
మహిళ నుంచి రూ.4 కోట్ల దోపిడీ
నిందితుడి అరెస్ట్
అల్లూరి సీతారామరాజు: నగరానికి చెందిన 35 ఏళ్ల మహిళ నాలుగేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి తెరపడింది. శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను రాంగ్ కాల్ ద్వారా పరిచయం చేసుకుని, ఆపై బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి.. 2020లో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో అక్షయ్ కుమార్ పొరపాటున బాధితురాలికి ఫోన్ చేశాడు. మొదట్లో ఆమె స్పందించకపోయినా, అతను మెసేజ్‌లు పంపుతూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాడు. బలవంతంగా స్నేహం కొనసాగిస్తూ.. మాట్లాడమని ఒత్తిడి చేశాడు.
ఆమె నిరాకరించడంతో తన వద్ద ఉన్న వాయిస్ రికార్డింగ్‌లను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. అంతేకాదు ఏకంగా రూ.10 లక్షలను సీఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్‌లో ఆమె నుంచి తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కారులో నగరంలోని హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి, వాటితో ఆమెను నిత్యం బెదిరించడం మొదలుపెట్టాడు. అలా దాదాపు రూ.4 కోట్ల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు వీడియోలు పంపుతానని బెదిరించడంతో పాటు, ఆమె భర్తపై యాసిడ్ దాడి చేస్తానని, పిల్లలను కిడ్నాప్ చేస్తానని కూడా బెదిరించాడు. గత వారం నిందితుడు నోవాటెల్‌కు రమ్మని డిమాండ్ చేయగా, బాధితురాలు నిరాకరించింది.
దీంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితికి చేరుకుంది. చివరకు ఆమె తన భర్త, కుటుంబ సభ్యుల సహాయంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక కారు, మొబైల్ ఫోన్, 65 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.