
ఎండలు బాగా ముదిరాయి. స్థోమత ఉన్నవారు ఎయిర్ కండిషనర్స్‌నూ, అంతగా స్థోమత లేనివారు ఎయిర్ కూలర్స్‌నూ వాడుతుంటారు. ఏసీల కారణంగా గదిలో ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో మెయింటెయిన్ అవుతుండటంతో టు అందులోని కొన్ని ఫిల్టర్లు చాలా చాలా చిన్నగా, అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) బారి నుంచీ కాపాడతాయి. శబ్దకాలుష్యాన్నీ నివారించి... చెవి, ఇతరత్రా సమస్యలు రాకుండా చూస్తాయి. కానీ వాటివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అలాగే ఎయిర్ కూలర్స్‌లో, లీజియొన్నెల్లా అనే బ్యాక్టీరియా పెరిగి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’కు గురయ్యే ముప్పు ఉంటుంది. ఏసీలూ, కూలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలూ, అవి రాకుండా నివారించే జాగ్రత్తలను తెలుసుకుందాం.
ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి...
తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ చాలాసేపు ఏసీలో గడపడం వల్ల ఆ చల్లదనం మూలాన కొందరిలో ఒళ్లునొప్పులు, తలనొప్పితోపాటు తీవ్రమైన నీరసం, నిస్సత్తువగా అనిపించవచ్చు.
శ్వాస సమస్యలు : గదిలోని ఏసీగానీ లేదా కారులోని ఏసీగానీ చాలాసేపు ఆన్‌లో ఉండటం, దాంతో గది లేదా కార్ డోర్స్ / గ్లాసెస్ ఎప్పుడూ మూసేసే ఉండటంతో అక్కడి సూక్ష్మజీవులతో పక్కనే ఉన్న ఇతరులకు ఆ సమస్యలు వ్యాపించవచ్చు. కొందరిలో ఆస్తమానూ, పిల్లికూతలనూ ప్రేరేపించవచ్చు. అందువల్ల... ఏసీ గదిలోగానీ లేదా ఏసీ ఆన్ చేసి ఉన్న కారులోగానీ అదేపనిగా చాలాసేపు ఉండటం అంత మంచిది కాదు.
తేలిగ్గా వడదెబ్బకు గురికావడం : ఎప్పుడూ ఏసీలో ఉండేవారు దానికి అలవాటైపోయి తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
చర్మం పొడిబారడం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గి, చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురదలు వచ్చే అవకాశాలెక్కువ. వీళ్లు చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
మూత్రపిండాల్లో రాళ్లు : ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి అంతగా దాహంగా అనిపించకపోవడంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో ఇలాంటివాళ్లలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలెక్కువ.
దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యురైటిస్ (నరాల చివరలు మొద్దుబారినట్లుగా అయిపోయి స్పర్శ అంతగా తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవాళ్లలో ఆ సమస్యలు కాస్త తీవ్రమవుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండటం
ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడిగినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే బిగించడం
ఎప్పుడూ ఏసీలో ఉండేవారు సాయంత్రాలూ లేదా రాత్రిపూట స్వాభావికమైన చల్లగాలికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉండటం.
ఏసీ సరిపడక ఏవైనా ఆరోగ్యసమస్యలు వస్తే ఏసీని వాడకపోవడం లేదా గది చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసుకుని ఫ్యాన్ వేసుకోవడం.
వాటర్ కూలర్‌తో వచ్చే నిమోనియా నివారణ ఇలా...
కిందటేడాది వాటర్ కూలర్ వాడాక దాన్ని మూల పెట్టేసి ఉంచి, ఇప్పుడు ఎండలు ముదరగానే వాడటానికి తీసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గతంలో మిగిలి ఉన్న నీళ్లలో లీజియోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.దాంతో ‘లీజియోన్నేరిస్ డిసీజ్’ అనే ఒక రకం నిమోనియా వచ్చే అవకాశముంది. దీన్నే ‘వాటర్‌కూలర్ నిమోనియా’ అని కూడా అంటారు.
చాలాకాలం వాడని కూలర్స్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండి, నేరుగా ఆన్ చేస్తే అది ఆస్తమా బాధితుల్లో సమస్యను ట్రిగర్ చేయవచ్చు. మామూలు వ్యక్తులకు సైతం దగ్గు, ఆయాసం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే బయటకు తీయగానే వాటర్‌కూలర్ అడుగున ఏమాత్రం చెమ్మలేకుండా చేసేందుకు ఆరుబయట ఆన్ చేసి పెట్టి దాదాపు గంటసేపు అలాగే ఉంచాలి. అడుగున ఒక్క చుక్క నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయాకే వాటర్ కూలర్ వాడటం మొదలుపెట్టాలి.
(చదవండి: ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..)