కోల్‌కతా : మరో రెండు రోజుల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్లపై ఈ కంపెనీల బాదుడు షురూ అవుతుంది. ఇప్పటికే ధర ఎక్కువగా ఉండే ఈ వస్తువులు, మరింత కాస్ట్‌లీగా మారనున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వీటికి కీలక వనరులుగా ఉంటున్న స్టీల్, కాపర్ ధరలు ఎగియడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నట్టు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చిన దగ్గరనుంచి ప్రీమియం మోడల్స్ ధరలన్నీ 400 వందల రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధరలు పెరుగతాయని తెలిపారు. ఇన్‌పుట్ కాస్ట్ ఒత్తిడి, రూపాయి విలువ పడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు తెలిపాయి.
ఈ ధరలు పెంపు జూన్ నుంచి దశల వారీగా ఉంటుందని గోద్రేజ్ అప్లియన్స్ బిజినెస్ హెడ్ కమల్ నండీ చెప్పారు. గోద్రేజ్ వీటి ధరలను 2 నుంచి 3 శాతం పెంచుతుండగా... దేశంలో అతిపెద్ద ఎయిర్-కండీషనర్ తయారీదారిగా ఉన్న ఓల్టస్ 3 శాతం ధరలను పెంచింది. త్వరలోనే తాము కూడా ధరలను పెంచుతామని వర్‌పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైతం చెప్పారు. అయితే ఈ ధరల పెంపుపై ఎల్‌జీ, శాంసంగ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రమోషన్ ఆఫర్లతో ఈ ధరల పెంపు ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గిస్తామని ఓల్టస్ ఎండీ ప్రదీప్ భక్షి అన్నారు. అయితే ఈ ధరల పెంపు తమ డిమాండ్‌పై ప్రభావం పడదని, 70 శాతం విక్రయాలు కన్జ్యూమర్ ఫైనాన్సింగ్‌పై ఆధారపడి ఉంటాయని ముంబైకి చెందిన రిటైలర్ విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment