washing machines
-
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్‌భవ!
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్‌పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. భారీగా హవాలా నగదు పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. చదవండి: బతుకమ్మలను చూసేందుకు వెళ్తూ.. -
బోలెడు ఉపయోగాలతో.. స్మార్ట్ వాషింగ్ మెషీన్
ఇది స్మార్ట్ వాషింగ్ మెషిన్. ఇందులో ఒకే అర ఉంటుంది. ఈ అరలోనే బట్టలు ఉతకడం, ఆరవేయడం ప్రక్రియలు చాలా తేలికగా పూర్తయిపోతాయి. అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘పారాడిమ్ ఎవర్గ్రీన్’ కంపెనీ ఇటీవల ఈ స్మార్ట్ వాషింగ్ మెషిన్‌కు రూపకల్పన చేసింది. ఇంట్లో ఎక్కడైనా దీన్ని సౌకర్యవంతంగా పెట్టుకోవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు వాషింగ్ మెషిన్ల మాదిరిగా ఇది ఎక్కువ చోటు ఆక్రమించుకోదు. అందువల్ల చిన్న చిన్న ఇళ్లలోనూ దీనిని సులువుగా వాడుకోవచ్చు. ‘ఈవీ స్మార్ట్ లాండ్రీ సొల్యూషన్’ పేరుతో ‘పారాడిమ్ ఎవర్గ్రీన్’ దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో కేవలం 90 నిమిషాల్లోనే బట్టలను శుభ్రంగా ఉతికి, ఆరేసుకోవచ్చు. దీని ధర 1199 డాలర్లు (రూ.98,675) మాత్రమే! చదవండి: సూపర్ గ్యాడ్జెట్ : బట్టతలపై వెంట్రుకలు కావాలా నాయనా! -
బట్టలే కాదు, చేతి వేళ్లను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఉందని మీకు తెలుసా!
సాయంత్రం చిరుతిళ్లు చాలామందికి అలవాటే! పకోడీలు, చిప్స్ వంటివి పంటి కింద కరకరలాడిస్తూ కబుర్లాడుకోవడం చాలామందికి ఇష్టమైన కాలక్షేపం. నూనెలో వేయించిన చిరుతిళ్లు తినేటప్పుడు మధ్యలో అదే చేత్తో మరో వస్తువు అందుకోవాలంటే, చెయ్యి కడుక్కోవడమో లేదా కనీసం టిష్యూపేపర్తో తుడుచుకోవడమో తప్పదు. పదే పదే చేతులు తుడుచుకోవాల్సిన పరిస్థితులు కొంత చిరాకు కలిగిస్తాయి. అంతేకాదు, టిష్యూపేపర్ వృథాకు దారితీస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టడానికే అంతర్జాతీయ చిప్స్ తయారీ సంస్థ ‘లేస్’ ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ బుల్లి పరికరంలో అరచెయ్యంతా పట్టదు గాని, వేళ్లు ఇంచక్కా పట్టేస్తాయి. దీని ఎత్తు 15 సెం.మీ., వెడల్పు 11 సెం.మీ. ఇందులో వేళ్లు పెడితే చాలు, ఇట్టే శుభ్రమైపోతాయి. ఇందులో వేళ్లు పెట్టగానే, దీని పైభాగంలోని సెన్సర్లు గుర్తించి, ఇందులోని సిలిండర్ నుంచి ఆల్కహాల్‌ను స్ప్రే చేస్తాయి. ఇందులోని వేడిమి వల్ల క్షణాల్లోనే వేళ్లు పొడిగా శుభ్రంగా తయారవుతాయి. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకుని ఇంచక్కా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి పైభాగంలోని సిలిండర్ లో ఆల్కహాల్‌ను ఎప్పటి కప్పుడు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎంత ముచ్చటగా ఉన్నా, మార్కెట్లో దీనిని కొనుక్కోవాలంటే కష్టమే! ‘లేస్’ సంస్థ ఇప్పటి వరకు ఈ పరికరాలను ఐదింటిని మాత్రమే తయారు చేసింది. -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
వాషింగ్ మెషీన్ ఆన్ చేసి లైట్ తీసుకోకండి!
మనం తరుచూ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిందని, గ్యాస్ లీకై పేలిందనే వార్తలు వింటుంటాం. కానీ మీరెప్పుడైనా వాషింగ్ మెషీన్ పేలిందని విన్నారా. అవును ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాషింగ్ మెషీన్ పేలే అవకాశం ఉంది. చాలా మంది వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అలా చేయడం ముమ్మాటి తప్పే. కొన్ని చిట్కాలు పాటిస్తే వాషింగ్ మెషీన్‌ను ఎక్కువ కాలం వినియోగించుకోవడమే కాదు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఇటీవల స్కాట్లాండ్ కు చెందిన లూరా బిరెల్ అనే మహిళ వాషింగ్ మెషీన్ లోలో బట్టలు వేసి, ఇంట్లోనే మరో పనిలో నిమగ్నమైంది. వాషింగ్ మెషీన్ బటన్ ఆన్ చేసిన కొద్ది సేపటి తర్వాత ఇంట్లోనే బాంబు పేలిన శబ్ధం వినిపించింది. దీంతో ఆందోళనకు గురైన లూరా.. ఏం జరిగిందోనని వాషింగ్ మెషీన్ వైపు చూడగా.. అది పేలి పొగలు రావడం గమనించింది. వెంటనే వాషింగ్ మెషీన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే తనకు జరిగిన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. వాషింగ్ మెషీన్ ఆన్ చేసి బయటకు వెళ్లి ఉంటే ఏమయ్యేదోనని ఊహించుకుంటే భయమేస్తుందంటూ నెటిజన్లతో షేర్ చేసుకుంది. వాషింగ్ మెషీన్ పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాషింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేయండి. జాగ్రత్తగా ఉండొచ్చు. ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాహింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేస్తే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ♦ ట్యాప్ నుంచి వాషింగ్ మెషీన్‌లోకి వాటర్‌ను పంపే పైపుల్ని మార్చుకోవాలి. ఆ పైపులు పగిలినా, లేదంటే వాటర్ లీక్ అయినా లోపల ఉండే మిషనరీ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ♦ వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉన్నప్పుడు వింత శబ్ధాలు వస్తుంటే వెంటనే దాన్ని మార్చుకోవడం ఉత్తమం. లేదంటే లేని పోని తలనొప్పిల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కరెంట్ షాక్ తగలడం, మెషీన్ బ్లాస్ట్ అవ్వడంలాంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ♦ వాషింగ్ మెషీన్ చుట్టూ మీ పిల్లలు, లేదంటే పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉండగా ఫ్రంట్ డోర్ సరిగ్గా వేశామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని లోపల వేస్తే..లోపల బట్టల్ని వాష్ చేసే చక్రాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ♦ వాషింగ్ సమయంలో ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవాలి. మీకు సూచించిన విధంగా మెషీన్ ను ఆపరేట్ చేయాలి. ♦ వాషింగ్ మెషీన్ ను నీట్ గా కడగాలి. వాషింగ్ మెషీన్ క్లీనర్ లేదా వేడి నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడాల్ని వినియోగించాలి. వాటిని వినియోగిస్తే లోపల ఉన్న సర్ఫ్, సబ్బు ముక్కలు తొలగిపోతాయి. ఎలాంటి మరమ్మత్తులు రాకుండా చూసుకోవచ్చు. -
తమిళనాడు పోల్స్: దుస్తులు ఉతికి, గిన్నెలు తోమి
సాక్షి,చెన్నై: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్దానాలు గుప్పించడం, చిత్ర విచిత్ర శైలిలో ప్రచారం చేయడం సర్వ సాధారణం. తమిళనాట హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ వార్తల్లో నిలిచారు. బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. సోమవారం ప్రచార సమయంలో నాగపట్టణంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ప్రచారాని వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు. దీంతో కాసేపు బట్టలు వాష్ చేసిన ఆయన, పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు. ఈ పరిణామంతో ఔరా అంటూ ఆశ్చర్యపోవడం అక్కడున్నవారి వంతైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు రోబోతో ప్రచారం చేస్తున్నారు, మరికొందరు పార్టీ ఎన్నికల చిహ్నాన్ని తమ తలపై వేసుకుంటున్నారు. కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని అన్నా డీఎంకే తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/orDGoRFUhn — ANI (@ANI) March 23, 2021 — ANI (@ANI) March 23, 2021 -
టీవీల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపు అనివార్యమంటూ ఎల్జీ, ప్యానసోనిక్, థామ్సన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ‘కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో మా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు‘ అని ప్యానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (హోమ్ అప్లయెన్సెస్ విభాగం) విజయ్ బాబు చెప్పారు. ఆలోచనలో సోనీ.. మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ‘రోజురోజుకు మారిపోతున్న సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, పెంపు ఎంత మేర ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు‘ అని సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ విధానం నేథ్యంలో ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అయితే ఫ్యాక్టరీలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చేయకపోతుండటంతో సరఫరా పరిమితంగానే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయని వివరించారు. టీవీ ఓపెన్‌సెల్ కొరత తీవ్రంగా ఉందని, దీంతో వాటి ధర 200 శాతం పైగా ఎగిసిందని భారత్‌లో థామ్సన్, కొడక్ ఉత్పత్తులను విక్రయించే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవడంతో అంతా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. జనవరి నుంచి థామ్సన్, కోడక్ తమ ఆండ్రాయిడ్ టీవీల రేట్లను 20% మేర పెంచే అవకాశం ఉందని వివరించారు. డిమాండ్‌కు దెబ్బ.. బ్రాండ్లు రేట్లను పెంచిన పక్షంలో వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘కమోడిటీల ధరలు 20–25 శాతం పెరగడం, కంటెయినర్ల కొరతతో సముద్ర.. విమాన రవాణా చార్జీలు 5–6 రెట్లు పెరిగిపోవడంతో ఉపకరణాల ముడి వస్తువుల వ్యయాలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో సమీప భవిష్యత్‌లో బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం దాకా పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్ దెబ్బతినే ముప్పు ఉంది‘ అని పేర్కొన్నారు. అయితే, పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గట్లుగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సీఈఏఎంఏ, ఫ్రాస్ట్ అండ్ సలివాన్ సంయుక్త నివేదిక ప్రకారం 2018–19లో కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ పరిమాణం రూ. 76,400 కోట్లుగా నమోదైంది. -
ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలను తగ్గించిన బాష్
7–8 శాతం డిస్కౌంట్ ప్రకటించిన బాష్, సీమెన్స్ ముంబై: దసరా, దీపావళి కంటే ముందుగానే బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్(బీఎస్‌హెచ్) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ నుంచి ఉత్పత్తి అవుతున్న బాష్, సీమెన్స్ బ్రాండ్ల ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై 7 నుంచి 8 శాతం వరకు ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గింపు ధరలు గురువారం నుంచే అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. గతనెలలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ గున్‌జన్ శ్రీవాస్తవ వివరించారు. ’పండుగల సీజన్ దగ్గర పడుతున్న సమయంలో ధరలు తగ్గడం వల్ల కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 30–35 శాతం మేర ఆరోగ్యకర వృద్ధిరేటును నమోదుచేశాం. ఇదే స్థాయి వృద్ధిరేటును ఈఏడాదిలో కూడా ఆశిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే గోద్రేజ్ అప్లియెన్సెస్, శాంసంగ్, పానాసోనిక్ కంపెనీలు పలు గృహోపకరణాలపై 8% వరకు ధరలను తగ్గించాయి. -
తగ్గనున్న వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌ల ధరలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి వరకు ఆగవలసిన అవసరం లేకుండానే కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీలు డిస్కౌంట్ల సందడి చేయనున్నాయి. గడిచిన వారంలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని ఉత్పత్తి సంస్థలు కస్టమర్లకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. జీఎస్టీ భారం తగ్గిన జాబితాలో 27 అంగుళాల లోపు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు, హ్యాండ్ డ్రైయర్లు ఉండగా.. వీటి ధరలను త్వరలోనే 7–8 శాతం వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీలు చెబుతున్నాయి. సవరించిన జీఎస్టీ రేట్లు జూలై 27 నుంచి అమలుకానుండగా, ఈ ప్రయోజనం మొత్తాన్ని కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తామని గోద్రేజ్ ప్రకటించింది. తమ బ్రాండ్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై త్వరలోనే 7–8% తగ్గింపు ఉంటుందని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వెల్లడించారు. జూలై 27 నుంచే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగ దారులకు అందించనున్నట్లు ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయ్ బాబు తెలిపారు. 26 అంగుళాల వరకు టీవీల ధరలను త్వరలోనే 7–8% వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. -
20 ఏళ్ల తర్వాత, టాటాలు రీ-ఎంట్రీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ ఏంటి అంటే? ఠక్కున టాటా గ్రూప్ అని చెప్పేస్తాం. ఈ గ్రూప్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో అప్పుడప్పుడే గృహవినియోగదారులు అలవాడు పడుతున్న వైట్ గూడ్స్‌ను అంటే రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్ వాషర్స్ను విక్రయించడం ఆపేసింది. తాజాగా ఈ మార్కెట్ జోరందుకోవడంతో, మళ్లీ వైట్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెనస్, డిష్ వాషర్స్ను ఓల్టస్ బెకో బ్రాండ్ కింద విక్రయించాలని యోచిస్తుందని గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దీని కోసం వెయ్యి కోట్ల పెట్టుబడులను కూడా టాటా గ్రూప్ సిద్ధం చేసిందట. ప్రస్తుతం దేశీయంగా వైట్స్ గూడ్స్‌కు రూ.35 వేల కోట్ల మార్కెట్ ఉంది. ఈ ఓల్టస్ బ్రాండ్ కిందనే 1998 వరకు టాటాలు వైట్ గూడ్స్‌ను విక్రయించేవి. ఆ అనంతరం విక్రయాలను ఆపివేసి, 2003 వరకు ఎల్జీ, శాంసంగ్‌ల కోసం రిఫ్రిజిరేటర్లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను మాత్రమే ఓల్టస్ కలిగి ఉంది. ప్రస్తుతం వైట్స్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని టాటాలు నిర్ణయించారు. ఆగస్టు నుంచి దశల వారీగా వైట్ గూడ్స్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్టు ఓల్టస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ భక్షి చెప్పారు. అక్టోబర్‌లో ప్రారంభం కాబోయే పండుగ సీజన్ వరకు దేశవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు అంచనా వేస్తున్నారు. దీని కోసం ఓల్టస్, టర్కీకి చెందిన ఆర్సెలిక్ ఏఎస్‌లు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఉత్పత్తులను తొలుత థాయ్‌లాండ్, చైనా, టర్కీలలోని ఆర్సెలిక్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ అనంతరం వచ్చే ఏడాది నుంచి గుజరాత్లో ప్రారంభించబోయే ప్లాంట్‌లో ఈ ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభిస్తామని భక్షి చెప్పారు. 2019 ద్వితీయార్థం నుంచి 10 లక్షల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, 5 లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను రూపొందిస్తామని తెలిపారు. దీని కోసం రూ.240 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ ఏసీ వ్యాపారాల్లో ఆధిపత్య స్థానంలో ఉంది. వైట్స్ గూడ్స్ రీ-లాంచింగ్‌తో ఈ మార్కెట్లోనూ ఆధిపత్యస్థానాన్ని కైవసం చేసుకోనుంది. బెకో-పార్టనర్స్ ఆఫ్ ఎవ్రీడే అనే ట్యాగ్‌లైన్‌లో ఓల్టస్ బెకో ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. ఓల్టస్ విక్రయాలను, పంపిణీని, సర్వీసులను చూసుకుంటే, ఆర్సెలిక్ టెక్నాలజీ, తయారీ సేవలను అందించనుంది. -
దీంట్లో ఉతకండి... కరెంట్ బిల్ రాదు
వాషింగ్ మెషీన్లో బట్టలుతికితే శ్రమ తగ్గుతుంది నిజమే కాని కరెంటు బిల్లు బాదడం మాత్రం ఖాయం. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న వాషింగ్‌మెషీన్ మాత్రం రూపాయి యూనిట్ కూడా కాల్చదు.. అసలు కరెంటే వాడనివ్వదు. అదెలా అనుకుంటున్నారా? చాలా సింపుల్. యంత్రం పక్కనే ఉన్న పిడిని చూశారుగా. దాన్ని గిర్రున తిప్పాలి అంతే. నీటిపైపును అనుసంధానించి సోప్పౌడర్ వేసి రెండు నిమిషాలు తిప్పితే ఉతకడం అయిపోతుంది. ఆ తరువాత రెండు నిమిషాలు నీళ్లతో జాడించడానికి, ఇంకో నిమిషం నీరు మొత్తాన్ని తీసేయడానికి ఖర్చవుతాయి. పిడిని తిప్పడం కష్టం కదా అనుకోకండి. అతితక్కువ బలంతో తిరిగేలా పిడిని డిజైన్ చేశామని కంపెనీ అంటోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘జెంటిల్ వాషర్’ అనే కంపెనీ అదే పేరుతో ఈ యంత్రాన్ని మార్కెట్ చేస్తోంది. ఒకసారికి దాదాపు 12 టీ షర్టులను ఈ యంత్రంలో వేసి ఉతికేయవచ్చు. సాధారణ వాషింగ్ మెషీన్‌తో పోలిస్తే సగం కంటే తక్కువ నీటితో ఉతకగలగడం దీని ప్రత్యేకత. ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌కు సమానమైన నాణ్యతతో జెంటిల్ వాషర్ పని చేస్తుందని ఇప్పటికే తేలిందట. -
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
-
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పన్ను రేట్లు అధికంగా ఉన్నందున్న తమ విక్రయాలు తగ్గిపోయాయంటూ తయారీదారులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వీటికి డిమాండ్‌ను పెంచనుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకోబోయే మరో కీలక నిర్ణయంతో ఎలక్ట్రిక్ వస్తువులు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌గా పరిగణలోకి రావని వెల్లడవుతోంది. ''అన్ని కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది. ధరలు తగ్గుతాయి. దీంతో డిమాండ్ పైకి ఎగుస్తుంది'' అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని తెలిపారు. గత వారంలోనే 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. షాంపూలు, వాషింగ్ పౌడర్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్లెట్లు, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి. -
ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరింత కాస్ట్లీ
ముంబై : ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు మరింత కాస్ట్లీగా మారబోతున్నాయి. వచ్చే నెల నుంచి వీటి ధరలు 3-5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెరిగిన ఇన్పుట్ వ్యయాల మేరకు ధరలు పెంచాలని ఈ వైట్ గూడ్స్ తయారీదారులు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో వీటి ధరలు పెరుగబోతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. గత ధరల పెంపు నుంచి ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయాలు 30-35 శాతం మేర పెరిగినట్టు తెలిసింది. స్టీల్ ధర 40 శాతం, కాపర్ ధర 50 శాతం పెరగడంతో పాటు రిఫ్రిజిరేటర్లలో ఎక్కువగా వినియోగించే కీలక కెమికల్ ఎండీఐ అంతర్జాతీయంగా లోపించింది. దీంతో ఇన్పుట్ వ్యయాలు రెండింతలు పైకి ఎగిశాయి. ఈ మూడు కలిపి ఇన్పుట్ వ్యయాల్లో 70 శాతం మేర నమోదవుతున్నాయి.. దీంతో వైట్ గూడ్స్ ధరలపై నికరంగా 5-6 శాతం ప్రభావం పడనుందని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. దీనిలో కొంత కంపెనీలు భరించి, మిగిలిన మొత్తం వినియోగదారులపై విధించనున్నట్టు పేర్కొన్నారు. తొలుత రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచుతామని వచ్చే నెల నుంచి ఈ పెంపు ఉంటుందని నంది తెలిపారు. తర్వాత వాషింగ్ మిషన్లు, అనంతరం జనవరి నుంచి ఏసీ ధరల సమీక్ష ఉంటుందన్నారు. వైట్ గూడ్స్‌లో మార్కెట్ లీడర్లుగా ఉన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, దాని ప్రత్యర్థి శాంసంగ్‌లు కూడా ఈ కేటగిరీ ఉత్పత్తులపై ధరల పెంపుకు సన్నాహాలు చేస్తున్నాయని దిగ్గజ రిటైల్ చైన్ చీఫ్ చెప్పారు. అయితే శాంసంగ్ ధరల పెంపును ఖండించగా.. ఎల్జీ ఇంకా స్పందించలేదు. -
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
-
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు దాదాపు విక్రయాలన్నీ డౌన్ అయ్యాయి. ఈ నోట్ల రద్దుతో పాటు, నగదు విత్‌డ్రాలో పరిమితులు విధించడం వినియోగదారుల తయారీ వస్తువులకు భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. వచ్చే ఆరునెలల వరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల విక్రయాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైట్ గూడ్స్‌గా పేరున్న టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 70 శాతం క్షీణించనున్నాయని, మార్కెట్లో ఈ గూడ్స్ ఎక్కువగా నగదు అమ్మకాలే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. '' వచ్చే ఆరు నెలల వరకు ఈ క్షీణతను కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ప్రజానీకానికి అవసరమైన మేరకు కొత్త కరెన్సీలు చలామణిలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఎదురవుతుంది'' అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. మంగళవారం రాత్రి 500, 1000 నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, సినిమా హాల్స్ వెలవెలపోయాయని, దీంతో ఫుడ్ అవుట్ లెట్స్ బిజినెస్‌లు 40 శాతం పతనమయ్యాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం విక్రయాలన్నీ పడిపోయినట్టు వీడియోకాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఎం సింగ్ తెలిపారు. నెలవారీ వాయిదాల ప్రకారం ప్రీమియం అప్లియన్స్, టెలివిజన్ కొనుగోళ్లు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం వరకు జరుగుతాయని, మిగతా 40 శాతం కొనుగోళ్లు నగదు చెల్లింపులతోనే జరుగుతున్నాయని రియాజ్ తెలిపారు. దీంతో నగదు చెల్లింపులతో చేసే కొనుగోళ్లన్నీ భారీగా దెబ్బతిన్ననున్నాయని వివరించారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా 500, 2000 నోట్లను ప్రజల్లోకి తీసుకొస్తున్నా.. వాటిపై పరిమితులు విధించడం వ్యాపారాలకు ప్రతికూలతేనని చెప్పారు. అయితే మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంచలన నిర్ణయం సెల్‌ఫోన్ విక్రయాలకు బాగా కలిసివచ్చిందట. ఈ రద్దును కొంతమంది వినియోగదారులు వారికి అవకాశంగా మరలుచుకుని, వెంటనే సెల్‌ఫోన్ రిటైల్ షాపులకు పరుగెత్తారు. దీంతో సెల్‌ఫోన్ రిటైలర్లు బిజెనెస్‌లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లను వినియోగదారులు భారీగా డిమండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు హ్యాండ్సెట్లు కొనుగోలు కూడా చేశారని ఓ లీడింగ్ సెల్‌ఫోన్ రిటైలర్ సీఈవో తెలిపారు. -
శాంసంగ్ నెత్తిన మరో బాంబు
-
శాంసంగ్ నెత్తిన మరో బాంబు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కష్టాలు వీడడంలేదు శాంసంగ్ గెలాక్సీ నోట్7 పేలుళ్ల బాధలనుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థను తాజాగా మరో వివాదం చుట్టుకుంది. శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు కూడా పేలుతున్న సంఘటనలు ఆందోళన రేపుతుండడంతో అమెరికాలో దాదాపు 30 లక్షల మెషీన్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. శాంసంగ్ వాషింగ్ మెషీన్లు పేలినపుడు బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని బాధిత వినియోగదారులు ఒకరు వివరించారు. తీవ్రమైన వైబ్రేషన్ రావడం లేదా వాషింగ్ మెషిన్ పైన వుండే టాప్ భయంకరమైన శబ్దంతో పేలిపోవడమోజరుగుతోందంటూ వినియోగదారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ పేలుళ్ల సందర్భంగా దవడ, భుజాలు విరిగిపోవడం లాంటి తీవ్ర గాయాలైన దాదాపు 733 కేసులు నమోదు కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 2011లో విక్రయించిన 34 మోడళ్ల మొత్తం 2.8 మిలియన్ల వాషింగ్ మెషీన్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మెషీన్లను కొనుగోలు చేసిన వారు ఫ్రీగా రిపేరు చేయించుకోవచ్చని, లేదా నగుదును మొత్తం తిరిగి తీసుకోవచ్చని తెలిపింది. లేదంటే మరో శాంసంగ్ మెషీనతో ఎక్సేంజ్ చేసుకుంటే స్పెషల్ రాయితీ అందిస్తున్నట్టు ప్రకటించింది. తమ విశ్వసనీయ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు తెలిపింది. అయితే నార్త్ అమెరికా వెలుపల అమ్మిన మోడల్స్ లో ఈ ప్రభావం లేదని చెప్పింది. మరోవైపు అమెరికాకు చెందిన కన్జ్యూమర్ సేఫ్టీ ప్రొడక్షన్ అధికారులు (సీపీఎస్సీ) కూడా ఈ విషయంలో వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే రిపేర్ చేయించుకోవాలని లేదా సేఫ్టీ కిట్ వాడాలని సూచించింది. కాగా శాంసంగ్ 2013లో ఆస్ట్రేలియాలో లక్షా యాభైవేల వాషింగ్ మెషిన్లను రీకాల్ చేసింది. అలాగే కొరియాకు చెందిన ఈ మొబైల్ మేకర్ తన తాజా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లు సృష్టించిన వివాదంతో భారీ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. -
స్టాక్స్ వ్యూ
వర్ల్‌పూల్ ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.616 టార్గెట్ ధర: రూ.732 ఎందుకంటే: ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, తదితర ప్రదాన గృహోపకరణాలను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. గుర్గావ్ కేంద్రంంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1980లో భారత్‌లోకి ప్రవేశించిన వర్ల్‌పూల్ 1995లో కెల్వినేటర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి అడుగిడింది. మైక్రోవేవ్ ఓవెన్లు, ఏసీ, వాటర్ ప్యూరిఫయర్స్, బిల్టిన్ అప్లయెన్సెస్, ఇతర ఉత్పత్తులకు విస్తరించింది. ఫరీదాబాద్,పాండిచ్చేరి, పుణేల్లో ప్లాంట్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.98 కోట్లకు, నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,100 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.162 కోట్లకు, స్థూల లాభం 18 శాతం పెరుగుదలతో రూ.146 కోట్లకు చేరాయి. షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం వృద్ధితో రూ.8కు పెరిగింది. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. ఈపీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.22కు పెరుగుతుందని భావిస్తున్నాం రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు కొనసాగవచ్చు. గృహోపకరణాల వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా పెరుగుతోంది. ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరిస్తోంది. పుుస్తక ధరకు, మార్కెట్ ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.74గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.79గానూ ఉండొచ్చని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.732 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐషర్ మోటార్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.18,892 టార్గెట్ ధర: రూ.22,500 ఎందుకంటే: భారత ప్రీమియమ్ బైక్ మార్కెట్లో ఐషర్ మోటార్స్ కంపెనీకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్(ఆర్ఈ) బ్రాండ్ మార్కెట్ వాటా 96 శాతంగా ఉంది. ఈ బైక్‌ల అమ్మకాలు మరో మూడేళ్లలో 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. పోటీ తక్కువగా ఉండడం, పటిష్టమైన స్థితిలో బ్రాండ్ ఉండడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడం, నెట్వర్క్ విస్తరణ, మార్కెట్ అగ్రస్థానం వంటి అంశాలు దీనికి దోహదపడతాయి. బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, కాంటినెంటల్ జీటీలతో మంచి అమ్మకాలు సాధిస్తోంది. రెండేళ్లుగా అమ్మకాల్లేక కుదేలవుతున్న వాణిజ్య వాహనాల(సీవీ) మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకోవడం, కొత్త వాహ నాలను అందుబాటులోకి తీసుకురానుండడం వంటి కారణాల వల్ల వాణిజ్య వాహనాల విక్రయాలు మూడేళ్లలో 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. ఆర్ఈ అమ్మకాలు పుంజుకోవడం, సీవీ మార్జిన్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల మూడేళ్లలో కంపెనీ ఆదాయం 30 శాతం, నికర లాభం 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఈ కంపెనీ షేర్ ధర 77 శాతం పెరిగింది. గత నెలలో 20 శాతం తగ్గినప్పటికీ, ఏడాది కాలంలో 50 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. గరిష్ట స్థాయి నుంచి చూస్తే 20 శాతం తగ్గి ప్రస్తుతం ఆకర్షణీయ ధరలో లభ్యమవుతోందని భావిస్తున్నాం. ఎలాంటి రుణ భారం లేని కంపెనీ. ఐదేళ్లలో షేర్ ధర రెట్టింపు అవుతుందని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.