నెలవారీగా నిధులు వారం వారం సమీక్ష | SLBC to be completed on priority basis in two years | Sakshi
Sakshi News home page

నెలవారీగా నిధులు వారం వారం సమీక్ష

Published Sat, Sep 21 2024 5:07 AM | Last Updated on Sat, Sep 21 2024 5:07 AM

SLBC to be completed on priority basis in two years

20 నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మంత్రులు ఉత్తమ్, వెంకట్‌రెడ్డితో కలిసి టన్నెల్‌ పరిశీలన

ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్‌ఎఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు నెలవారీగా నిధులు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టన్నెల్‌ను ప్రతినెలా రెండు వైపులా 400 మీటర్లు తవి్వతే రూ.14 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు ఇచ్చేందు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కోవైపు 300 మీటర్ల చొప్పున తవి్వనా నిధులను ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుందని కాంట్రాక్టు సంస్థ వెల్లడించిందన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వద్ద చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులను శుక్రవారం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు.

అనంతరం నీటిపారుదల శాఖ, విద్యుత్‌ అధికారులతో అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ టన్నెల్‌ పనులకు అయ్యే నిధులను గ్రీన్‌చానల్‌ ద్వారా ప్రతినెలా ఆర్థికశాఖ నుంచి ఇస్తామని, ఇప్పటికే రూ.42 కోట్లు ఇచ్చి పనులను మొదలు పెట్టించామన్నారు. మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లి టన్నెల్‌ బోర్‌మిషన్‌ బేరింగ్‌ గురించి మాట్లాడారని, బేరింగ్‌ రాగానే పనులు మరింత వేగం అవుతాయన్నారు.

రాష్ట్ర విభజన కంటే ముందే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం 32 కిలోమీటర్లు పూర్తయిందని, మరో 11 కిలోమీటర్లు చేస్తే రూ.వెయ్యి కోట్లతో ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.4 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇచి్చన హామీ మేరకు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పాలసీని రూపొందించామని తెలిపారు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లలో అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేస్తామన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను చేస్తూనే వాటికి సంబంధం లేకుండా సాగునీరు వచ్చే ఎత్తిపోతలు, ఆర్‌అండ్‌ఆర్, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ పనులను పూర్తి చేయాలన్నారు. సాగర్‌ ఎడమకాలువ లైనింగ్‌ పూర్తి చేయాలన్నారు. హై లెవెల్‌ కెనాల్‌కు సంబంధించి భూసేకరణ, అటవీ భూముల అనుమతి వంటి వాటికి ప్రత్యేక అంచనాలు రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు. డిండి, నక్కలగండి, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వంటి వాటికి ఒకే ఫైల్లో ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి నిధులను ఇస్తామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని బునాదిగాని కాలువ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. 

రూ.4400 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీకి ఆమోదం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ.4400 కోట్ల పెంచి కేబినెట్‌లో ఆమోదిస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి చెల్లిస్తామని, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని 2027 సెపె్టంబర్‌ 20 నాటికి పూర్తి చేసి, సాగునీటిని అందిస్తామన్నారు. డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అనుమతులు తీసుకొచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. దీనిపై దృష్టి సారించాలని ఎంపీ రఘువీర్‌రెడ్డిని కోరారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ, బునాదిగాని కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.  

టన్నెల్‌తో శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ద్వారా 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పుట్టంగండి సిస్టర్స్‌ ద్వారా ఎత్తిపోసే దానికంటే ఇదే శాశ్వత పరిష్కారమన్నారు. అందుకే టన్నెల్‌ను మంజూరు చేయించామని, దానిని పూర్తి చేస్తామని చెప్పారు. పుట్టంగండిలో ప్రస్తుతం మరమ్మతులో ఉన్న నాలుగో మోటార్‌ ద్వారా తక్షణమే నీటిని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఎస్‌ఎల్‌బీసీని వేగంగా పూర్తి చేసేందుకు నెలకు రూ.30 కోట్లు ఇవ్వాలని కోరారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డిండి ఎత్తిపోతల కింద దాదాపుగా పూర్తయిన గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను వర్షాధారంగా నీటిని నింపుకోవచ్చని వాటికి సంబంధించిన పనులను చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్‌ బాలునాయక్, వంశీకృష్ణ, కుందూరు జయవీర్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement