సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పన్ను రేట్లు అధికంగా ఉన్నందున్న తమ విక్రయాలు తగ్గిపోయాయంటూ తయారీదారులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వీటికి డిమాండ్‌ను పెంచనుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు.
కేంద్రం తీసుకోబోయే మరో కీలక నిర్ణయంతో ఎలక్ట్రిక్ వస్తువులు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌గా పరిగణలోకి రావని వెల్లడవుతోంది. ''అన్ని కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది. ధరలు తగ్గుతాయి. దీంతో డిమాండ్ పైకి ఎగుస్తుంది'' అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని తెలిపారు. గత వారంలోనే 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్‌టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. షాంపూలు, వాషింగ్ పౌడర్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్‌లెట్లు, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్‌టీని 18శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment