
7–8 శాతం డిస్కౌంట్
ప్రకటించిన బాష్, సీమెన్స్
ముంబై: దసరా, దీపావళి కంటే ముందుగానే బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్(బీఎస్‌హెచ్) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ నుంచి ఉత్పత్తి అవుతున్న బాష్, సీమెన్స్ బ్రాండ్ల ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై 7 నుంచి 8 శాతం వరకు ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గింపు ధరలు గురువారం నుంచే అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. గతనెలలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ గున్జన్ శ్రీవాస్తవ వివరించారు. ’పండుగల సీజన్ దగ్గర పడుతున్న సమయంలో ధరలు తగ్గడం వల్ల కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 30–35 శాతం మేర ఆరోగ్యకర వృద్ధిరేటును నమోదుచేశాం. ఇదే స్థాయి వృద్ధిరేటును ఈఏడాదిలో కూడా ఆశిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే గోద్రేజ్ అప్లియెన్సెస్, శాంసంగ్, పానాసోనిక్ కంపెనీలు పలు గృహోపకరణాలపై 8% వరకు ధరలను తగ్గించాయి.