సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మంగళవారం నుంచి తలపెట్టనున్న నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. సిలిండర్ ధర అంతటా ఒకే విధంగా ఉండాలని, డిస్ట్రిబ్యూటర్‌షిప్ అగ్రిమెంట్లను సమీక్షించాలని, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌పై వేస్తున్న ప్లాస్టిక్ సీలుకు బదులుగా పకడ్బందీ సీలును అమర్చాలని.... తదితర డిమాండ్లతో డిస్ట్రిబ్యూటర్లు సమ్మె చేయదలిచారు..
మార్కెట్‌లో రెండు, మూడు, ఐదు కిలోల సిలిండర్లు విచ్చలవిడిగా చలామణిలో ఉన్నాయని, ఇవన్నీ అక్రమమైనవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవని ఆలిండియా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య కర్ణాటక సర్కిల్ కార్యదర్శి ఎన్. సత్యన్ ఆరోపించారు. సిలిండర్లపై ప్రస్తుతం వేస్తున్న ప్లాస్టిక్ సీళ్లను లాఘవంగా తొలగించి గ్యాస్‌ను దొంగిలించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ కింద ఇస్తున్న 14.2 కిలోల సిలిండర్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటోందని తెలిపారు. అలా కాకుండా ఒకే ధరను నిర్ణయించాలన్నారు.
వీటికి తోడు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ 2,700 మంది రెగ్యులర్ డీలర్లను, రాజీవ్ గాంధీ గ్రామీణ ఎల్‌పీజీ వితరణ యోజన కింద మరో 1,500 మంది డీలర్లను నియమించాల్సిందిగా చమురు కంపెనీలను ఆదేశించిందని వెల్లడించారు. ఇదే కనుక అమలైతే ప్రస్తుత డీలర్లందరూ నష్టపోతారని వివరించారు. కాగా సమ్మెను విరమింపజేయడానికి సమాఖ్య ప్రతినిధులతో అధికారులు సోమవారం రాత్రి కూడా చర్చలు జరిపారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇవ్వడంతో డీలర్లు సమ్మె యోచనను విరమించుకున్నారు.
తప్పిన గండం
Published Tue, Feb 25 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement