
కోల్‌కతా: డ్రై సెల్ బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో పూర్తిస్థాయి యాజమాన్య నియంత్రణకు వీలుగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు షేరుకి రూ. 320 ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 5.26 శాతం అదనపు వాటా కొనుగోలు ద్వారా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది.
పరిస్థితులను గమనిస్తున్నాం
ఎవరెడీలో పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న డాబర్ కుటుంబంలోని మోహిత్ బర్మన్ కంపెనీ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీని దారిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలియజేశారు. ఎవరెడీ బ్రాండుకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీకి విలువ జోడింపును చేపడుతామని, తద్వారా బిజినెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలమని వ్యాఖ్యానించారు. ఎవరెడీ కొనుగోలులో డాబర్ ఇండియా ప్రత్యక్షంగా పాల్లొనకపోవడం గమనార్హం! ఎవరెడీ ప్రమోటర్లు బీఎం ఖైతాన్ కుటుంబం మెక్‌నల్లీ భారత్ ఇంజినీరింగ్ రుణ చెల్లింపులకు, ఇతర రుణాలకుగాను కంపెనీ షేర్లను తనఖాలో ఉంచుతూ వచ్చారు. అయితే చెల్లింపుల్లో విఫలంకావడంతో రుణదాత సంస్థలు వీటిని విక్రయిస్తూ వచ్చాయి. దీంతో ఖైతాన్ వాటా 44 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించింది.
ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో డాబర్ ఇండియా షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 565కు చేరగా.. ఎవరెడీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 375 వద్ద ముగిసింది.