూ.18వేలకు తగ్గకుండా వేతనం పెంచాలన్నారు. వీరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వీరికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగ, కార్మికులు ఆంజనేయులు, వెంకటేష్, అంజయ్య, ఉసేన్ప పాల్గొన్నారు. -
గ్రామపంచాయతీ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన
మాచారెడ్డి నిజామాబాద్ : గ్రామపంచాయతీ సిబ్బంది నా లుగో రోజు సమ్మెలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ కారోబార్లు, వాటర్మెన్లు, సపాయి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారోబార్ల సంఘం మండలాధ్యక్షుడు బట్ట రమేశ్ మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమిం చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కారోబార్ల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నర్సు, ప్రతినిధులు సురేష్, దశరథ్‌రెడ్డి, రవి, నర్సింలు, రాజు పాల్గొన్నారు. -
అడిగే వారేరి.!
►గ్రామ పంచాయతీల్లో పాలన కరువు పేరుకే గ్రామాధికారులు ►ఉద్యోగం ఒక చోట.. ఉండేదొక చోట ►క్షేత్రస్థాయి ఉద్యోగులపై కొరవడిన పర్యవేక్షణ ►సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లె ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు ఒంగోలు టూటౌన్ : జిల్లాలో పల్లె పాలన గాడి తప్పింది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా గ్రామాధికారులు ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విధులకు హజరవుతున్నారో లేదో కూడా ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగం చేసే చోట ఉండకపోయినా.. కనీసం సకాలం విధులకు హజరు అవుతున్నారా లేదా ప్రశ్నించే వారు కరువయ్యారు. దీంతో గ్రామాల్లో పాలన కరువైంది. సమస్యలతో పల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పడుతున్న అవస్థలు ఇన్ని కావు. ఒక వేళ మండల స్థాయి అధికారికి చెప్పుకుందామని వచ్చినా.. అక్కడ మండల స్థాయి అధికారుల సీట్లు ఖాళీగా దర్శనమిస్తాయి. అక్కడ అటెండరో.. లేక ఒక కంప్యూటర్ ఆపరేటరో తప్ప అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. సకాలంలో విధులకు హజరయ్యే వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. జిల్లాలో 56 మండలాలు ఉండగా వీటి పరిధిలో 1029 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ అధికారి ఉన్నారు. కొన్ని గ్రామాలకు రెగ్యులర్ వీఆర్వో లేకపోయినప్పటికి ఇన్చార్జి వీఆర్వోలను నియమిస్తారు. వీరంతా ఉద్యోగం చేసే గ్రామంలో ఉండటం లేదు. పట్టణాలు, నగరాలలో ఉంటున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు చుట్టు పక్కల గ్రామాల వీఆర్వోలు అందరూ కూడా ఒంగోలులోనే దాదాపు ఉంటున్నారు. లేదా సొంతూళ్లలోనే ఉంటున్నారు. పని ప్రదేశానికి 25 కిలో మీటర్ల దూరంలోనే ఉంటున్నారు. ఇంకొంత మంది 50 కిలోమీటర్ల దూరంలోకూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. కనీసం మండల కేంద్రంలో కూడా 90 శాతం మంది ఉండటంలేదు. గ్రామంలో ప్రతి ఒక్కరికి వీఆర్వోతో అవసరం ఉంటుంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక నష్టపోవాల్సి వస్తోంది. ఏ సర్టిఫికేట్కైనా.. వీఆర్వో తరువాత ఆర్ఐ. ఆ తరువాత తహశీల్దార్ సంతకం అవసరం. గ్రామ స్థాయి అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిం దే ఆట.. పాడిందే పాట సాగిపోతోంది. వీరితో పాటు గ్రామ కార్యదర్శులు కూడా విధులకు సక్రమంగా రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 70 శాతం గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిత్యం తలుపులు మూసే ఉంటాయి. సిటిజన్ చార్టర్ ఉండదు. ఫోన్ రంబర్లు ప్రజలకు తెలియవు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటు ప్రజలకు సేవ చేయకపోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయి అధికారులు కూడా జిల్లా , డివిజన్ కేంద్రాలలో ఉండటంతో గ్రామ స్థాయి అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామ పాలన ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయింది. కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు గ్రామానికి రాని అధికారులను అడగలేని స్థితిలో ఉన్నారు. అందుబాటులో ఉండాల్సిన అధికారులు వీరే.. గ్రామ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో), వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్), ఏఎన్ఎం, నీటి పారుదల శాఖ అధికారి; విద్యుత్ శాఖ లైన్‌మేన్, హెల్పర్, వెటర్నరీ అసిస్టెంట్ (పశు వైద్యాధికారి), వ్యవసాయ శాఖ విస్తరణాధికారి, ఎంపీఈవో, ఉద్యానశాఖ అధికారి, ఆర్‌డబ్లు్యఎస్ ఉద్యోగి (వాటర్‌మేన్), రేషన్ షాపు డీలర్లు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు ప్రతి రోజు విధులకు హాజరయినట్లు ప్రతి గ్రామ పంచాయతీలోని మూమెంట్ రిజిస్ట్రర్‌లో సంతకాలు పెట్టి విధులకు హజరు కావాలి. వీళ్ల పోన్ నంబర్లు ఆయా గ్రామ ప్రజలకు తెలియజేయాలి. ఏ పని ఎన్ని రోజులకు అవుతుందో చెప్పాలి. వీరితో పాటు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిఉంది. కానీ ఇవేమీ పంచాయతీలలో జరగడం లేదు. వీరిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. జిల్లా కలెక్టర్ అయినా గ్రామస్థాయి ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వెలుగులు
– అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి తీర్మానాలు పంపండి – డీపీఓ పార్వతీ కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పీఆర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతీ చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకున్నారని, అయితే కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి తమ కార్యాలయానికి ఆ కాపీలను పంపాలన్నారు. జిల్లాలో ఏప్రెల్ 30వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు పీఆర్ కమిషనర్ గడువు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.24 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.20.40 కోట్లను వసూలు చేసినట్లు చెప్పారు. మిగిలిన 15 శాతం కూడా ప్రభుత్వ భవనాలు, మొండి బకాయిలు ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లులకు సంబంధించి సర్‌చార్జీలను ప్రభుత్వం మినహించిన దృష్ట్యా కేవలం రెగ్యులర్‌గా వాడే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు. -
రేపు ప్రత్యేక గ్రామ సభలు
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పౌరుల అవసరాలపై చర్చించి నిర్దిష్టమైన అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామ సభలను నిర్వహించి పౌరుల అవసరాలను గుర్తించాలని, తీర్మానాలు, ఫొటోలను తీయించి నివేదికలను అందించాలని సూచించారు. జిల్లాలోని డివిజనల్ పంచాయతీ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల ధర్నా
సూర్యాపేటరూరల్ : గ్రామపంచాయతీ ఉద్యోగ, వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా జీఓ నం.63ను సవరణ చేయాలని సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, వెంపటి గురూజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వక హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు గుమ్మడవెల్లి వెంకటేశం, ఆదిమల్ల సైదులు, చెర్కుపల్లి రాజు, మేకల రవి, బట్టు సుజాత, ఆదిమల్లు నాగయ్య, మోదుగు శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు ఊరట
ఇందూరు : ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామపంచాయతీలకు ఊరట లభించింది. 13వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా బేసిక్ గ్రాంటు క్రింద జిల్లాకు ప్రభుత్వం రూ. 11.04 కోట్లను మంజూరు చేసింది. ఇందులో నుంచి 20 శాతం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపుల కోసం వాడుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన కరెంటు బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు సర్కారుపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు. 13వ ఆర్థిక సంఘం నిధులలోంచి కొన్ని నిధులు వాడుకోవచ్చని 25 రోజుల క్రితం ప్రభుత్వం సూచించింది. తాజాగా నిధులను కూడా కేటాయించడంతో బకాయిల విషయంలో సర్పంచులకు కాస్త ఊరట లభించింది. రెండున్నరేళ్లుగా పం చాయతీల కరెంటు బిల్లుల భారం పంచాయతీలపైనే పడిం ది. బకాయిలు రూ.117 కోట్లకు చేరడంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. గ్రామాలు అంధకారంలో మునిగే పరిస్థితి ఏర్పడింది. ఇపుడు ప్రత్యేక నిధులను కేటాయించడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడుదల అయిన నిధులను అన్ని పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ట్రెజరీ శాఖ ద్వారా అధికారులు సర్దుబా టు చేయించి, పంచాయతీల ఖాతాలలో జమ చేశారు. ప్రస్తుతం మంజురు చేసిన నిధులే కాకుండా, పంచాయతీలలో ఇదివరకు నిలువ ఉన్న నిధులలో నుంచి కూడా 20 శాతం కరెంటు బిల్లుల కోసం వాడుకోవచ్చని కలెక్టర్ సూ చించారు. వీలైనంత త్వరగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, ఖర్చు చేసిన నిధుల వివరాలను డీఎల్పీఓ కా ర్యాలయాలలో తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నా రు. విద్యుత్ బకాయిలకు ఉపయోగించగా మిగిలిన నిధు లు, సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, సాలిడ్ పేస్ట్ మేనేజ్మెంట్, జీపీ బిల్డింగ్ నిర్వహణ, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగన్వాడీలలో పారిశుద్ద్య పనుల కోసం వినియోగించాలని ఆదేశాలిచ్చారు. -
పవర్ ‘పంచాయితీ’
సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, సర్పంచుల మధ్య అగాధాన్ని పెంచుతోంది. బకాయిపడ్డ కరెంట్ బిల్లుల చెల్లింపు బాధ్యత పంచాయతీలదేనని ఇది వరకే స్పష్టం చేసిన ప్రభుత్వం బిల్లు వసూళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిం చాలని పంచాయతీ, విద్యుత్ అధికారులను ఆదేశించింది. అవసరమైతే పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖాధికారులు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30కిపైగా గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిపేశారు. ప్రజల ఆందోళనలతో మళ్లీ పునరుద్ధరించారు. విద్యుత్ బకాయి వసూళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సర్పంచులు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. మరోపక్క.. విద్యుత్ చార్జీల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినా.. వసూళ్లలో పురోగతి లేకపోవడంతో పంచాయత్‌రాజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ శనివారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల డీపీవోలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ సమావేశంలో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే.. బకాయి ఉన్న పంచాయతీలకు కరెంట్ సరఫరా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదని ఆ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. కొనసాగుతున్న కరెంట్ సరఫరా నిలిపివేత.. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 27 మేజర్ పంచాయతీలుండగా.. మిగిలినవి మైన ర్ జీపీలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొనడంతోపాటు తాగునీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు రక్షిత తాగునీటికి దూరమవుతున్నారు. పలు చోట్ల సర్పంచులు, ఎమ్మెల్యేల హామీతో విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరిస్తున్నారు. ఏదీ స్పష్టత...? విద్యుత్ చార్జీల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, సర్పంచుల మధ్య అవగాహన లోపమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని పలువురు సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. గతంలో గత ప్రభుత్వాలే గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించేవని, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ఆయా పంచాయతీలపై మోపడం అన్యాయమని సర్పంచులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం గతంలో కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోత విధించి జిల్లాలకు పంపించామని, కోత పెట్టిన నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం వచ్చిన నిధులు కోత లేకుండా మొత్తాన్ని పంచాయతీలకు విడుదల చేశామని చెబుతోంది. అయితే.. ఈ విషయాన్ని సర్పంచులకు వివరించడంలో ప్రభుత్వం, అధికారులు వైఫల్యం చెందడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామారావు రాథోడ్ అభిప్రాయపడ్డారు. సర్పంచులు సహకరించడం లేదు. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. మన జిల్లాకు మూడు విడతలుగా రూ.60 కోట్లు వస్తాయి. అందులో నుంచి 15 శాతం నిధులు మాత్రమే విద్యుత్ బకాయిల కింద చెల్లించాలని చెప్పాం. అయినా సర్పంచులెవరూ స్పందించడం లేదు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.50 లక్షల నిధులొచ్చాయి. వాటిలో కొంత మేరకైనా బకాయి చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించారు. విద్యుత్ శాఖకు రూ.83 కోట్ల వరకు బకాయి ఉన్నాం. -
పంచాయతీలకు గుదిబండ
‘‘పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. ఇది జరగాలంటే పంచాయతీలు ఆర్థికంగా బలపడాలి. అందుకే వాటి కరెంటు భారాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది’’ జీఓ నం 80 విడుదల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలివి. ఆయన మాట నిలుపుకున్నారు. కానీ, ఆయన తదనంతర ప్రభుత్వాలు ఈ జీఓను నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ సర్కారూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరెంటు బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. -మోర్తాడ్ - కలవరపెడుతున్న కరెంటు బకాయిలు - భారం దాదాపు రూ.117 కోట్లు - పన్నులతో ఆదాయం రూ.12 కోట్ల లోపే - అమలుకు నోచుకోని జీఓ నం 80 - నాడు అండగా నిలచిన వైఎస్ఆర్ మోర్తాడ్ : గ్రామపంచాయతీలకు సంబంధించిన వీధి దీపాలు, రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించే విధంగా జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నంబర్ 80) అమలు కావడం లేదు. దీంతో పంచాయతీలకు కరెంటు బిల్లులు గుదిబండగా మారాయి. పంచాయతీలకు ఇంటి పన్ను, నల్లాల ద్వారా లభించే ఆదా యం ఏటా రూ.12 కోట్లకు మించడం లేదు. జిల్లాలో గ్రామ పంచాయతీ లు కరెంటు సంస్థకు రూ.117 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పంచాయతీలపై భారాన్ని తగ్గించడం కోసం జీఓ నంబర్ 80ను విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల బిల్లులు, రక్షిత మం చినీటి సరఫరా పథకాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరి స్తుంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత జీఓ నం. 80 అమలు నిలిచిపోయింది. దీంతో పంచాయతీల కరెంటు బకాయిలు పెరిగిపోయాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 74 మేజర్ గ్రామ పంచాయతీలు రూ.53 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 644 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.64 కోట్లు బకాయి ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వమే కరెంటు బిల్లును చెల్లిస్తుందని వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బందికి వేతనాలు, పంచాయతీ నిర్వహణ, సామాగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు చేపట్టడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. వైఎస్ మర ణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓ 80ను బుట్ట దాఖలు చేశారు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ జీఓను పట్టించుకోవడం లేదు. బకాయిల వసూలు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పంచాయతీలపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రాత్రిపూట వీధి దీపాలకు కరెంటు సరఫరాను నిలపివేస్తున్నారు. దీంతో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి కరెంటు బిల్లులను చెల్లిం చాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. అభివృద్ధి పనులకు తక్కు వ శాతం నిధులు మంజూరు కావడం, పన్నుల వసూలు అంతంత మాత్రంగానే ఉండటంతో కరెంటు బిల్లుల చెల్లింపు పంచాయతీలకు సాధ్యం కావడం లేదు. గతంలో మాదిరిగా ప్రభుత్వం కరెంటు బిల్లును చెల్లిస్తే తమకు భారం తప్పుతుందని సర్పంచులు అంటున్నారు. ప్రభుత్వం జీఓ 80ను అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల సర్పంచులు రిలే దీక్షలను చేపట్టారు. -
మీడియా పాయింట్: ఎవరెవరేమన్నారంటే
పంచాయతీల బిల్లుల్ని సర్కారే భరించాలి గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు, బకాయిలను తెలంగాణ సర్కారే భరించాలి. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని చెల్లించటంతో పంచాయతీలపై భారం పడుతోంది. ఏకగీవ్రంగా ఎన్నికైన పంచాయతీలకు ఇస్తామన్న రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇప్పటికీ ఇవ్వలేదు.. వెంటనే విడుదల చేయాలి. ....... - జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ......................... రేషన్ కార్డులపై స్పష్టత అవసరం తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఉద్యోగుల హెల్త్ కార్డులపై స్పష్టత లేదు. జీవో నంబర్ 653లోని అనేక అంశాలపై సంబంధిత మంత్రి సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. బోగస్ పేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారు. తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్ల పంపిణీ ఆరంభ శూరత్వంగా మారింది. ...... - బీజేపీ ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద ‘సంక్షేమం’ నుంచి తప్పుకునేందుకే కుట్ర కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద అందించే బియ్యంతోనే సరిపెట్టి సంక్షేమ పథకాల నుంచి తప్పుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే రేషన్ కార్డులకు అన్ని లింక్‌లను తొలగించి బియ్యానికి పరిమితం చేస్తోంది. ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఆధారంగా ఉండేది. అదే విధానాన్ని కొనసాగించాలి. ....... - కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేరు ఫాస్ట్ పథకం.. అమలు మాత్రం స్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేరును కేసీఆర్ ప్రభుత్వం ఫాస్ట్ పథకంగా మార్చింది. ఆచరణలో మాత్రం ఆ పథకాన్ని స్లోగా నడిపిస్తున్నారు. ఫలితంగా తెలంగాణలోని 15 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సగం విద్యా సంవత్సరం గడిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కనీసం గైడ్‌లైన్స్ రూపకల్పన జరుగలేదు. ఇటీవల నామామాత్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. నయా పైసా బ్యాంక్ ఖాతాల్లో చేరలేదు. విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు వారిని కళాశాలలకు రావద్దని ఇంటికి పంపిస్తున్నాయి......... - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ........................ చరిత్రహీనులుగా మారవద్దు తెలంగాణ శాసనసభను తప్పుదోవ పట్టించి టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మారవద్దు. రేవంత్‌రెడ్డి అబద్ధాలకోరు. ఆధారాలు లేని అభియోగాలు చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఆధారాలతో సహా రుజువు చేయాలి. సొంత మీడియా తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలిందే. ప్రజా సమస్యల చర్చపై శ్రద్ధ పెట్టాలే తప్ప అనవసర రాద్ధాంతాలతో సభను అగౌరవ పర్చవద్దు........ - టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జీవన్‌రెడ్డి, బాలరాజు, గణేశ్ గుప్తా ఆర్డీఎస్ నీళ్ల దోపిడీ పట్టని సర్కార్ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో ఆర్డీఎస్సమస్యను అనుకూలంగా మలుచుకున్న టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దాన్ని గాలికి వదిలేసింది. ఆర్డీఎస్ నీళ్లతో సీమాంధ్రలో రిజర్వాయిర్ నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ ఆయిన జీవో 100 అమలవుతున్నా కనీసం పట్టింపు లేదు. ఏడు గ్రామాలు నిండా మునిగే ప్రమాదం ఉంది. నీళ్ల దోపిడీ అడ్డుకొవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే గొంతు నొక్కుతున్నారు...... - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ..................... విషపు పాలు తాగి సభలో చిమ్ముతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు బాబుకు చెందిన హెరిటేజ్ విషపు పాలు తాగి తెలంగాణ శాసనసభలో విషాన్ని చిమ్ముతున్నారు. మీ మాటలు ఎవరివి? సభ సజావుగా జరగకుండా బాబు తన బృందాన్ని ప్రోత్సహిస్తున్నారు. సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎవరో తెలియడం లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావా? లేక రేవంత్రెడ్డియా? వెల్‌లోకి ఫ్లోర్ లీడర్ వెళ్లి రచ్చ చేయడం దురదృష్టకరం. ఎంపీపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మహిళ అనే గౌరవం లేకుండా ఆమె గుండెకు గాయం చేస్తున్నారు. ఆర్. కృష్ణయ్యని సీఎం చేస్తానన్న బాబు.. ఆయనకు కనీసం ఫ్లోర్ లీడర్‌గానైనా అవకాశం ఇవ్వలేదు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మీడియాలో ప్రచారానికే... రేవంత్ రెడ్డి తీరు ఆంధ్ర పాలకులకు వంతపాడుతున్నట్లుగా ఉంది. మీడియాలో ప్రచారం కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. రౌడీగానైనా, విలన్‌గానైనా తనపేరు ప్రచారం కావాలని దిగజారి ప్రవర్తిస్తున్నాడు. వితంతువుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన రేవంత్‌ను ఎవరూ క్షమించరు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత అసెంబ్లీ జీరో అవర్: ప్రభుత్వ విధానమేంటో చెప్పండి అధికారంలోకి వచ్చి ఆరు నెలలై నా తెలంగాణ ప్రభుత్వ విధి విధానాలేమిటో ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి పెన్షన్లు వస్తాయో, ఆహార భద్రత కార్డుకు ఎవరు అర్హులో.. అర్థం కాని పరిస్థితిలో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. మాకు కార్డు లొస్తా యా? అని ప్రజలడిగితే సమాధానం చెప్పలేకపోతున్నాం. రోజుకో పథకాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్.. వాటి గురించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వివరిస్తే బాగుంటుంది. - అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి (బీజేపీ) కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తి చేయండి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగు నీరందించే కిన్నెరసాని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రూ.37 కోట్లు వెచ్చించి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ ద్వారా 3వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 7వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ...... - పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ) నక్కలగండి దిండి ప్రాజెక్టును చేపట్టా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందించే నక్కలగండి- దిండి ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగునీటితోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రాజెక్టును చేపట్టాలి. ..... - దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (సీపీఐ) వీఆర్ఏల వేతనం సవరించాలి తెలంగాణ రాష్ట్రంలో పనిచే స్తున్న 25వేల మంది వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించి, వారి వేతనాన్ని సవరించాలి. రెవెన్యూ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇందుకు కృషి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వీఆర్ఏలకు రూ. 6 వేల వేతనం మాత్రమే అందుతోంది, దాన్ని రూ. 15 వేలకు పెంచాలి. - భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (సీపీఎం) -
స్థలాలు సరే.. నిధులేవీ?
చిత్తూరు(టౌన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నిధులివ్వకనే అరచేతిలో వైకుంఠం చూపుతోంది. జిల్లాలో తొలివిడతగా 225 గ్రామ పంచాయతీలకు యార్డులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 135 యార్డులను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించగా మిగిలిన 90 యార్డుల బాధ్యతను జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తీసుకున్నారు. నిధులు రాకపోవడంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఏం చేయనున్నారంటే.. మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో పోగయ్యే చెత్తను సేకరించి యార్డులో ఎరువులను తయారు చేసి తద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలనేదే ప్రభుత్వ యోచన. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు యార్డుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించనుంది. తొలివిడతగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోరు డ్రిల్ చేసి, దానికి మోటారు అమర్చి, యంత్రాల వినియోగం కోసం షెడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందులో తయారైన ఎరువును ఆయా గ్రామ పంచాయతీలే అమ్ముకుని ఆదాయాన్ని పెంచుకునే ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది. నిధులే సమస్య.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే స్థలాలనైతే ప్రభుత్వం కేటాయించింది కాని యార్డుల నిర్మాణానికి నిధులను మాత్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వం అనుకున్న విధంగా డంపింగ్ యార్డులను నిర్మించాలంటే ఒక్కో దానికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా మంజూరు చేయకుండా ఆదేశాలు మాత్రం జారీ చేసి మిన్నకుంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించిన 135 యార్డులకు ప్రభుత్వం కేటాయిచిన స్థలాలను ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు చూపలేదు. నిధులు మంజూరు కాక, కేటాయించిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులును వివరణ కోరగా యార్డుల పర్యవేక్షణ బాధ్యతను తమకైతే అప్పగించారు కానీ నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదన్నారు. తమకు కూడా నిధులు రాలేదని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రావు వివరించారు. -
నిధులు నిల్...
