సాయంత్రం చిరుతిళ్లు చాలామందికి అలవాటే! పకోడీలు, చిప్స్ వంటివి పంటి కింద కరకరలాడిస్తూ కబుర్లాడుకోవడం చాలామందికి ఇష్టమైన కాలక్షేపం. నూనెలో వేయించిన చిరుతిళ్లు తినేటప్పుడు మధ్యలో అదే చేత్తో మరో వస్తువు అందుకోవాలంటే, చెయ్యి కడుక్కోవడమో లేదా కనీసం టిష్యూపేపర్‌తో తుడుచుకోవడమో తప్పదు.
పదే పదే చేతులు తుడుచుకోవాల్సిన పరిస్థితులు కొంత చిరాకు కలిగిస్తాయి. అంతేకాదు, టిష్యూపేపర్ వృథాకు దారితీస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టడానికే అంతర్జాతీయ చిప్స్ తయారీ సంస్థ ‘లేస్’ ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ బుల్లి పరికరంలో అరచెయ్యంతా పట్టదు గాని, వేళ్లు ఇంచక్కా పట్టేస్తాయి. దీని ఎత్తు 15 సెం.మీ., వెడల్పు 11 సెం.మీ. ఇందులో వేళ్లు పెడితే చాలు, ఇట్టే శుభ్రమైపోతాయి. ఇందులో వేళ్లు పెట్టగానే, దీని పైభాగంలోని సెన్సర్లు గుర్తించి, ఇందులోని సిలిండర్ నుంచి ఆల్కహాల్‌ను స్ప్రే చేస్తాయి.
ఇందులోని వేడిమి వల్ల క్షణాల్లోనే వేళ్లు పొడిగా శుభ్రంగా తయారవుతాయి. యూఎస్‌బీ పోర్ట్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకుని ఇంచక్కా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి పైభాగంలోని సిలిండర్ లో ఆల్కహాల్‌ను ఎప్పటి కప్పుడు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎంత ముచ్చటగా ఉన్నా, మార్కెట్‌లో దీనిని కొనుక్కోవాలంటే కష్టమే! ‘లేస్’ సంస్థ ఇప్పటి వరకు ఈ పరికరాలను ఐదింటిని మాత్రమే తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment