
ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి.
అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్‌తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు.
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్‌కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.
యూనస్ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి.
మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్‌కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి.
ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్‌కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.
ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్‌తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.
బంగ్లాదేశ్‌కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది.
ప్రధాన సలహాదారయ్యాక యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు.
కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.