కూలి పనికి వెళ్తున్న సర్పంచ్
కూలి పనికి వెళ్తున్న సర్పంచ్
ఈమె పేరు బానోతు బుజ్జి ఖాసీం నాయక్, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండా సర్పంచ్. గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశానవాటిక, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల ప్రహరీ నిర్మాణం, ఇతరత్రా పనులకు రూ.18 లక్షలు వెచ్చించారు. పూర్తయి ఏడాదైనా బిల్లులు రాలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో ఆమె కూలి పనులకు వెళ్తోంది.
►నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి గతంలో ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.1.35 లక్షలు వచ్చేవి. కానీ ఇప్పుడవి రూ.89 వేలకు తగ్గిపోయాయి. ఇందులో రూ.25 వేలు కరెంటు బిల్లు, రూ.25 వేలు కార్మికుల వేతనాలు, రూ.10 వేలు ట్రాక్టర్ ఈఎంఐ, రూ.10 వేలు ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు పోతోంది.
ఇవి కాకుండా పేపరు బిల్లులు, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, మోటార్లు, స్టార్టర్లు కాలిపోతే మరమ్మతులు చేయించడం, పైపు లైన్లు పగిలితే వేయించడం, పల్లె వనాలు, పంచాయతీ స్థలాలకు ఫెన్సింగ్ వేయించడం, డ్రైనేజీల నిర్వహణ పనులు కలిపి మొత్తంగా రూ.లక్ష వరకు ఖర్చువుతోంది.
►చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే
ముందస్తుగా వైకుంఠధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, డంపింగ్ యార్డులు, వాటిల్లో సెగ్రిగేషన్ (చెత్తను విభజించే) షెడ్లు నిర్మించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) మెటీరియల్ కాంపోనెంట్ కింద వీటికి నిధులు రావలసి ఉంది. కానీ రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలా ఒక్కో గ్రామంలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీల్లో నెలవారీ నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదు. దీంతో సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి వస్తోంది. రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు సకాలంలో రాకపోగా, అదనంగా వెచ్చించినవి నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో వారు లబోదిబోమంటున్నారు.
ఇక శ్మశానవాటికలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డు వంటి నిర్మాణాలు ఏడాది, రెండేళ్ల కిందటే పూర్తయినా బిల్లులు రాలేదు. ఆరు నెలలుగా పైసా విడుదల కాలేదు. ఇవే రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్లు రావాల్సి ఉంది. దీంతో ఆ పనులు చేసిన సర్పంచ్‌లు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్నారు. ఈ కారణంతోనే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట సర్పంచ్ బండి ఎల్లయ్య ఆత్మహత్యకు యత్నించారు.
కొంతమంది సర్పంచ్‌లు అప్పులు తీర్చేందుకు కూలి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తాము మళ్లీ ఈ కార్యక్రమ నిర్వహణకు ఎక్కడ అప్పులు చేయాలని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనుల కోసం మరోసారి అప్పు అంటేనే వారు హడలెత్తిపోతున్నారు.
బిల్లులు విడుదల చేయమంటే బెదిరింపులు
తాము చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని, లేదంటే పల్లె ప్రగతిలో పాల్గొనబోమని ఇటీవల స్పష్టం చేసిన సర్పంచ్‌లను అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాలకు చెందిన సర్పంచ్‌లను నిధులు రాలేదని బహిరంగంగా ఎలా విమర్శిస్తారని ఆ మండల ఎంపీడీఓలు బెదిరించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను నోటీసు బోర్డు పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఇదీ జిల్లాల్లో పరిస్థితి..
►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.43 కోట్లకు పైగా బకాయిలున్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.
►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.49.82 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రెజరీలో 200కు పైగా గ్రామపంచాయతీల చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్మశాన వాటికలు, ఇతర నిర్మాణాలకు డబ్బులు రావాల్సి ఉంది.
►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.150 కోట్లకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్‌గా రావాల్సిన బిల్లులు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది.
►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.98 కోట్లు పెండింగ్ ఉన్నాయి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఇతర పనులవి కోట్ల రూపాయల బిల్లులు ఐదారు నెలలుగా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ కావటం లేదు.
►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల నిర్వహణ నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రావాల్సినవి రూ.62 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.
►సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు రూ.95 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలకు రూ.60 కోట్లు, మెదక్ జిల్లాలో 445 గ్రామ పంచాయతీలకు రూ.40 కోట్లు రావాల్సి ఉంది.
►జనగామ జిల్లాలో రూ.3.10 కోట్లు పెండింగ్‌లో ఉండగా, ములుగు జిల్లాలో రూ.2 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.6 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
రూ.7 లక్షల అప్పు.. తీర్చలేక ఆత్మహత్యాయత్నం
సీసీ రోడ్లు, శ్మశానవాటిక, పారిశుధ్య పనులకు రూ.11 లక్షలు ఖర్చు చేశా. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలే వచ్చాయి. రెండేళ్లుగా రూ.9 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో రూ.7 లక్షలు అప్పు చేసినవే. అవి చెల్లించలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశా.
– బండి ఎల్లయ్య, సర్పంచ్, అవుసలికుంట, లింగాల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
వడ్డీలు పెరిగిపోతున్నాయి
రూ.5 లక్షలు అప్పు చేసి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించా. పూర్తయి ఏడాది దాటింది. మరో రూ.4 లక్షలు ఇతర పనులు చేశా. రూ.9 లక్షలు రావాలి. ఆలస్యం అవుతుండటంతో వడ్డీలు పెరుగుతున్నాయి.
–బానోత్ రాందాస్, చుంచుపల్లి మండలం ధన్‌బాధ్, భద్రాద్రి కొత్తగూడెం
బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది
రూ.18 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, రైతు వేదిక, స్మశానవాటిక నిర్మించా. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది అవుతోంది.
–తోట సుజాత, నెన్నెల సర్పంచ్, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment