
ఫీజు చెల్లించలేదని గంటలు తరబడి బయటే నిలబెట్టిన యాజమాన్యం
అవమానంగా భావించి కళాశాల మూడో అంతస్తు పైనుంచి దూకిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి
అక్కడికక్కడే మృతి అనంతపురంలో ఘటన
అనంతపురం ఎడ్యుకేషన్/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చరణ్ సోదరుడు సర్దిచెప్పి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు.
తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసేశారు.
కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది.