
న్యూఢిల్లీ: దసరా, దీపావళి వరకు ఆగవలసిన అవసరం లేకుండానే కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీలు డిస్కౌంట్ల సందడి చేయనున్నాయి. గడిచిన వారంలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని ఉత్పత్తి సంస్థలు కస్టమర్లకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. జీఎస్‌టీ భారం తగ్గిన జాబితాలో 27 అంగుళాల లోపు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు, హ్యాండ్ డ్రైయర్లు ఉండగా.. వీటి ధరలను త్వరలోనే 7–8 శాతం వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీలు చెబుతున్నాయి.
సవరించిన జీఎస్‌టీ రేట్లు జూలై 27 నుంచి అమలుకానుండగా, ఈ ప్రయోజనం మొత్తాన్ని కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తామని గోద్రేజ్ ప్రకటించింది. తమ బ్రాండ్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై త్వరలోనే 7–8% తగ్గింపు ఉంటుందని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వెల్లడించారు. జూలై 27 నుంచే జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగ దారులకు అందించనున్నట్లు ఎల్‌జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయ్ బాబు తెలిపారు. 26 అంగుళాల వరకు టీవీల ధరలను త్వరలోనే 7–8% వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు.