ఇప్పటికైనా..? | Nalgonda Slbc Tunnel Project | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా..?

Published Thu, Nov 20 2014 3:34 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Nalgonda Slbc Tunnel Project

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు.. అంటే దాదాపు సగం... 3లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు... రూ.2,853 కోట్ల అంచనావ్యయం... 2005లో వైఎస్ హయాంలో ప్రారంభం... అప్పటి నుంచి దాదాపు రూ. 1200 కోట్ల ఖర్చు.. వాస్తవానికి పూర్తి కావాల్సింది 2010లో... కానీ పొడిగింపుల మీద పొడిగింపులు.. తగినంత బడ్జెట్ పెట్టక.. పెట్టిన బడ్జెట్ సకాలంలో ఇవ్వక... వాతావరణం అనుకూలించక.. 2016 నాటికి కూడా పూర్తవుతుందో లేదోననే అనుమానం... ఈ ముందుమాట చదువుతుంటేనే జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు గురించి అని అర్థం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. వైఎస్సార్  హయాంలో మంజూరైన ఈప్రాజెక్టును పాలకులు విస్మరించడంతో  పనులు నత్తనడకన సాగుతున్నాయి. సొరంగమార్గంతో పాటు ప్రధాన కాల్వ, అనుబంధ రిజర్వాయర్ల నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో నిలిచిపోయాయి.
 
 అయితే, ఈ ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందనే ఆశలు మళ్లీ చిగురించాయి. బుధవారం జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుపై లఘుచర్చ జరిగింది. ఈ చర్చలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రవీంద్రకుమార్ పాల్గొనగా సీఎం కేసీఆర్ కూడా సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంత త్వరగా చేసినా రెండేళ్లు పడుతుందన్న సీఎం... ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎమ్మెల్యేల కోరిక మేరకు ఈ ప్రాజెక్టు భవిష్యత్‌ను నిర్ణయించేందుకుగాను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదలశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం ప్రాజెక్టు భవితవ్యం తేలనుంది.
 
 సభలో ఏం జరిగింది?
 జిల్లాకు చెందిన కాంగ్రెస్, సీపీఐ సభ్యులు 344 నిబంధన కింద ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై చర్చించాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు ఈ నోటీసుపై చర్చకు స్పీకర్ అనుమతించడంతో నోటీసు ఇచ్చిన వారిలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చను ప్రారంభించారు. తెలంగాణ సాయుధపోరాటం జరిగిందీ.. మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మబలిదానాలు ప్రారంభమైందీ నల్లగొండ జిల్లానుంచేనని, కానీ త్యాగాల నల్లగొండకు మిగిలింది ఫ్లోరైడ్ నీళ్లేనన్నారు.ఈ పీడ విరగడ కావాలంటే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయాలని  డిమాండ్ చేశారు. అనంతరం రవీంద్రకుమార్ జానారెడ్డి, కూడా చర్చలో పాల్గొన్నారు.
 
 రవీంద్రకుమార్   మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు వాటర్‌గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీరు ఇస్తే సరిపోదని, పంటల ద్వారా విస్తరించే ఫ్లోరైడ్‌ను అరికట్టాలంటే తగినంత సాగునీరు ఇవ్వాలని కోరారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో రూపొందించిన నిబంధనల కారణంగానే దీనిని పూర్తి చేయలేకపోయామని, ఇప్పుడు జిల్లా ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
 ప్రాజెక్టు స్వరూపమిది...
 ఎస్‌ఎల్‌బీసీని 2005లో వైఎస్ హయాంలో 2853 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా నిధుల విడుదలలో జాప్యం కారణంగా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు కింద  కృష్ణా నీటిని గ్రావిటీ ద్వారా దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలు ఉన్నాయి. సొరంగమార్గంతో పాటు ప్రధాన కాల్వలు తవ్వాల్సి ఉంది. శ్రీశైలం సొరంగంలోని టన్నెల్-1 అవుట్‌లెట్, టన్నెల్-2 ఇన్‌లెట్‌లకు అనుసంధానంగా నక్కలగండి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్-1 ఇన్‌లెట్ నుంచి 45 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తవ్వాల్సి ఉంది.  ఈ టన్నెల్ మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద టన్నెల్-1 అవుట్‌లెట్ వరకు సాగుతుంది. చందంపేట మండలంలోని నక్కలగండి తండా వద్ద అవుట్‌లెట్ నుంచి వచ్చే జలాలు ఓపెన్ చానల్ ద్వారా రిజర్వాయర్‌లోకి చేరుతాయి. అక్కడి నుంచి టన్నెల్-2 ఇన్‌లెట్ (తెల్దేవర్‌పల్లి) నుంచి ప్రారంభమైన ఏడు కిలోమీటర్ల టన్నెల్ నేరడుగొమ్ము అవుట్‌లెట్ వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా పెండ్లిపాకల రిజర్వాయర్‌కు నీరు చేరుకుంటుంది.
 
 ప్రాజెక్టు ఏ మేరకు పూర్తయింది?
 ఈ ప్రాజెక్టు కింద టన్నెల్-1 (43.5 కిలోమీటర్లు), టన్నెల్-2 (ఏడు కిలోమీటర్లు) సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా,   ప్ర స్తుతం టన్నెల్-1 ( 24 కిలోమీటర్లు) టన్నెల్-2 (ఏడు కిలోమీటర్లు) పూర్తయ్యింది. ఇంకా టన్నెల్-1లో 19 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. దీంతో పాటు  ఓపెన్‌కాల్వలు కూడా 24 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. గతంలో  కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సొరంగం తవ్వే మిషన్ చెడిపోవడంతో పనులు నిలిచి పోయాయి. ఇప్పుడు ఆ యంత్రం మరమ్మతుతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అంచనా వ్యయం కన్నా రూ.726 కోట్లు కావాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లితండా, దేవ్లాతండా, మార్లపాడుతండాతో పాటు నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తెల్దేవర్‌పల్లి,మోత్యాతండా, నక్కలగండితండా పరిధిలో 3723 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నా యి. ముంపుకు గురవున్న భూములపై ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. కేవలం 200 ఎకరాలకు మాత్రమే డీఎన్‌డీడీ పూర్తికాగా ఆ రైతులకు నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement