
గ్యాస్ బండపై రూ. 50 వడ్డింపు
సాధారణ వినియోగదారులతోపాటు నిరుపేద
ఉజ్వల పథకం లబ్ధిదారులకూ వర్తింపు
సీఎన్‌జీపైనా రూపాయి పెంపు
అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచి్చన కొత్త ధరలు.. పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 ఎక్సైజ్ సుంకం
సాక్షి, అమరావతి: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఉజ్వల కనెక్షన్లకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సిలిండర్ రేటు కూడా పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.525 కోట్లకుపైగా భారం
ప్రస్తుతం రాష్ట్రంలో 14.20 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.830 వరకు ఉంది. తాజా పెంపుతో రూ.880కి చేరనుంది. ఏపీలో కోటిన్నరకు పైగా యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి ఏడు సిలిండర్లు వినియోగిస్తుందనుకుంటే.. రూ.5,810 చెల్లించాలి. కానీ పెరిగిన ధరల ప్రకారం ఇకపై రూ.6,160 చెల్లించాల్సి వస్తుంది. కోటిన్నర కుటుంబాలపై ఈ గ్యాస్ ధర పెంపు భారం ఏడాదికి రూ.525 కోట్లకుపైగా పడనుంది.
ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేసేంది మాత్రం రూ.10లోపే ఉంటోంది. సాధారణంగా ప్రతి నెలా 1న వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారతాయి. కొద్ది రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వచి్చన కంపెనీలు, ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్ల కొత్త రేట్లు ప్రకటించాయి. ఇందులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఇంతలోనే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను అనూహ్యంగా పెంచడంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.