Slbc Tunnel Project
-
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో భాగంగా ప్రధాన సొరంగానికి అనుసంధానంగా మరో టన్నెల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభంగా సాగేలా, ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే వేగంగా చర్యలు చేపట్టడానికి వీలుగా ‘అడిట్’ టన్నెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రధాన సొరంగంలో (ఇన్లెట్ నుంచి) 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా (హారిజాంటల్)గా ఈ ‘అడిట్’ టన్నెల్‌ను నిర్మించనుంది. ప్రధాన సొరంగంలోకి గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపునకు, మనుషులు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఈ టన్నెల్ ఉండనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, ఇతర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల సూచనలకు అనుగుణంగా... ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల పైకప్పు కుప్పకూలి, 8 మంది గల్లంతై ఇప్పటికి ఆరు రోజులు దాటింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు టన్నెల్ వద్దే ఉంటూ సహాయక చర్యలను, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో టన్నెల్ నిర్మాణంలో నిష్ణాతులైన దేశ, విదేశీ నిపుణుల సూచనలు, ఇంజనీర్ల అభిప్రాయాలను పరిశీలించారు. ప్రపంచంలో టన్నెల్ ప్రమాదాలు చాలా జరిగినప్పటికీ.. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం చాలా క్లిష్టమైనదని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద అనుసంధానం అయ్యేలా భూఉపరితలం నుంచి ‘అడిట్’ సొరంగం నిర్మించాలని నిర్ణయించారు. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ల తొలగింపు వంటివాటికి ఈ ‘అడిట్’ టన్నెల్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచించడంతో.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. మరో మార్గం లేకపోవడంతో.. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని భూమి ఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. 43 కిలోమీటర్ల ఈ టన్నెల్లో ‘ఇన్లెట్, ఔట్లెట్ ’ మినహా మధ్యలో ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. ప్రస్తుతం ప్రమాదం 13.9 కిలోమీటర్ల పాయింట్ వద్ద జరిగింది. ఇలాంటి సమయంలో మధ్యలో మరో మార్గం ఉంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. అయితే ఇక్కడ ఎక్కువ లోతు ఉండటంతో నిలువునా బావిలా సొరంగం తవ్వే అవకాశం లేదు, తవ్వినా ప్రయోజనం ఉండదని, కూలిపోయే అవకాశాలు ఎక్కువని తేల్చారు. ఈ క్రమంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా.. ఉపరితలంపై నుంచి ‘అడిట్’ టన్నెల్‌ను ఒక దారిలా నిర్మించాలని నిర్ణయించారు. నిపుణుల పర్యవేక్షణలో... ఎస్ఎల్బీసీ సొరంగానికి భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనల కోసం టన్నెల్ నిర్మాణాల్లో నిపుణులైన ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తంలను మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ వద్దకు రప్పించారు. సివిల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఈ ‘అడిట్’ సొరంగంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ‘అడిట్’ టన్నెల్ తవ్వడానికి అటవీ, పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా అవసరం లేదని... ఎస్ఎల్బీసీ సొరంగంలో భాగంగానే దీనిని నిర్మిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు పొందడం కష్టం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్ క్యాంపు వద్ద విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి.సంతోష్, ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జీఆర్ఏ, కాంట్రాక్టు సంస్థలు రాబిన్సన్, జేపీ అసోసియేట్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులు, నిపుణులు చేసిన సూచనలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)తో తవ్వకాలు జరుపుతున్నప్పుడు పైకప్పు కూలడం, మట్టి, నీరు, ఇతర ఖనిజాలు పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘అడిట్’ సొరంగం నిర్మాణం జరపాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకోసం ఎంత ఖర్చయినా వెచ్చిస్తామని చెప్పారు. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్‌లో నిరంతరం వివిధ టీంలకు చెందిన 20 మంది నిపుణులు మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. టన్నెల్లో సిల్ట్ తొలగింపు, డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. పనిచేయకుండా ఉన్న కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ కీలకం కానుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో సహాయక చర్యలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. -
Uttam Kumar: 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు
-
ఎస్ఎల్బీసీ టన్నెల్లో.. సవాల్‌గా మారిన సహాయక చర్యలు (ఫొటోలు)
-
నీళ్లు దూకని సొరంగాలు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 516 గ్రామాలకు తాగునీటిని గ్రావిటీ ద్వారా అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టు (ఏఎమ్మార్పి –ఎస్ఎల్బీసీ)ను ప్రతిపాదించారు.ఈ ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని నిర్ణయించిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో 306ను విడుదల చేసింది. అయినా పనులు మొదలుకాలేదు. తర్వాత 22 ఏళ్ల వరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు తిరిగి జీవం పోశారు. రూ.2,813 కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2005 ఆగస్టు 11న పరిపాలన అనుమతులు జారీ చేశారు. 2006లో సొరంగం పనులకు శంకుస్థాపన జరిగింది. రెండు సొరంగాలతో ప్రాజెక్టు.. భూసేకరణ, ఇతర వ్యయాలు పోగా.. రెండు సొరంగాల నిర్మాణానికి రూ.2,259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా.. రూ.1,925 కోట్లను కోట్ చేసి జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ పనులను దక్కించుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) నుంచి నల్లగొండ జిల్లాను ఆనుకొని ఉన్న మన్నెవారిపల్లి (ఔట్లెట్) వరకు 43.930 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పుతో తొలి సొరంగాన్ని ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఈ తొలి సొరంగం ద్వారా తరలించి లింక్ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి చేర్చాల్సి ఉంది. అక్కడి నుంచి లింక్ కాల్వతో 7.13 కిలోమీటర్ల రెండో సొరంగ మార్గంలో తరలించి.. మరో లింక్ కాల్వ ద్వారా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీటిని చేర్చాల్సి ఉంది. రెండు వైపుల నుంచి తవ్వకాలు.. 43.93 కిలోమీటర్లతొలి సొరంగానికి గాను ఇప్పటివరకు 34.71 కిలోమీటర్ల మేర పనిపూర్తవగా.. మరో 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఈ సొరంగాన్ని రెండు టన్నెల్ బోర్ మెషీన్ల (టీబీఎం)తో రెండు వైపుల (ఇన్లెట్, అవుట్లెట్) నుంచి తవ్వుకుంటూ వెళుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్లెట్ నుంచి 13.93 కి.మీ. పనులు పూర్తవగా.. అవతల మన్నెవారిపల్లి (ఔట్లెట్) వైపు నుంచి మరో 20.43 కి.మీ తవ్వకం పూర్తయింది.మధ్యలో 9.55 కి.మీ మేర సొరంగం తవ్వాల్సి ఉంది. మరోవైపు డిండి రిజర్వాయర్ నుంచి నీళ్లను పెండ్లిపాక రిజర్వాయర్‌కు తరలించడానికి చేపట్టిన 7.13 కిలోమీటర్ల రెండోసొరంగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ అందులో 3.84 కి.మీ. సొరంగానికి మాత్రమే లైనింగ్ పూర్తవగా.. మిగతా 3.29 కి.మీ ప్రాంతానికి లైనింగ్ చేయాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో పరికరాలు వస్తాయనగా.. 2019లో వచి్చన భారీ వర్షాలు, వరదల కారణంగా ఇన్లెట్ టన్నెల్లోకి సీపేజీ పెద్ద ఎత్తున రావడంతో పనులు ఆగిపోయాయి. అప్పటి నుంచి నీటిని తొలగించే ప్రక్రియ మాత్రమే నడుస్తోంది. మరోవైపు ఔట్లెట్ వైపు రాయి గట్టిదనం ఎక్కువగా ఉండటంతో టన్నెల్ బేరింగ్ మెషీన్ బేరింగ్, అడాప్టర్, రింగ్ బేర్ దెబ్బతిని 2023 జనవరి 29న పనులు నిలిచిపోయాయి. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నుంచి బేరింగ్‌ను కొనుగోలు చేసి.. ప్రత్యేక నౌక ద్వారా మన దేశానికి తరలిస్తున్నారు.భారీ పరిమాణంలో ఉండే ఈ పరికరాలు చెన్నైకి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు వైపులా తవ్వకాలను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్లెట్ నుంచి తవ్విన సొరంగంలో సీపేజీ (నీటి ఊటలు)ను నియంత్రించేందుకు గ్రౌటింగ్ చేస్తున్నారు. అయితే తాజా ప్రమాదం కారణంగా ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. టన్నెల్లో డీవాటరింగ్ చేసి, సీపేజీలో ఉన్న టీబీఎం మెషీన్‌ను బాగుచేసి పనులు ప్రారంభించాలంటే.. కనీసం ఏడాది సమయం పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు వివరాలివీ.. ⇒ ఎస్ఎల్బీసీ సొరంగాల పనుల తొలి అంచనా వ్యయం రూ.2,813 కోట్లు ⇒ గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన అంచనా వ్యయం: రూ.4,637.75 కోట్లు ⇒ ప్రాజెక్టులో ఇప్పటివరకు పూర్తయిన పనుల విలువ: రూ.2,689.47 కోట్లు ⇒ ఇంకా జరగాల్సిన పనుల విలువ: రూ.1,948 కోట్లు ⇒ పరిపాలన అనుమతులు జారీ అయినది: 2005 ఆగస్టు 11 ⇒ నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌తో ఒప్పందం జరిగినది: 2005 ఆగస్టు 28 ⇒ ప్రాజెక్టులోని సొరంగాలు: రెండు ⇒ తొలి సొరంగం పొడవు: 43.93 కిలోమీటర్లు ⇒ ఇందులో తవ్వకం పూర్తయిన నిడివి: 34.71 కిలోమీటర్లు ⇒ రెండో సొరంగం పొడవు: 7.13 కిలోమీటర్లు (మొత్తం పూర్తయింది) ⇒ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నీరందే ఆయకట్టు: 4.15 లక్షల ఎకరాలు ⇒ తాగునీరు అందే ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు: 516 ⇒ టన్నెల్స్ పూర్తికి ప్రస్తుత సర్కారు విధించుకున్న గడువు: 2026 -
నెలవారీగా నిధులు వారం వారం సమీక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్ఎఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు నెలవారీగా నిధులు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టన్నెల్‌ను ప్రతినెలా రెండు వైపులా 400 మీటర్లు తవి్వతే రూ.14 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు ఇచ్చేందు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కోవైపు 300 మీటర్ల చొప్పున తవి్వనా నిధులను ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుందని కాంట్రాక్టు సంస్థ వెల్లడించిందన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వద్ద చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పనులను శుక్రవారం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు.అనంతరం నీటిపారుదల శాఖ, విద్యుత్ అధికారులతో అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ టన్నెల్ పనులకు అయ్యే నిధులను గ్రీన్‌చానల్ ద్వారా ప్రతినెలా ఆర్థికశాఖ నుంచి ఇస్తామని, ఇప్పటికే రూ.42 కోట్లు ఇచ్చి పనులను మొదలు పెట్టించామన్నారు. మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లి టన్నెల్ బోర్మిషన్ బేరింగ్ గురించి మాట్లాడారని, బేరింగ్ రాగానే పనులు మరింత వేగం అవుతాయన్నారు.రాష్ట్ర విభజన కంటే ముందే ఎస్ఎల్బీసీ సొరంగం 32 కిలోమీటర్లు పూర్తయిందని, మరో 11 కిలోమీటర్లు చేస్తే రూ.వెయ్యి కోట్లతో ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.4 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇచి్చన హామీ మేరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పాలసీని రూపొందించామని తెలిపారు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లలో అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేస్తామన్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేస్తూనే వాటికి సంబంధం లేకుండా సాగునీరు వచ్చే ఎత్తిపోతలు, ఆర్అండ్ఆర్, ఫారెస్ట్ క్లియరెన్స్ పనులను పూర్తి చేయాలన్నారు. సాగర్ ఎడమకాలువ లైనింగ్ పూర్తి చేయాలన్నారు. హై లెవెల్ కెనాల్‌కు సంబంధించి భూసేకరణ, అటవీ భూముల అనుమతి వంటి వాటికి ప్రత్యేక అంచనాలు రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు. డిండి, నక్కలగండి, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి వాటికి ఒకే ఫైల్లో ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి నిధులను ఇస్తామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని బునాదిగాని కాలువ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. రూ.4400 కోట్లతో ఎస్ఎల్బీసీకి ఆమోదం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ.4400 కోట్ల పెంచి కేబినెట్లో ఆమోదిస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి చెల్లిస్తామని, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని 2027 సెపె్టంబర్ 20 నాటికి పూర్తి చేసి, సాగునీటిని అందిస్తామన్నారు. డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అనుమతులు తీసుకొచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. దీనిపై దృష్టి సారించాలని ఎంపీ రఘువీర్‌రెడ్డిని కోరారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ, బునాదిగాని కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. టన్నెల్‌తో శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి వెంకట్రెడ్డిఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పుట్టంగండి సిస్టర్స్ ద్వారా ఎత్తిపోసే దానికంటే ఇదే శాశ్వత పరిష్కారమన్నారు. అందుకే టన్నెల్‌ను మంజూరు చేయించామని, దానిని పూర్తి చేస్తామని చెప్పారు. పుట్టంగండిలో ప్రస్తుతం మరమ్మతులో ఉన్న నాలుగో మోటార్ ద్వారా తక్షణమే నీటిని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.ఎస్ఎల్బీసీని వేగంగా పూర్తి చేసేందుకు నెలకు రూ.30 కోట్లు ఇవ్వాలని కోరారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డిండి ఎత్తిపోతల కింద దాదాపుగా పూర్తయిన గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను వర్షాధారంగా నీటిని నింపుకోవచ్చని వాటికి సంబంధించిన పనులను చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, వంశీకృష్ణ, కుందూరు జయవీర్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికైనా..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు.. అంటే దాదాపు సగం... 3లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు... రూ.2,853 కోట్ల అంచనావ్యయం... 2005లో వైఎస్ హయాంలో ప్రారంభం... అప్పటి నుంచి దాదాపు రూ. 1200 కోట్ల ఖర్చు.. వాస్తవానికి పూర్తి కావాల్సింది 2010లో... కానీ పొడిగింపుల మీద పొడిగింపులు.. తగినంత బడ్జెట్ పెట్టక.. పెట్టిన బడ్జెట్ సకాలంలో ఇవ్వక... వాతావరణం అనుకూలించక.. 2016 నాటికి కూడా పూర్తవుతుందో లేదోననే అనుమానం... ఈ ముందుమాట చదువుతుంటేనే జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు గురించి అని అర్థం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. వైఎస్సార్ హయాంలో మంజూరైన ఈప్రాజెక్టును పాలకులు విస్మరించడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. సొరంగమార్గంతో పాటు ప్రధాన కాల్వ, అనుబంధ రిజర్వాయర్ల నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో నిలిచిపోయాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. బుధవారం జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుపై లఘుచర్చ జరిగింది. ఈ చర్చలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రవీంద్రకుమార్ పాల్గొనగా సీఎం కేసీఆర్ కూడా సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంత త్వరగా చేసినా రెండేళ్లు పడుతుందన్న సీఎం... ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎమ్మెల్యేల కోరిక మేరకు ఈ ప్రాజెక్టు భవిష్యత్‌ను నిర్ణయించేందుకుగాను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదలశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం ప్రాజెక్టు భవితవ్యం తేలనుంది. సభలో ఏం జరిగింది? జిల్లాకు చెందిన కాంగ్రెస్, సీపీఐ సభ్యులు 344 నిబంధన కింద ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై చర్చించాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు ఈ నోటీసుపై చర్చకు స్పీకర్ అనుమతించడంతో నోటీసు ఇచ్చిన వారిలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చను ప్రారంభించారు. తెలంగాణ సాయుధపోరాటం జరిగిందీ.. మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మబలిదానాలు ప్రారంభమైందీ నల్లగొండ జిల్లానుంచేనని, కానీ త్యాగాల నల్లగొండకు మిగిలింది ఫ్లోరైడ్ నీళ్లేనన్నారు.ఈ పీడ విరగడ కావాలంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రవీంద్రకుమార్ జానారెడ్డి, కూడా చర్చలో పాల్గొన్నారు. రవీంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు వాటర్‌గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీరు ఇస్తే సరిపోదని, పంటల ద్వారా విస్తరించే ఫ్లోరైడ్‌ను అరికట్టాలంటే తగినంత సాగునీరు ఇవ్వాలని కోరారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో రూపొందించిన నిబంధనల కారణంగానే దీనిని పూర్తి చేయలేకపోయామని, ఇప్పుడు జిల్లా ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు స్వరూపమిది... ఎస్ఎల్బీసీని 2005లో వైఎస్ హయాంలో 2853 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా నిధుల విడుదలలో జాప్యం కారణంగా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు కింద కృష్ణా నీటిని గ్రావిటీ ద్వారా దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలు ఉన్నాయి. సొరంగమార్గంతో పాటు ప్రధాన కాల్వలు తవ్వాల్సి ఉంది. శ్రీశైలం సొరంగంలోని టన్నెల్-1 అవుట్లెట్, టన్నెల్-2 ఇన్లెట్లకు అనుసంధానంగా నక్కలగండి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్-1 ఇన్లెట్ నుంచి 45 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తవ్వాల్సి ఉంది. ఈ టన్నెల్ మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద టన్నెల్-1 అవుట్లెట్ వరకు సాగుతుంది. చందంపేట మండలంలోని నక్కలగండి తండా వద్ద అవుట్లెట్ నుంచి వచ్చే జలాలు ఓపెన్ చానల్ ద్వారా రిజర్వాయర్‌లోకి చేరుతాయి. అక్కడి నుంచి టన్నెల్-2 ఇన్లెట్ (తెల్దేవర్పల్లి) నుంచి ప్రారంభమైన ఏడు కిలోమీటర్ల టన్నెల్ నేరడుగొమ్ము అవుట్లెట్ వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా పెండ్లిపాకల రిజర్వాయర్‌కు నీరు చేరుకుంటుంది. ప్రాజెక్టు ఏ మేరకు పూర్తయింది? ఈ ప్రాజెక్టు కింద టన్నెల్-1 (43.5 కిలోమీటర్లు), టన్నెల్-2 (ఏడు కిలోమీటర్లు) సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా, ప్ర స్తుతం టన్నెల్-1 ( 24 కిలోమీటర్లు) టన్నెల్-2 (ఏడు కిలోమీటర్లు) పూర్తయ్యింది. ఇంకా టన్నెల్-1లో 19 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఓపెన్కాల్వలు కూడా 24 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సొరంగం తవ్వే మిషన్ చెడిపోవడంతో పనులు నిలిచి పోయాయి. ఇప్పుడు ఆ యంత్రం మరమ్మతుతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అంచనా వ్యయం కన్నా రూ.726 కోట్లు కావాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లితండా, దేవ్లాతండా, మార్లపాడుతండాతో పాటు నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తెల్దేవర్పల్లి,మోత్యాతండా, నక్కలగండితండా పరిధిలో 3723 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నా యి. ముంపుకు గురవున్న భూములపై ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. కేవలం 200 ఎకరాలకు మాత్రమే డీఎన్‌డీడీ పూర్తికాగా ఆ రైతులకు నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి చెల్లించాల్సి ఉంది.