సాక్షి, ఖమ్మం : నిధులు విడుదల కాకపోవడంతో గ్రామపంచాయతీల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కాగితాల్లో సొమ్ములు కనబడుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు పంచాయతీలకు ఒక్క పైసా చేరలేదు. మండు వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న ఏజెన్సీలోని పంచాయతీలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో మొత్తం 758 గ్రామ పంచాయతీలున్నాయి.. వీటిలో ఏజెన్సీలో 372 పంచాయతీలుండగా మిగిలినవి మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పారిశుధ్యం, మంచినీటి పథకాలు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మంచినీరు అందక, మురికి కంపు భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పాలక వర్గాలు ఏర్పడితే గ్రామాలు బాగు పడుతాయని ఆశించిన పల్లె ప్రజలకు భంగపాటు తప్పలేదు. పంచాయతీలకు పాలక వర్గం కళ వచ్చిన రెండు నెలల తర్వాత జిల్లాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు (ఎస్ఎఫ్సీ )కింద రూ.3.86 కోట్లు, టీఎఫ్సీ నిధులు రూ.11.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో మంచినీటి ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధి లైట్లు వేయించడం లాంటి పనులు చేయాలి. అయితే పాలకవర్గాలు ఏర్పడేనాటికి పల్లెల్లో పుట్టెడు సమస్యలు తిష్టవేశాయి. వీటిని తీర్చడానికి ప్రభుత్వం పిసరంత విడుదల చేసిన ఈ నిధులు ఏమూలన సరిపోలేదు. సర్పంచ్ల సంఘం ప్రతినిధులు నిధుల విషయమై పలుమార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే మున్సిపల్, పరిషత్, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంచాయతీలకు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికలు ఉంటాయని తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తుగా ఈ ఏడాది ప్రారంభంలో నిధుల విడుదల విషయమే ఆలోచించలేదు. ఫలితంగా ఇప్పుడు గ్రామాల్లో ఈ సమస్యలు విలయతాండవం చేస్తున్నా సర్పంచ్‌లు ఏమీ చేయలేకపోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని పల్లెజనం వారిని ప్రశ్నిస్తూ, నిలదీస్తున్నా.. నిధులు లేకుండా మేమేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. కాగితాల్లోనే రూ. 19.79 కోట్లు ఈ ఏడాది ప్రారంభంలో గ్రామ పంచాయతీలకు రూ.19.79 కోట్లు విడుదల కావాలి. ఇందులో జనరల్ ఫండ్ కింద రూ.15.18 కోట్లు, ఏజెన్సీలోని 372 పంచాయతీలకు రూ.4.61 కోట్లు మంజూరైనట్లు అధికారులు కాగితాల్లో చూపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పంచాయతీల ఖాతాల్లో మాత్రం ఈ పైసలు పడలేదు. ఇదేమని అధికారులను సర్పంచ్‌లు ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ అంటూ వారికి సమాధానం వస్తోంది. ఇదిగో వస్తాయి..అదిగో వస్తాయని అధికారులు చెబుతుండడంతో ఆశతో సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ సర్పంచ్‌లు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ప్రస్తుతం మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు, మంచినీటి మోటర్లు కాలిపోవడం, చేతి పంపులు పనిచేయకపోవడంతో గిరి పుత్రులు మంచినీటి కోసం తహతహలాడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉన్నా పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వలేక పోవడంతో పనులు సాగడంలేదు. దీంతో ఏజెన్సీలో గ్రామాలు అల్లాడుతున్నాయి. నూతన రాష్ట్రంలోనేనా..? ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల హడావిడిలో ఉంది. పంచాయతీల సమస్యలను కన్నెత్తి చూసే అధికారులే లేరు. ఈనెలలో అంతా ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తం అంతా ఇదే హంగామా. ఈ పరిస్థితుల్లో నూతనంగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంచినీటి ఎద్దడినైనా దృష్టిలో పెట్టుకుని కొంత మొత్తంలో నిధులు విడుదల చేస్తే వేసవిని గట్టెక్కవచ్చని పలువురు సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన ఎన్నికల పంచాయతి పోలింగ్