బండ బాదుడు!
సిలిండర్ నిర్ణీత ధర కంటే అదనపు వసూళ్లు
డెలివరీ బాయ్స్ ఆగడాలు
వినియోగదారుల జేబులకు చిల్లులు
నెలకు రూ.8.17 కోట్లకు పైగా భారం
సిటీబ్యూరో: మహా నగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. సిలిండర్ అసలు ధర కంటే అదనంగా వసూలు చేస్తూ డెలివరీ బాయ్స్ పబ్లిక్‌గా దోచుకుంటున్నారు. ఇలా ఒక నెలలో వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల 17 లక్షల రూపాయల పైమాటే. కొందరు వినియోగదారులు ‘చిల్లర’ కదా... అని తేలికగా తీసుకోవడంతో అది కాస్త డిమాండ్‌గా మారింది. ఎవరైనా ఇలా ఇచ్చుకోలేకపోతే రుసరుసలు తప్పవు. దీంతో అందరూ అదన ంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది పేదలకు భారంగా మారుతోంది. డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.662 ఉండగా... డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690. అంటే నిర్ణీత ధర కంటే అదనంగా రూ.28 వంతున లాక్కుంటున్నారు. మహా నగరం మొత్తం వినియోగదారులు నెలకు ముట్ట జెప్పుతోంది లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.
ఏజెన్సీల నిర్లక్ష్యం...
వినియోగదారులకు సిలిండర్‌ను డోర్ డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)తో కలుపుకొని బిల్లు వేసి.. వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల ధరనే బిల్లుపై వేస్తున్న ఏజెన్సీలు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తుండగా...
మరికొందరు సిలిండర్ల సంఖ్యను బట్టి కమీషన్ చెల్లిస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం సరఫరా సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. కానీ ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్న నిబంధనలను వారు మరచిపోయారు.
ఇవీ నిబంధనలు
వినియోగదారుడు ఆన్‌లైన్‌లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లుతో డోర్ డెలివరీ చేయాలి.
ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయాలి.
6 నుంచి 15 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి.
16-30 కిలోమీటర్ల దూరానికి రూ.15 వసూలు చేయాలి
వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి.