పంచాయతీల బిల్లుల్ని సర్కారే భరించాలి
గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు, బకాయిలను తెలంగాణ సర్కారే భరించాలి. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని చెల్లించటంతో పంచాయతీలపై భారం పడుతోంది. ఏకగీవ్రంగా ఎన్నికైన పంచాయతీలకు ఇస్తామన్న రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇప్పటికీ ఇవ్వలేదు.. వెంటనే విడుదల చేయాలి. ....... - జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి
.........................
రేషన్ కార్డులపై స్పష్టత అవసరం
తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఉద్యోగుల హెల్త్ కార్డులపై స్పష్టత లేదు. జీవో నంబర్ 653లోని అనేక అంశాలపై సంబంధిత మంత్రి సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. బోగస్ పేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారు. తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్ల పంపిణీ ఆరంభ శూరత్వంగా మారింది. ...... - బీజేపీ ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద
‘సంక్షేమం’ నుంచి తప్పుకునేందుకే కుట్ర
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద అందించే బియ్యంతోనే సరిపెట్టి సంక్షేమ పథకాల నుంచి తప్పుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే రేషన్ కార్డులకు అన్ని లింక్‌లను తొలగించి బియ్యానికి పరిమితం చేస్తోంది. ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఆధారంగా ఉండేది. అదే విధానాన్ని కొనసాగించాలి. ....... - కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ
పేరు ఫాస్ట్ పథకం.. అమలు మాత్రం స్లో
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేరును కేసీఆర్ ప్రభుత్వం ఫాస్ట్ పథకంగా మార్చింది. ఆచరణలో మాత్రం ఆ పథకాన్ని స్లోగా నడిపిస్తున్నారు. ఫలితంగా తెలంగాణలోని 15 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సగం విద్యా సంవత్సరం గడిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కనీసం గైడ్‌లైన్స్ రూపకల్పన జరుగలేదు. ఇటీవల నామామాత్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. నయా పైసా బ్యాంక్ ఖాతాల్లో చేరలేదు. విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు వారిని కళాశాలలకు రావద్దని ఇంటికి పంపిస్తున్నాయి......... - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి
........................
చరిత్రహీనులుగా మారవద్దు
తెలంగాణ శాసనసభను తప్పుదోవ పట్టించి టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మారవద్దు. రేవంత్‌రెడ్డి అబద్ధాలకోరు. ఆధారాలు లేని అభియోగాలు చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఆధారాలతో సహా రుజువు చేయాలి. సొంత మీడియా తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలిందే. ప్రజా సమస్యల చర్చపై శ్రద్ధ పెట్టాలే తప్ప అనవసర రాద్ధాంతాలతో సభను అగౌరవ పర్చవద్దు........ - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జీవన్‌రెడ్డి, బాలరాజు, గణేశ్ గుప్తా
ఆర్డీఎస్ నీళ్ల దోపిడీ పట్టని సర్కార్
తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో ఆర్డీఎస్‌సమస్యను అనుకూలంగా మలుచుకున్న టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే దాన్ని గాలికి వదిలేసింది. ఆర్డీఎస్ నీళ్లతో సీమాంధ్రలో రిజర్వాయిర్ నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ ఆయిన జీవో 100 అమలవుతున్నా కనీసం పట్టింపు లేదు. ఏడు గ్రామాలు నిండా మునిగే ప్రమాదం ఉంది. నీళ్ల దోపిడీ అడ్డుకొవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే గొంతు నొక్కుతున్నారు...... - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్
.....................
విషపు పాలు తాగి సభలో చిమ్ముతున్నారు
టీడీపీ ఎమ్మెల్యేలు బాబుకు చెందిన హెరిటేజ్ విషపు పాలు తాగి తెలంగాణ శాసనసభలో విషాన్ని చిమ్ముతున్నారు. మీ మాటలు ఎవరివి? సభ సజావుగా జరగకుండా బాబు తన బృందాన్ని ప్రోత్సహిస్తున్నారు. సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎవరో తెలియడం లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావా? లేక రేవంత్‌రెడ్డియా? వెల్‌లోకి ఫ్లోర్ లీడర్ వెళ్లి రచ్చ చేయడం దురదృష్టకరం. ఎంపీపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మహిళ అనే గౌరవం లేకుండా ఆమె గుండెకు గాయం చేస్తున్నారు. ఆర్. కృష్ణయ్యని సీఎం చేస్తానన్న బాబు.. ఆయనకు కనీసం ఫ్లోర్ లీడర్‌గానైనా అవకాశం ఇవ్వలేదు. - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్,
మీడియాలో ప్రచారానికే...
రేవంత్ రెడ్డి తీరు ఆంధ్ర పాలకులకు వంతపాడుతున్నట్లుగా ఉంది. మీడియాలో ప్రచారం కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. రౌడీగానైనా, విలన్‌గానైనా తనపేరు ప్రచారం కావాలని దిగజారి ప్రవర్తిస్తున్నాడు. వితంతువుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన రేవంత్‌ను ఎవరూ క్షమించరు. - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత
అసెంబ్లీ జీరో అవర్: ప్రభుత్వ విధానమేంటో చెప్పండి
అధికారంలోకి వచ్చి ఆరు నెలలై నా తెలంగాణ ప్రభుత్వ విధి విధానాలేమిటో ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి పెన్షన్లు వస్తాయో, ఆహార భద్రత కార్డుకు ఎవరు అర్హులో.. అర్థం కాని పరిస్థితిలో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. మాకు కార్డు లొస్తా యా? అని ప్రజలడిగితే సమాధానం చెప్పలేకపోతున్నాం. రోజుకో పథకాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్.. వాటి గురించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వివరిస్తే బాగుంటుంది. - అంబర్‌పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి (బీజేపీ)
కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తి చేయండి
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగు నీరందించే కిన్నెరసాని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రూ.37 కోట్లు వెచ్చించి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ ద్వారా 3వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 7వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ...... - పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ) నక్కలగండి
దిండి ప్రాజెక్టును చేపట్టా
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందించే నక్కలగండి- దిండి ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగునీటితోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రాజెక్టును చేపట్టాలి. ..... - దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (సీపీఐ)
వీఆర్‌ఏల వేతనం సవరించాలి
తెలంగాణ రాష్ట్రంలో పనిచే స్తున్న 25వేల మంది వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించి, వారి వేతనాన్ని సవరించాలి. రెవెన్యూ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇందుకు కృషి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వీఆర్‌ఏలకు రూ. 6 వేల వేతనం మాత్రమే అందుతోంది, దాన్ని రూ. 15 వేలకు పెంచాలి. - భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (సీపీఎం)