అడిగే వారేరి.!
►గ్రామ పంచాయతీల్లో పాలన కరువు పేరుకే గ్రామాధికారులు
►ఉద్యోగం ఒక చోట.. ఉండేదొక చోట
►క్షేత్రస్థాయి ఉద్యోగులపై కొరవడిన పర్యవేక్షణ
►సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లె ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో పల్లె పాలన గాడి తప్పింది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా గ్రామాధికారులు ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విధులకు హజరవుతున్నారో లేదో కూడా ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగం చేసే చోట ఉండకపోయినా.. కనీసం సకాలం విధులకు హజరు అవుతున్నారా లేదా ప్రశ్నించే వారు కరువయ్యారు. దీంతో గ్రామాల్లో పాలన కరువైంది. సమస్యలతో పల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పడుతున్న అవస్థలు ఇన్ని కావు. ఒక వేళ మండల స్థాయి అధికారికి చెప్పుకుందామని వచ్చినా.. అక్కడ మండల స్థాయి అధికారుల సీట్లు ఖాళీగా దర్శనమిస్తాయి. అక్కడ అటెండరో.. లేక ఒక కంప్యూటర్ ఆపరేటరో తప్ప అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. సకాలంలో విధులకు హజరయ్యే వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.
జిల్లాలో 56 మండలాలు ఉండగా వీటి పరిధిలో 1029 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ అధికారి ఉన్నారు. కొన్ని గ్రామాలకు రెగ్యులర్ వీఆర్వో లేకపోయినప్పటికి ఇన్‌చార్జి వీఆర్వోలను నియమిస్తారు. వీరంతా ఉద్యోగం చేసే గ్రామంలో ఉండటం లేదు. పట్టణాలు, నగరాలలో ఉంటున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు చుట్టు పక్కల గ్రామాల వీఆర్వోలు అందరూ కూడా ఒంగోలులోనే దాదాపు ఉంటున్నారు. లేదా సొంతూళ్లలోనే ఉంటున్నారు. పని ప్రదేశానికి 25 కిలో మీటర్ల దూరంలోనే ఉంటున్నారు. ఇంకొంత మంది 50 కిలోమీటర్ల దూరంలోకూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. కనీసం మండల కేంద్రంలో కూడా 90 శాతం మంది ఉండటంలేదు.
గ్రామంలో ప్రతి ఒక్కరికి వీఆర్వోతో అవసరం ఉంటుంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక నష్టపోవాల్సి వస్తోంది. ఏ సర్టిఫికేట్‌కైనా.. వీఆర్‌వో తరువాత ఆర్‌ఐ. ఆ తరువాత తహశీల్దార్ సంతకం అవసరం. గ్రామ స్థాయి అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిం దే ఆట.. పాడిందే పాట సాగిపోతోంది.
వీరితో పాటు గ్రామ కార్యదర్శులు కూడా విధులకు సక్రమంగా రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 70 శాతం గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిత్యం తలుపులు మూసే ఉంటాయి. సిటిజన్ చార్టర్ ఉండదు. ఫోన్ రంబర్లు ప్రజలకు తెలియవు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటు ప్రజలకు సేవ చేయకపోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయి అధికారులు కూడా జిల్లా , డివిజన్ కేంద్రాలలో ఉండటంతో గ్రామ స్థాయి అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామ పాలన ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయింది. కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు గ్రామానికి రాని అధికారులను అడగలేని స్థితిలో ఉన్నారు.
అందుబాటులో ఉండాల్సిన అధికారులు వీరే..
గ్రామ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్‌వో), వీఆర్‌ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్), ఏఎన్‌ఎం, నీటి పారుదల శాఖ అధికారి; విద్యుత్ శాఖ లైన్‌మేన్, హెల్పర్, వెటర్నరీ అసిస్టెంట్ (పశు వైద్యాధికారి), వ్యవసాయ శాఖ విస్తరణాధికారి, ఎంపీఈవో, ఉద్యానశాఖ అధికారి, ఆర్‌డబ్లు్యఎస్ ఉద్యోగి (వాటర్‌మేన్), రేషన్ షాపు డీలర్లు, అంగన్‌వాడి టీచర్లు, ఆయాలు ప్రతి రోజు విధులకు హాజరయినట్లు ప్రతి గ్రామ పంచాయతీలోని మూమెంట్ రిజిస్ట్రర్‌లో సంతకాలు పెట్టి విధులకు హజరు కావాలి. వీళ్ల పోన్ నంబర్లు ఆయా గ్రామ ప్రజలకు తెలియజేయాలి. ఏ పని ఎన్ని రోజులకు అవుతుందో చెప్పాలి. వీరితో పాటు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిఉంది. కానీ ఇవేమీ పంచాయతీలలో జరగడం లేదు. వీరిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. జిల్లా కలెక్టర్ అయినా గ్రామస్థాయి ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.