గ్రామ పంచాయతీ ఎన్నికలు, రైతు భరోసానే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ
రుణమాఫీ నేరుగా రైతు చేతికి వెళ్లలేదని, భరోసా అందిస్తేనే ‘స్థానికం’గా లాభమన్న పలువురు మంత్రులు
ఆర్థిక వెసులుబాటు మేరకు రూ.12 వేలకు పెంచుదామన్న సీఎం, డిప్యూటీ సీఎం..
ఇందిరమ్మ ఇళ్ల జోలికి ఇప్పుడు వెళ్లకపోవడమే మంచిదని కొందరు మంత్రుల అభిప్రాయం
రేషన్‌కార్డులు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.
ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.
ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment